కొడుకు పుడితే అలా.. కూతురు ఐతే ఇలా..

కొడుకు పుడితే అలా.. కూతురు ఐతే ఇలా..

తండేల్‌’ సినిమాతో తిరిగి హిట్‌ ట్రాక్‌లోకి వచ్చాడు హీరో నాగచైతన్య. ఇప్పుడీ జోష్‌తోనే.. ‘విరూపాక్ష’ ఫేమ్‌ కార్తీక్‌ దండుతో ఓ మిథికల్‌ థ్రిల్లర్‌ మూవీలో నటిస్తున్నాడు.

తండేల్‌’ సినిమాతో తిరిగి హిట్‌ ట్రాక్‌లోకి వచ్చాడు హీరో నాగచైతన్య (Naga Chaitanya). ఇప్పుడీ జోష్‌తోనే.. ‘విరూపాక్ష’ ఫేమ్‌ కార్తీక్‌ దండుతో ఓ మిథికల్‌ థ్రిల్లర్‌ మూవీలో నటిస్తున్నాడు. ఈసారి కూడా అదే ఫామ్‌ను కొనసాగిస్తూ… మరో హిట్‌ కొట్టాలని ప్రయత్నిస్తున్న ‘చై’ తాజాగా తన వ్యక్తిగత విషయాల గురించి ఇలా చెప్పుకొచ్చాడు…

నైట్‌ షికారుకు వెళ్తాం… (Sobhitha)

షూటింగుల్లో బిజీ వల్ల నేను, శోభిత కలిసి సమయం గడపడానికి అంతగా వీలుపడదు. క్వాలిటీ టైమ్‌ స్పెండ్‌ చేయడానికి, అనుబంధం పెంచుకోవడం కోసం మేమిద్దరం కొన్ని రూల్స్‌ పాటిస్తాం. హైదరాబాద్‌లో ఉంటే తప్పకుండా ఉదయం, రాత్రి సమయాల్లో కలిసే భోజనం చేయాలని నిర్ణయించుకున్నాం. సినిమాలు చూడడం, నైట్‌ షికారుకు వెళ్లడం, నచ్చిన ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకోవడం, లేదా వండుకోవడం… ఇలా ఆ క్షణాలను ప్రత్యేకంగా, మధురజ్ఞాపకంగా మార్చుకుంటాం. తనకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. నాకు రేసింగ్‌పై ఆసక్తి. ఇద్దరం కలిసి హాలిడే ప్లాన్స్‌ వేస్తాం. ఇటీవల తనకు రేస్‌ట్రాక్‌పై డ్రైవింగ్‌ నేర్పించా. ఎంతో సంతోషించింది.

‘షోయు’ గురించి ఎన్టీఆర్‌ నోట…

నేను కొన్నేళ్ల క్రితం ‘షోయు’ పేరుతో ఒక రెస్టారెంట్‌ ప్రారంభించా. ‘షోయు’ అంటే జపనీస్‌ బాషలో ‘సోయా సాస్‌’ అని అర్థం. ప్రీమియం క్లౌడ్‌ కిచెన్‌ పెట్టాలని లాక్‌డౌన్‌లో ఆలోచన వచ్చింది. అలా పుట్టిందే ఇది. ‘దేవర’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల జపాన్‌కు వెళ్లిన ఎన్టీఆర్‌… మా రెస్టారెంట్‌ గురించి మాట్లాడారు. ‘హైదరాబాద్‌లోని ‘షోయు’లో జపనీస్‌ ఫుడ్‌ దొరుకుతుందని, జపనీస్‌ ఫేమస్‌ ఫుడ్‌ సుషీ చాలా బాగుంటుంద’ని ఆయన చెప్పారు. ఆ వీడియో చూసి నాకు ఆనందంగా అనిపించింది.

వాళ్లంటే ఇష్టం

నిజ జీవితంలో కొంతమంది వ్యక్తులను హీరోలుగా చూస్తుంటాం. అలా నా కుటుంబం కాకుండా రతన్‌ టాటా అంటే నాకెంతో గౌరవం. ఆయన్ని ఒక స్ఫూర్తిప్రదాతగా భావిస్తా. ఎలాన్‌మస్క్‌ జీవిత ప్రయాణం నన్ను ఆశ్చర్యపరుస్తుంటుంది. హాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ నోలాన్‌ అంటే కూడా అభిమానమే. తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చేసరికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి అంటే నాకెంతో అభిమానం.

ఆ కాసేపు… నాదైన ప్రపంచంలో…

నేను చిన్నప్పుడు చెన్నైలో పెరిగాను. మా ఇంటికి దగ్గర్లో ‘శ్రీపెరంబుదూర్‌ రేస్‌ ట్రాక్‌’ ఉండేది. దాంతో వీకెండ్స్‌ రాగానే స్నేహితులతో కలిసి అక్కడకు వెళ్లడం, కారు రేసులు చూడడం అలవాటైంది. అలా కొద్ది కాలానికి తెలియకుండానే వాటిపై ఆసక్తి ఏర్పడింది. ఇప్పటికీ స్నేహితులతో కలిసి సరదాగా ట్రాక్‌ రేసులకు వెళ్తుంటా. నాకు రేసింగ్‌ అంటే మహా ఇష్టం. అదొక థెరపీలా పనిచేస్తుంది. ట్రాక్‌ మీద కారు నడుపుతున్నంత సేపు నా మైండ్‌లోకి ఎలాంటి ఆలోచనలు రావు. పూర్తిగా బయట ప్రపంచాన్ని మర్చిపోయి… ఆ కాసేపు నాదైన ప్రపంచంలో విహరిస్తుంటా.

ఆ క్షణాలను ఆస్వాదించాలనుంది…

పెద్ద కోరికలంటూ ఏమీ లేవు. నాకు 50 ఏళ్ల వయసు వచ్చేసరికి భార్యాపిల్లలతో సంతోషంగా ఉండాలని అనుకుంటున్నా. మాకు ఒకరో, ఇద్దరో పిల్లలుండాలి. నాకు కొడుకు పుడితే గనుక.. వాడిని రేస్‌ ట్రాక్‌కు తీసుకెళ్తా. అదే కూతురు పుడితే.. తన అభిరుచులను ప్రోత్సహిస్తా. నాకు పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని ఉంది. చిన్నప్పుడు నేను ఎంజాయ్‌ చేసిన మధుర క్షణాలను.. మళ్లీ వాళ్లతో కలిసి ఆస్వాదించాలనుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version