కేసీఆర్ మార్క్ పాలిటిక్స్ ‘గేమ్ ఛేంజర్’గా బీఆర్ఎస్?

కేసీఆర్ మార్క్ పాలిటిక్స్
‘గేమ్ ఛేంజర్’గా బీఆర్ఎస్?

వరుస ఓటములతో డీలా పడ్డ బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపేందుకు గులాబీ బాస్ కేసీఆర్ ‘జగిత్యాల జైత్రయాత్ర’ను ఒక అస్త్రంగా మలుచుకోబోతున్నారు. కేవలం ఒక నేత చేరికగానే కాకుండా, దీన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో పార్టీ పునర్వైభవానికి నాందిగా భావిస్తున్నారు. అందుకే ఈ సభ బాధ్యతలను పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి వంటి హేమాహేమీలకు అప్పగించి, ప్రతి గ్రామం నుంచి జన సమీకరణ చేసేలా ‘ఎన్నికల తరహా’ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. గత మూడేళ్లుగా ఫామ్ హౌజ్‌కే పరిమితమయ్యారనే విమర్శలను చెరిపివేస్తూ, కేసీఆర్ స్వయంగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి భారీ బహిరంగ సభ ద్వారా తన రాజకీయ వ్యూహాన్ని చాటబోతున్నారు.

గడిచిన మూడేళ్లలో బీఆర్ఎస్ ఎదుర్కొన్న వరుస పరాజయాలు—పార్లమెంటు ఎన్నికల్లో సున్నా ఫలితాలు, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటములు పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేశాయి. వీటన్నిటికీ తోడు కల్వకుంట్ల కవిత పార్టీని వీడి కొత్త కుంపటి పెట్టేందుకు సిద్ధమవ్వడం కేసీఆర్ కుటుంబానికి, పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నెల 25న ఆమె కొత్త పార్టీ ప్రకటించనున్న నేపథ్యంలో, అంతకంటే ముందే జగిత్యాల సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం ద్వారా కేడర్ చెల్లాచెదురు కాకుండా చూసుకోవాలని అధిష్టానం భావిస్తోంది. పార్టీ నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకునేందుకు ఏప్రిల్ 27 ప్లీనరీ కంటే ముందే ఈ సభ ద్వారా తన బలాన్ని నిరూపించుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా, ఎన్నికల హామీల అమలులో జరుగుతున్న జాప్యాన్ని ఎండగట్టడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ, పాలనలో వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు జీవన్ రెడ్డి వంటి అనుభవం ఉన్న నాయకుడి చేరిక ఒక బలమైన ఆయుధంగా మారుతుందని కేటీఆర్, హరీష్ రావు అంచనా వేస్తున్నారు. రానున్నది ఎన్నికల సంవత్సరం కావడంతో, ఇప్పటి నుంచే గేర్ మార్చి భారీ జన సమీకరణ ద్వారా ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ప్రదర్శించాలని చూస్తున్నారు. ఈ సభ ద్వారా కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ తీయడమే కాకుండా, తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ మళ్లీ “గేమ్ ఛేంజర్” అని నిరూపించుకోవాలని సర్వశక్తులొడ్డుతోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version