యంజెపి గురుకులంలో స్ఫూర్తి కార్యక్రమం.
నర్సంపేట,నేటిధాత్రి:
దుగ్గొండి మండలంలోని గిర్నిబావిలో గల మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో స్ఫూర్తి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సత్య శారదా ఆదేశాల మేరకు పాఠశాల ప్రిన్సిపాల్ ఓదెల మల్లయ్య అధ్యక్షతన జరిగింది ముఖ్యఅతిథిగా దుగ్గొండి ఎంపిఓ శ్రీధర్ గౌడ్, గిర్నిబావి పంచాయతీ కార్యదర్శి వేణు ప్రసాద్ పాల్గొన్నారు. ఎంపిఓ శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ లక్ష్యంలేని ప్రయాణం గమ్యంలేని నావ లాంటిదని… ప్రతి ఒక్క విద్యార్థి ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికి అనుగుణంగా ప్రణాళికను రూపొందించుకోవాలని దాంతో విద్యార్థి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గం ఏర్పడుతుందని అన్నారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ గత సంవత్సరాలుగా ఈ స్ఫూర్తి ప్రోగ్రాం ద్వారా పబ్లిక్ పరీక్షలు వ్రాసే విద్యార్థులు మంచి ప్రేరణ పొంది మంచి మార్కులు సాధించడం జరిగిందన్నారు.
ఉపాధ్యాయుల సూచనలను పాటిస్తూ లక్ష్యం దిశగా అడుగులు వేయాలని అన్నారు. పాఠశాలలో నేటి నుండి కెరియర్ గైడెన్స్ సెల్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని విద్యార్థులకు తెలియజేశారు. ఈ స్ఫూర్తి కార్యక్రమం ద్వారా తాను ప్రేరణ పొందానని.. తాను తప్పకుండా ఐఏఎస్ అవుతానని దాన్ని సాధించేందుకు తాను కఠోర దీక్ష చేస్తానని అభిరామ్ అనే విద్యార్థి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏటీపీ సతీష్,డిప్యూటీ వార్డెన్ సమత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.