ప్రమాదం కాదు.. జుబీన్ను చంపేశారు.. సీఎం హిమంత సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ మరణంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సంచలన కామెంట్స్ చేశారు. ఆయనది ప్రమాదం కాదు.. చంపేశారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ మరణంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. జుబీన్ గార్గ్ ప్రమాదవశాత్తూ చనిపోలేదని.. అతడిని హత్య చేశారంటూ అసెంబ్లీ వేదికగా సెన్సేషనల్ ఎలిగేషన్స్ చేశారు. గతంలో కూడా ఆయన మీడియా ముందు ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సారి శాసన సభ వేదికగా జుబీన్ మరణంపై సీఎం హిమంత ఈ సంచలన కామెంట్స్ చేయడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.
మంగళవారం అస్సాం అసెంబ్లీలో గార్గ్ మరణం గురించి చర్చించడానికి ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ సందర్భంగా సీఎం హిమంత బిస్వా శర్మ(Himanta Biswa Sarma ) మాట్లాడుతూ.. జుబీన్ గార్గ్ ది ప్రమాదం కాదని, ఆయన్ను చంపేశారని ఆరోపించారు. మరోవైపు గార్గ్ మరణంపై దర్యాప్తు చేస్తున్న ఏకసభ్య కమిషన్ వాంగ్మూలాలు నమోదు చేయడానికి, సాక్ష్యాలను సమర్పించడానికి గడువును డిసెంబర్ 12 వరకు పొడిగించింది. గౌహతి హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ సౌమిత్ర సైకియా నేతృత్వంలోని కమిషన్ నవంబర్ 3 నుంచి విచారణను ప్రారంభించింది.దీనికి సంబంధించిన నివేదికను సమర్పించే గడువు నవంబర్ 21తో ముగిసింది. దీంతో గడువును డిసెంబర్ 12 వరకు పొడిగిస్తూ ఏకసభ్య కమిషన్ సోమవారం నిర్ణయం తీసుకుంది. గార్గ్ మరణంపై అసలు విషయాలు తెలుసుకునేందుకు అస్సాం ప్రభుత్వం( Assam Govt) ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ (Zubeen Garg) సెప్టెంబర్ 19న మరణించిన విషయం తెలిసిందే. సింగపూర్ వెళ్లిన జుబీన్ అక్కడ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో సీఎం హిమంత బిశ్వ శర్మ ఆదేశాల మేరకు జుబీన్ మృతిపై ఏకసభ్య కమిషన్ దర్యాప్తు ముమ్మరం చేసింది.
