గోల్డెన్ ట్రయాంగిల్ వార్!
డ్రాగన్ గర్జన!
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అంటేనే ఒక అంతుచిక్కని మిస్టరీగా మారిపోయింది. ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో మొదలై, కథ మార్పులు, షూటింగ్ వాయిదాల వరకు వస్తున్న వార్తలు అభిమానులను ఒకానొక అనిశ్చితిలోకి నెట్టేశాయి.
అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు జరుగుతుందో, ఎప్పుడు వాయిదా పడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఒక దశలో కథనే పూర్తిగా మార్చేశారంటూ వార్తలు వచ్చాయి. ఈ అనిశ్చితి మధ్య ఎన్టీఆర్ బాడీ బిల్డింగ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే దానిపై కూడా విమర్శలు చెలరేగాయి.
అయితే ఈ సినిమాను ‘గోల్డెన్ ట్రయాంగిల్’ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. థాయ్‌లాండ్, మయన్మార్, లావోస్ కలిసే ప్రాంతాన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. ఒకప్పుడు ఇది మాదకద్రవ్యాల ఉత్పత్తికి అతిపెద్ద కేంద్రం. ఈ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని ‘డ్రాగన్’ వస్తోందని అంటున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినిమా అప్‌డేట్స్ వస్తాయని ప్రచారం జరుగుతోంది. టీజర్ వస్తుందనే మాటలు వినిపిస్తున్నా, అభిమానులు మాత్రం టీజర్ సంగతి పక్కనపెడితే, కనీసం టైటిల్, రిలీజ్ డేట్ చెప్పండి చాలు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. డ్రాగన్ చుట్టూ నడుస్తున్న ఊహాగానాలు, ప్రచారాల్లో కొన్నింటికి వచ్చే నెలలో తెరపడే అవకాశం ఉంది.
