ఏపీలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు ఇవే
ఏపీలో ఈనెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.
రాష్ట్రంపై మరోసారి వరణుడు తన ప్రతాపం చూపించేందుకు సిద్ధమయ్యాడు. ఈనెలాఖరున (నవంబర్) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. మలక్కా జలసంధి ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. రాగల 6 గంటల్లో ఇది పశ్చిమ – వాయవ్య దిశగా కదులుతూ అదే ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది.
ఈనెల 27 (గురువారం) నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని అధికారులు సూచించారు. వర్షాల నేపథ్యంలో రైతులకు కూడా వాతావరణ అధికారులు కీలక సూచనలు చేశారు. మరో మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తమై వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు.
