సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపు ఖాయం: కేటీఆర్

ప్రతి ఇంటికి బీఆర్‌ఎస్ అభివృద్ధి…

ప్రతి గడపకు కాంగ్రెస్ బాకీ కార్డు

సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదంతో మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం

సిరిసిల్ల అభివృద్ధి ప్రజల కళ్లముందే ఉంది – కాంగ్రెస్ మాటలే మిగిలాయి

ప్రతి ఇంటికి బీఆర్‌ఎస్ అభివృద్ధి… ప్రతి గడపకు కాంగ్రెస్ బాకీ కార్డు

సిరిసిల్ల మున్సిపల్ వార్డు ఇంచార్జిలతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం

సిరిసిల్ల(నేటి ధాత్రి):

సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో గులాబీ జెండానే ఎగరబోతుందని మెజారిటీ వార్డులను గెలవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ పార్టీ ముందుకు సాగుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్, సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికలపై వార్డు ఇంచార్జిలతో నిర్వహించిన సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు.సిరిసిల్ల ఒకప్పుడు ఎలా ఉందో, బీఆర్‌ఎస్ పాలనలో ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలకు స్పష్టంగా వివరించాలని కేటీఆర్ సూచించారు. “మన పని మనమే చెప్పుకోవాలి… వేరే ఎవరు చెప్పరు” అని ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఇక స్థానిక ఎన్నికలు ఉండవని, నేరుగా సాధారణ ఎన్నికలే ఉంటాయని పేర్కొంటూ, సిరిసిల్ల మున్సిపాలిటీ గెలవడమే కాదు – అన్ని వార్డులను బీఆర్‌ఎస్ కైవసం చేసుకోవాల్సిందే అని స్పష్టంగా చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన పేరుతో గందరగోళం సృష్టిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎత్తివేయాలనే కుట్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని, ఈ అంశం సిరిసిల్ల ప్రజలు, న్యాయవాదులు, మేధావుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. జిల్లాలను ఎత్తివేయడానికి సిద్ధమైన ప్రభుత్వం సెస్‌ను కూడా ఎత్తివేయడంలో ఆశ్చర్యం లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలనను తుగ్లక్ తరహా నిర్ణయాల పాలనగా అభివర్ణించారు.
సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ షాక్‌లో ఉందని, అందుకే కార్పొరేషన్ ఎన్నికలు పెట్టడానికి భయపడుతోందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో 40 శాతం పైగా సర్పంచ్ స్థానాలను బీఆర్‌ఎస్ కైవసం చేసుకుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేళ్ల మీద లెక్కపెట్టే స్థానాలను కూడా గెలవలేదన్నారు.
సిరిసిల్ల పట్టణం గత 35 ఏళ్లుగా కాంగ్రెస్‌కు దూరంగా ఉందని, బీఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత మున్సిపాలిటీపై పూర్తి ఆధిపత్యం సాధించామని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సింగిల్ డిజిట్ కూడా దాటలేని పరిస్థితిలో ఉన్నాయని అన్నారు.
బీఆర్‌ఎస్ చేసింది ప్రతి ఇంటికి చెప్పాలి… కాంగ్రెస్ బాకీ కార్డు ప్రతి గడపకు తీసుకెళ్లాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయో, వృద్ధులు, మహిళలు, రైతులు, నేతన్నలు, రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం ఎంత బాకీ పెట్టిందో ప్రజలకు వివరించాలని సూచించారు. సంక్రాంతి దాటినా రైతు బంధు రాలేదని, బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వలేదని, రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్లు కూడా దిక్కు లేని పరిస్థితి ఉందని విమర్శించారు. నేతన్నలకు నిజమైన అండగా నిలిచింది కేవలం బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు.
సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలను నేరుగా తానే పర్యవేక్షిస్తానని ప్రకటించిన కేటీఆర్, ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్‌ఎస్ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్ ఫీవర్ పట్టుకుందని, సిరిసిల్ల ప్రజలంతా గులాబీ జెండా వైపే ఉన్నారని స్పష్టం చేశారు.

సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త, ప్రతి వార్డు ఇంచార్జి ఇంటింటి ప్రచారం చేస్తూ ప్రజల మధ్యకు వెళ్లాలని, అభివృద్ధిని వివరించి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version