గ్రామాలలో అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు
ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేసుకొని అమ్మకాలు
పరకాల,నేటిధాత్రి మండలంలోని పలు
గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలు పెరుగుతూ సామాజిక సమస్యగా మారుతున్నాయి. అధికారిక మద్యం దుకాణాలు ఉన్నప్పటికీ,వాటిని పక్కనబెట్టి గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు విస్తరిస్తుండటం స్థానికుల్లో ఆందోళనకు దారితీస్తోంది.నియమ నిబంధనలు పట్టించుకోకుండా కొందరు వ్యక్తులు ఇళ్లలోనే మద్యం నిల్వ చేసి విక్రయాలు నిర్వహిస్తున్నారు.ప్రత్యేకంగా సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఈ అక్రమ దుకాణాలు రద్దీగా కొనసాగుతున్నాయి.పని ముగించుకున్న తర్వాత పలువురు ఈ ప్రాంతాలకు వెళ్లడం సాధారణంగా మారింది.యువతలో మద్యం వినియోగం పెరుగుతుండటం భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతోందని పెద్దలు పేర్కొంటున్నారు. మద్యం అలవాటుతో కుటుంబాల్లో కలహాలు,ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నాయి.కొన్ని కుటుంబాలు అప్పుల బారిన పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.కుటుంబ శాంతి భంగం చెంది సామాజిక వాతావరణం దెబ్బతింటోందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.గ్రామ శాంతిభద్రతలకు కూడా ఈ పరిస్థితి సవాలుగా మారుతోంది.ఇక కొంతమంది బెల్ట్ షాపు నిర్వాహకులు ఇంటి సమీపంలో ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేసి వ్యాపారం కొనసాగిస్తున్నారు. మరికొందరు దీనినే జీవనాధారంగా ఎంచుకొని ఇతర ఏ పనులకు వెళ్లకుండా మద్యం విక్రయాలను విస్తరిస్తున్నారు.ఈ నేపథ్యంలో అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. గ్రామాల్లో శాంతి,సౌభ్రాతృత్వం కాపాడేందుకు సమాజం మొత్తం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
