వేధింపుల కారణంగానే రాజీనామా పత్రాలు పంపించి వెళ్లిపోయా
– పై అధికారులకు ఫిర్యాదు చేసిన శూన్యం
– బద్దెనపల్లికి చెందిన గ్రామ కార్యదర్శి మంత్రి ప్రియాంక
సిరిసిల్ల/ తంగళ్ళపల్లి (నేటి ధాత్రి):
రాజన్న సిరిసిల్ల జిల్లాలో
రెండు రోజుల క్రితం తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన గ్రామ కార్యదర్శి మంత్రి ప్రియాంక మిస్సింగ్ కలకలం సృష్టించింది.
తిరుపతిలో ఆచూకీ తెలుసుకొని క్షేమంగా తీసుకు వచ్చిన కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా
సిరిసిల్లలో మీడియాతో మాట్లాడిన ప్రియాంక గ్రామంలో నలుగురు వ్యక్తులు శ్రీకాంత్, అభి,మల్లేష్,రాజు వీరి వేధింపుల కారణంగానే రాజీనామా పంపించి వెళ్లిపోయానని అన్నారు.
చేయని పనులకు బిల్లుల కోసం వేధింపులకు గురి చేశారని అన్నారు.
అధికారులకు ఫిర్యాదు చేసినా తాత్కాలిక పరిష్కారం మాత్రమే చూపారని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో అనర్హుల పేర్లను ప్రకటించాలని ఒత్తిడి చేశారని అన్నారు.
అధికారి మహిళ అని కూడా చూడకుండా ఏకవచనంతో దురుసుగా మాట్లాడారని అన్నారు.
ఎం.పి.డి.ఓ. కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని,అధికారులు కూడా వారికే వత్తాసు పలికారని తన ఆవేదనను వ్యక్తం చేశారు.
వేధింపులు భరించలేకే రాజీనామా పత్రాన్ని వాట్సాప్ ద్వారా పై అధికారులకు పంపించి వెళ్ళపోయానని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోనే వేరే ఉద్యోగం చూసుకొని కుటుంబ సభ్యులకు చెబుదామని అనుకున్నాననీ అన్నారు.
ట్రేసింగ్ ద్వారా తెలుసుకొని కుటుంబ సభ్యులు నన్ను తిరిగి తీసుకొచ్చారనీ పేర్కొన్నారు.
కుటుంబ సభ్యులతో చర్చించి తర్వాత కార్యాచరణ రూపొందించుకుంటానని అన్నారు.