సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి రాసిన బహిరంగ లేఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖలో ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు తీరుపై విమర్శలు చేస్తూ సాగింది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధికి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ పేరుతో రూపొందించిన డాక్యుమెంట్ పుస్తకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీకి వచ్చి స్వయంగా మీకు అందించారు. ఆ సమయంలో 2 సంవత్సరాల పాలనలో ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న దూరదృష్టిని అభినందించినట్లు, తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు ప్రకటించారు. కానీ, 2023 లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో 17 సెప్టెంబర్, 2023 న హైదరాబాద్ నగర శివారులోని తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభకు విచ్చేసిన మీరు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభయహస్తం పేరిట కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోను ఆవిష్కరించడమే కాకుండా స్వయంగా 6 గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ప్రకటించారు.
