ప్రాణాలకు ముప్పుగా మారిన భారీ ఫ్లెక్సీలు
అధికారులు స్పందించేది ఎప్పుడు?
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలం ఇందారం ఎక్స్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీ కటౌట్లు ఇప్పుడు ప్రయాణికుల పాలిట మృత్యుపాశాలుగా మారాయి.వేసవి కాలం కావడంతో విపరీతమైన ఈదురు గాలులు వీస్తున్న తరుణంలో,రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఈ భారీ కటౌట్లు గాలికి ప్రమాదకరంగా ఊగుతున్నాయి.ఏ క్షణంలో ఇవి నేలకొరుగుతాయో,ఏ ప్రయాణికుడి మీద పడతాయో తెలియని భయానక స్థితి నెలకొంది.గతంలో ఇలాంటి కటౌట్లు కూలి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నా, ఇక్కడ మాత్రం అధికారులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.అసలు నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు పక్కన ఇంతటి భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తుంటే అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నట్లు?రాజకీయ నాయకుల మెప్పు కోసం సామాన్య ప్రజల ప్రాణాలను పణంగా పెడుతుంటే పాలనా యంత్రాంగం నిద్రపోతోందా?భారీ ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించిన తర్వాతే అధికారులు మేల్కొంటారా?అంటూ వాహనదారులు సూటిగా ప్రశ్నిస్తున్నారు.గాలి వానకు ఈ ఫ్లెక్సీలు ఎప్పుడైనా విరిగిపడే అవకాశం ఉన్నందున,ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకముందే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలి.ప్రమాదకరంగా మారిన ఆ ఫ్లెక్సీలను యుద్ధ ప్రాతిపదికన తొలగించి,ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
