విలీనం ఓ కల్పితం!

`తెలంగాణ గుండెకు కేసీఆర్‌ రక్షణ కవచం.

`బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం అసమర్థుల ప్రచారం.

`రాజకీయ పార్టీలు ఆడుతున్న నాటకం.

`బీఆర్‌ఎస్‌ మీద విసురుతున్న పాచికలకు నిదర్శనం.

`నాయకులను వలలో వేసుకునే పన్నాగం.

`జాతీయ పార్టీలు సృష్టించాలనుకుంటున్న సుడి గుండం.

`కేసీఆర్‌ గుండె నిబ్బరం మీద ప్రయోగం.

`ఎప్పటికీ చెక్కు చెదరనిదే కేసీఆర్‌ ధైర్యం.

`కృష్ణార్జునులను విడదీయాలనే వ్యూహంలో భాగం.

`తెలంగాణలో బిఆర్‌ఎస్‌ కు బలమైన యంత్రాంగం.

`ఉద్యమబాటలో నడిచిన సైనికులున్న బలం.

`పార్టీని కంటికి రెప్పలా కాపాడుకోగల నాయకులున్న సమాజం.

`తెలంగాణ గుండెల నిండా నిండిన గులాబీ వనం.

`కేసీఆర్‌పై చెక్కు చెదరని ప్రజాభిమానం.

`తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసిఆర్‌ను కొలిచే జనం.

`తెలంగాణ వున్నంత వరకు బిఆర్‌ఎస్‌ను నిలువరించడం కష్టం.

`బీఆర్‌ఎస్‌ ఉనికిని ప్రశ్నార్థకం చేయడం కలలో కూడా అసాధ్యం

బీఆర్‌ఎస్‌, బిజేపిలో విలీనం అంటూ వస్తున్న కట్టు కథల మీద స్పందించి, రాజకీయాలను కలుషితం చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తెలంగాణ అంటేనే కేసిఆర్‌, కేసిఆర్‌ అంటేనే తెలంగాణ అంటున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో బిఆర్‌ఎస్‌ పార్టీ గురించి చెప్పిన సంచలన విషయాలు.. ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాటల్లోనే..

పై పై మాటలు కాదు. ఒకసారి పల్లెల్లోకి వెళ్లండి. పల్లెల్లో ప్రజలు పడుతున్న బాధలు చూడండి. పల్లెల్లో పరిస్ధితులు బాగు చేయండి. రైతుల అవస్ధలు తెలుసుకోండి. ఇవేవీ చేయం. కాని రాజకీయమే చేస్తాం. పెత్తనమే చేస్తాం. అడిగితే ప్రజలను బెదిరిస్తం. లేకుంటే కేసులు పెడతం..ఇదేనా పాలనంటే..ఇదేనా ప్రజల పట్ల పాలకుల కర్తవ్యం. పని చేయడం చేత కాదు. రైతులకు నీళ్లించే సోయి లేదు. రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునే చిత్తశుద్ది లేదు. ప్రజా సేవ చేయాలన్న అంకితభావం లేదు. పదవులుంటే చాలు. అనుకునే నాయకులు కాంగ్రెస్‌, బిజేపిలలో ఎక్కువయ్యారు. అందుకే తెలంగాణకు ఈ దౌర్భాగ్య పరిస్ధితులు వచ్చాయి. పదేళ్లపాటు పచ్చగా, చల్లగా వున్నతెలంగాణ ఎందుకు ఇలా తయారైంది. ఎందుకు పంటలు ఎండిపోతున్నాయి. ఎందుకు ఎరువులు దొరకడం లేదు. ఎందుకు నీళ్లందడం లేదు. ఎందుకు రైతు భరోసా ఇవ్వడం లేదు. ఎగ్గొట్టిన భరోసాకు దిక్కేవరు? ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్‌ కథలు, బిజేపి అబద్దాలకు లెక్కలేకుండాపోతోంది. వీళ్లు చేసిన సక్కదనాలకు బిఆర్‌ఎస్‌ పార్టీ బిజేపిలో విలీనలమౌతుంది? బిఆర్‌ఎస్‌ పార్టీ బిజేపిలో కలిసిపోతుందని లేని సోది మొదలు పెట్టారు. రెండు జాతీయ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు. వ్యవస్ధను భ్రష్టుపట్టిస్తున్నారు. రాజకీయాలను కలుషితం చేస్తున్నారు. పనికి రాని, పసలేని ముచ్చట్లు చెబుతూ కాల యాపన చేస్తున్నారు. ప్రజల గోస పుచ్చుకుంటున్నారంటున్న సీనియర్‌ బిఆర్‌ఎస్‌ నాయకుడు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో తెలంగాణ పరిస్ధితులు, రాజకీయాలు, విలీనం ముచ్చట్లపై చెప్పిన ఆసక్తికరమైన అంశాలు..ఆయన మాటల్లోనే…

బిఆర్‌ఎస్‌, బిజేపిలో ఎందుకు విలీనమైతుంది. బిఆర్‌ఎస్‌ మీద కట్టుకథలు, పిట్ట కధలు అల్లి లేనిపోని రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. పాలన చేతగాక, ప్రజలకు ఇచ్చిన హమీలు అమలు చేయలేక ప్రజల దృష్టి మళ్లించి కాలం గడుపుకుందామనుకుంటున్నారు. బిఆర్‌ఎస్‌ అన్నీ నిశితంగా గమనిస్తూనే వుంది. తెలంగాణలో కక్ష్యపూరిత రాజకీయాలు తేవాలని రెండు పార్టీలు బలంగా ప్రయత్నం చేస్తున్నాయి. రెండు జాతీయ పార్టీల నాయకులు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు. విచిత్రమేమిటంటే బిజేపిలో వున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి మాట్లాడుతున్న మాటలు ఎంత చిల్లరగా వుంటున్నాయి. ఒక హోం మంత్రి మాట్లాడాల్సిన మాటలేనా? జనం నవ్వుకుంటారన్న సోయి కూడా లేకుండాపోయింది. ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే ఒంగబెట్టి గుద్దుతా అనే మాట బండి సంజయ్‌కు వినిపించడం లేదు. కాని మా నాయకుడు కేటిఆర్‌ మాట్లాడే మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఇలాంటి రాజకీయాలు దేశంలో ఎక్కడా చూడడం లేదు. కేంద్రంలో అధికారంలో వుండి బిజేపి రాష్ట్రానికి చేస్తున్నదేమీ లేదు. రాష్ట్రంలో అధికారంలో వుండి కాంగ్రెస్‌ చేస్తున్న మేలు ఏం లేదు. ఆరు గ్యారెంటీలు ఎక్కడపోయినయ్‌…ఆ ముచ్చట మాట్లాడరు. ఎంత సేపు కాళేశ్వరం ముచ్చట జీడి పాకంలా సాగదీస్తారు. కాలయాపన చేస్తున్నారు. కాళేశ్వరం విషయంలో కొండను తవ్వి ఎలుకను పట్టుకోవడం తప్ప మరేం వుండదు. ఫోన్‌ ట్యాపింగ్‌ అంటారు. దానిలో ఎలాంటి ఆధారం లేదు. కాని ఏదో జరుగుతున్నట్లు ప్రచారం చేసుకోవడం తప్ప ఏమీ వుండదు. ఈ రెండు సమస్యలను అటు తిప్పి ఇటు తిప్పి రాజకీయం చేయడం తప్ప ప్రజా సమస్యలు పట్టించుకునేది లేదు. ఇందుకేనా ఒక్కఛాన్స్‌ అంటూ ఎన్నికల ముందు ప్రజలను వేడుకున్నది. ఇందుకేనా ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించుకున్నది. మీకు చేతనైతే బిఆర్‌ఎస్‌ కంటే మెరుగైన పాలన సాగించమని కేసిఆర్‌ కూడా కాంగ్రెస్‌కు సూచించారు. ఎంతో హుందాగా కేసిఆర్‌ మీకు ప్రజల ఆశీర్వాదం దొరికింది. బాగా పనిచేయండి. ప్రజల మనసు గెలుకోండి..లేనిపోని కయ్యాలు..కిరికిరి రాజకీయాలు చేయకండి అని చెప్పారు. ఇంత ఔన్నత్యమైన మాటలు చెప్పే నాయకుడు కేసిఆర్‌ కాకుండా ఎవరైనా వుంటారా? అధికారంలోకి వస్తే లంకెబిందెలుంటాయనుకున్నాము. ఉట్టి కుండలేవున్నాయని ఏ పాలకుడైనా చెప్పుకుంటారా? సిగ్గు మాలిన తనం తప్ప ఇందులో మరేమైనా వుందా? అందుకే ప్రజలు ఎన్నికలు ఎప్పుడొస్తాయా? మళ్లీ కేసిఆర్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామా! అని వేయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రజల్లో కాంగ్రెస్‌మీద తీవ్రమైన ఆగ్రహంతో వున్నారు. పదేళ్లు కష్టపడకుండా, కళ్లలో పెట్టుకొని చూసుకున్న కేసిఆర్‌ను కాదనుకున్నందుకు మళ్లీ యాభై ఏళ్ల వెనక్కు వెళ్లినట్లు బాధపడుతున్నారు. కేసిఆర్‌ కాలేశ్వరం కట్టిండు. ఆ నీళ్లు వస్తాయి అని జనం అనుకున్నారు. కాని ఇలా నీళ్లు బందు పెడతరు అనుకుంటే కాంగ్రెస్‌కు ఒక్క ఓటు కూడా పడకపోయేది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే కాంగ్రెస్‌ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదు. అందుకు ఎలాగైనా బిఆర్‌ఎస్‌ను ఖతం చేయాలే. తెలంగాణ రాజకీయాల్లో బిఆర్‌ఎస్‌ను లేకుండా చేయాలని కలలు కంటున్నారు. కాంగ్రెస్‌, బిజేపిల జేజేమ్మలు దిగి వచ్చినా సరే బిఆర్‌ఎస్‌ను ముట్టుకుంటే మసైపోతరు. బిఆర్‌ఎస్‌ను ప్రజలే కాపాడుకుంటారు. ప్రజలే కార్యకర్తలై కేసిఆర్‌ను, బిఆర్‌ఎస్‌ను రక్షించుకుంటారు. తెలంగాణ గుండెల్లో వున్నది ఒకే ఒక్క నాయకుడు కేసిఆర్‌. అందుకే పొరపాటున కాంగ్రెస్‌ను గెలపించుకున్నందుకు ప్రజలు దుఖపడుతున్నరు. ఎంత పనైపాయే అని మధనపడుతున్నరు. పల్లెల్లో ప్రజా సమస్యలపై బిఆర్‌ఎస్‌ నాయకులకు చెబుతున్నరు. మీరున్నప్పుడు మా బతుకులు బంగారంలాగా వుండే..ఇప్పుడు పడరాని గోసలు పడుతున్నమని చెబుతున్నరు. బిఆర్‌ఎస్‌ తెలంగాణలో బలమైన పార్టీయే కాదు. ప్రజల గుండెల్లో నిండిన పార్టీ. మా పార్టీని ప్రజల నుంచి దూరం చేయడం ఎవరి తరం కాదు. ఎందుకంటే ఎన్ని తరాలైనా సరే తెలంగాణ వున్నంత వరకు బతికుండే ఏకైక పార్టీ బిఆర్‌ఎస్‌. బిఆర్‌ఎస్‌తోనే తెలంగాణకు జీవం. జీవితం. తెలంగాణను కళ్లలో పెట్టుకొని చూసుకునే నాయకుడు కేసిఆర్‌ వున్నాడు. అదే తెలంగాణ ప్రజల ధైర్యం. అలాంటి నాయకుడిని మానసికస్ధైర్యం మీద దెబ్బకొట్టాలని చూస్తే ప్రజలే తిరుగుబాటు చేస్తారు. కాంగ్రెస్‌, బిజేపిలను పాతి పెడతారు. రెండు జాతీయ పార్టీలు చేస్తున్నవి రాజకీయాలు కాదు.చిల్లర చేష్టలు. అందుకే పనికి రాని, పసలేని పనులు చేస్తున్నారు. బిఆర్‌ఎస్‌ నాయకులను కొంత మందిని లాక్కుంటే ఆగిపోయే పార్టీ కాదు బిఆర్‌ఎస్‌. తరతరాలకు చెరగని కార్యకర్తల యంత్రాంగం బిఆర్‌ఎస్‌ వుంది. రాజకీయ అవకాశవాదులను ప్రజలు ఎప్పుడూ నమ్మరు. ప్రజల గుండెల్లో వున్నపార్టీని వదులుకొని వెళ్లిపోయే నాయకులు సాదించేదేమీ వుండదు. వాళ్లు పశ్చాత్తాపడే రోజులుకూడా దగ్గర్లోనే వున్నాయి. కేసిఆర్‌ అంటేనే తెలంగాణకు రక్షణ కవచం. కేసిఆర్‌ గుండె నిబ్బరం మీద దెబ్బకొట్టే శక్తి వున్న వాళ్లు వున్నారా? ఆయన గుండె ధైర్యాన్ని ఎదుర్కొనగలిగే నాయకులు వున్నారా? అంతేకాకుండా కృష్ణార్జునులైనటువంటి కేటిఆర్‌, హరీష్‌రావులను విడదీయడం అనేది సాధ్యమా? పిచ్చి వేషాలు, వెర్రి వేషాలు వేయడమే రాజకీయాలు అనుకుంటున్నారు. తెలంగాణలో బిఆర్‌ఎస్‌కు బలమైన యంత్రాంగం వుంది. ఉద్యమ బాటలో త్యాగాలు చేసిన నాయకులున్నారు. ఒక రకంగా ఉద్యమ కాలంలోనే పార్టీకి సైనికుల్లా వున్నారు. ఇప్పుడు అంతకు మించి ధైర్యాన్ని నింపుకొని వున్నారు. పడికెడు మంది నాయకులు బిఆర్‌ఎస్‌ను కాదునుకొని వెళ్లినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదు. రెండు జాతీయపార్టీలు ఎన్ని కుట్రలు , కుతంత్రాలు చేసినా, ఆ రెండు పార్టీ నుంచి పెద్దఎత్తున నాయకులు బిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. ఏదో ఆవేశంతోనో పార్టీని వీడిన వాళ్లంతా మళ్లీ గులాబీగూటికి చేరుకుంటున్నారు. ఇలాంటివి చూసి గిట్టలేని పార్టీలు బిఆర్‌ఎస్‌ను లేకుండా చేయాలని కలలు కంటున్నారు. తెలంగాణకు బిఆర్‌ఎస్‌ పార్టీ గుండె బలం..కేసిఆరే ధైర్యం…పదే పదే విలీనం అనే చర్చ పనిలేనిది. పసలేనిది. ఎవరికీ పనికిరానిది. అంతే!!

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version