పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా అద్వానీ
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani), హీరో సిద్దార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) తల్లిదండ్రులు అయ్యారు. కొద్దిసేపటి క్రితమే కియారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఇరు కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసింది. తల్లీబిడ్డా ఇద్దరు క్షేమంగానే ఉన్నారని బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది. కియారా అద్వానీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భరత్ అనే నేను సినిమాతో తెలుగుతెరకు పరిచయమై మంచి విజయాన్ని అందుకున్న ఈ భామ ఆ తరువాత వినయ విధేయ రామ సినిమాతో చరణ్ సరసన జతకట్టి ప్లాప్ ను మూటకట్టుకుంది.
ఇక ఈ ఏడాది మరోసారి చరణ్ సరసన గేమ్ ఛేంజర్ లో నటించి ఇంకో ప్లాప్ ను అందుకుంది. టాలీవుడ్ లో ప్లాప్ లు అందుకున్నా.. బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్ గా కోనసాగుతోంది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే 2023 లో సిద్దార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లాడింది. పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిన కియారా గతేడాది చివర్లో ప్రెగ్నెంట్ అనిఅభిమానులకు తీపి కబురు చెప్పుకొచ్చింది. ఇక సిద్దార్థ్.. భార్యను కాలు కిందపెట్టకుండా చూసుకుంటూ ఆమెకు ఏది కావాలన్నా ఇట్టే అమర్చి .. మంచి భర్త అని అనిపించుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ క్యూట్ కపుల్.. తల్లిదండ్రులుగా మారారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ విషయం తెలియడంతో అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక సిద్ , కియారా కెరీర్ల విషయానికొస్తే.. ప్రస్తుతం కియారా వార్ 2 లో నటిస్తోంది. సిద్.. పరమ సుందరి సినిమాతో బిజీగా ఉన్నాడు.