ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్.. ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా పని చేస్తూ నిధులను మళ్లించినట్టుగా అరవింద్‌పై ఆరోపణలు ఉన్నాయి.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో (Formula E Car Race Case) ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ (IAS Officer Arvind Kumar) ఏసీబీ ఎదుట హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి మూడోసారి ఏసీబీ విచారణకు వచ్చారు ఐఏఎస్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నిధుల బదలాయింపులో అరవింద్ కుమార్ కీలక పాత్ర పోషించారని ఏసీబీ గుర్తించింది. హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా పని చేస్తూ నిధులను మళ్లించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. కేబినెట్ అనుమతి లేకుండా నిధులను బదిలాయించినందుకు ఏసీబీ కేసు నమోదు చేసింది.
ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కూడా ఇప్పటికే రెండు సార్లు ఏసీబీ అధికారులు విచారించారు. జూన్ 16న కేటీఆర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగానే అరవింద్ కుమార్‌ను ఏసీబీ ప్రశ్నిస్తోంది. ఎఫ్‌ఈవో కంపెనీకి దాదాపు రూ.45 కోట్లు 71 లక్షల నగదును బదిలీ చేశారు. వాటికి సంబంధించే మూడో సారి అరవింద్ కుమార్‌ను విచారణకు పిలిచి ఏసీబీ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తోంది. అయితే రెండు సార్లు కేటీఆర్‌ను విచారణ జరిపిన సమయంలో ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఆధారంగా చేసుకుని గతంలో అరవింద్ కుమార్‌ను ప్రశ్నించారు. అలాగే అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా కేటీఆర్‌ను కూడా ప్రశ్నించారు. ఇక రెండో సారి కేటీఆర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ప్రస్తుతం ఐఏఎస్ అధికారిని ఏసీబీ ప్రశ్నిస్తోంది.