`కాసుల కక్కుర్తిలో ‘‘టౌన్ ప్లానింగ్’’ అధికారులు.
`పట్టుబడని బాలకృష్ణ లెందరో..
`ఆదాయానికి మించిన ఆస్తుల దిట్టలు.
`అవినీతి కంపు…అధికారుల పసందు!
`మునిసిపల్ శాఖ అంటేనే అవినీతికి తాతలుగా తయారైన అధికారులు.
`టౌన్ ప్లానింగ్ అంటేనే జనానికి హడల్.
`రెసిడెన్షియల్ పర్మిషన్..కమర్షియల్ బిల్డింగ్?
`జీ ప్లస్ వన్ పర్మిషన్.. ఆరు ఫ్లోర్లకు నిర్మాణం?
`ఇరుకు సందులు..ఇష్టానుసారం బిల్డింగులు!
`గాలి కూడా దూరనంత సందుల్లో అప్పార్టుమెంట్లు!
`భూమిని గుళ్ల గుళ్ల చేస్తూ బోర్ల మీద బోర్లు.
`నాణ్యత లేని నిర్మాణాలు..పేక మేడల భవంతులు.
`ఫైర్ సేఫ్టీ లేకుండానే దొంగ డాక్యుమెంట్లతో నిర్మాణాలు.
`అడుగు తీసి అడుగు వేయలేం.
`రెండు ఆటోలు ఎదురెదురు వస్తే ముందుకు వెళ్ళలేం.
`పదేళ్లలో లక్షల నిర్మాణాలు.
`నిత్యం లక్షలకు లక్షల సంపాదనలు.కోట్ల రూపాయల ఆస్థులు.
`ప్రకృతి విపత్తులొస్తే ఎంత ప్రాణాలు కోల్పోతారో!
`‘‘జిహెచ్‌ఎంసి’’ని చూసి జిల్లాలలో కూడా ఇదే అనుసరిస్తున్నాయి.
వ్రరంగల్, కరీంనగర్, ఖమ్మం లాంటి నగరపాలికలు కూడా అవినీతి కంపులో కూరుకుపోయాయి.
`ప్రకృతి విరుద్దంగా అధికారుల నిర్ణయాలు.
`‘‘డిల్లీ’’ భూకంపంతో ఒక్కసారిగా ఉలిక్కి పడాల్సి వస్తున్న నగరాలు.
`మున్సిపల్ శాఖల అడ్డగోలు అవినీతికి జరిగిన ప్రమాదాలే సాక్ష్యాలు.
`అయినా అధికారులు మారరు.
`ప్రజల ప్రాణాల గురించి క్షణం కూడా ఆలోచించరు.
`పాలకులు పట్టించుకోరు.
`అవినీతి అధికారులు తమ తీరు మార్చుకోరు.
`జిహెచ్‌ఎంసి టౌన్ ప్లానింగ్ విభాగంలో మరొక ‘‘బాలకృష్ణ’’. ఎపిసోడ్ – 2
`పదిలక్షలు ఇస్తే..ఆరు ఫ్లోర్ల వరకు కళ్ళు మూసుకుంట?
హైదరాబాద్,నేటిధాత్రి:
రక్తం మరిగిన పులి, ఎలుకను వేటాడే పిల్లి ఎప్పుడూ ఒకటి కాదు. రెండూ ఆకలి కోసమే అనుకుంటాం. కాని పులి కోపంతో కూడా వేటాడుతుంది. కనిపించిన జంతువునల్నా చంపి తింటుంది. రక్తం మరిగిన పులిలో ఆకలి,కోపం తప్ప విచక్షణ కనిపించదు. సరిగ్గా అవినీతి అలవాటు పడిన కొందరు ఉద్యోగుల తీరు ఇంతకన్నా దారుణంగా వుంటోంది. ఎంత ఆకలైనా గడ్డి తినవు. కాని అవినీతి తిమింగలాలు మాత్రం గడ్డి, గాదం ఏదైనా తింటారు. పుణ్యానికి వస్తున్నాయంటే పినాయిలైనా తాగుతారు. అంత దరిద్రంగా మారిపోయారు. నీతి లేదు, నియమం లేదు. ధర్మాధర్మ విచక్షణ లేదు. కనికరం లేదు. ఉద్యోగం పోతుందన్న బెరుకు లేదు. భయం అసలే లేదు. ఎందుకంటే జీతం కంటే వందల రెట్లు అవినీతి సంపాదన చేతుల నిండా నిత్యం కనిపిస్తుంటే భయం ఎందుకుంటుంది? ఒకప్పుడు ఉద్యోగులంటే సగటు జీతగాళ్లు. నెల నెల వచ్చే జీతంతో బతికే మధ్య తరగతి జీవితాలు అనుకునే వారు. కాని ఇప్పుడు ఉద్యోగం అంటే ఒక కల్పతరువైపోయింది. నిత్య సంపాదనకు నెలవైపోయింది. జేబు నిండడం ఎనాడో మర్చిపోయారు. రోజూ సూట్ కేస్ నిండితే గాని ఆకలి తీరని జలగలు తయారయ్యారు. నిత్యం ఎంతో మంది పట్టుబడుతూనే వున్నారు. అయినా జంకు లేదు. బొంకడానికి కూడా ఇష్టపడడం లేదు. లంచం తీసుకొని కూడా కుర్చీలో దర్జాగా కూర్చొని ఫోటోలకు ఫోజులిస్తున్నారు. అలాంటి ఉద్యోగులలో రెవిన్యూ, మున్సిపల్ శాఖలు అందరికన్నా ముందున్నారు. తెలంగాణ వ్యప్తంగా ఒక్క రోజు జరిగితే అవినీతి అంత ఒక ఎత్తైతే ఒక్క జిహెచ్‌ఎంసిలో జరిగితే అవినీతి అంత ఎత్తుగా సాగుతోంది. ఇంత దుర్మార్గం ఏ రాష్ట్రంలోనూ లేదు. ఇంత విచ్చలవిడి తనం ఎక్కడా కనిపించదు. ఏరాష్ట్రంలోనూ ఇంతటి అవినీతి గలగలున్నట్లు వార్తలు కూడా వుండవు. తెలంగాణలో అధికారుల్లో అవినీతి ఉన్మాదం పెరిగిపోయిందా? అన్నట్లు సాగుతోంది. లంచాలకు బాగా అలవాటు పడ్డారు. జిహెచ్‌ఎంసికి వచ్చే ప్రజలను పీడిరచుకుతింటున్నారు. వారు చెప్పిందే లెక్క. అడిగిందే రొక్కం. అన్నట్లు సాగుతోంది. ఒకప్పుడు లంచమంటే వందలు అనుకునేవారు. ఇప్పుడు వేలు కూడ దాటిపోయింది. లక్షలు,కోట్లు వసూలు చేస్తున్నారు. ఆ మధ్య పట్టుబడిన కీసర ఎమ్మార్వో ఏక కాలంలో తీసుకున్న లంచం ఏకంగా రూ.100 కోట్లు. అది విన్న జనానికి గుండెలు అదిరాయి. అంటే తెలంగాణ వ్యాప్తంగా అవినీతి అనేది ఊడల మర్రిని మించిపోయింది. జిహెచ్‌ఎంసి అధికారులు, ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగం అంటే నిత్యం కరెన్సీలతోనే స్నానం అన్నట్లు అవినీతి సాగుతోంది. ఎలాంటి పర్మిషన్ కావాలన్నా సరే లక్షలు సమర్పించుకోవాల్సిందే. ఇలా జిహెచ్‌ఎంసిలోని అన్ని సర్కిళ్లలో అవినీతికి అంతు లేకుండాపోతోంది. అడ్డూ అదుపు లేని అవినీతి సంపాదన ఉద్యోగులకు చేరుతోంది. ఓ వైపు సామాన్యులను వేదించుకుతింటున్నారు. అడ్డగోలు నిర్మాణాలు చేసుకునేవారికి అమ్ముడుపోతున్నారు. నగరం ఎలా వుండాలి. ఎలా వుంటే భవిష్యత్తు తరాలకు ఇబ్బందులుండవు. సమాజానికి సమస్యలు ఎదురుకాకుండా వుంటాయన్న సోయి ఏ ఒక్క ఉద్యోగిలోనూ లేకుండాపోతోంది. జిహెచ్‌ఎంసిలో అదికారులు అనుసరిస్తున్న విధానం ప్రజల జీవితాలను ఆగం చేస్తున్నాయని చెప్పకతప్పదు. జిహెచ్‌ఎంసి అంటేనే అవినీతికి తాతలు అనే పేరు సార్ధకం చేసుకుంటున్నారు. ఇక టౌన్ ప్లానింగ్ అంటేనే జనం జడుసుకుంటున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు తలుచుకుంటే ఏదైనా చేయగలరనే దాక వెళ్లిపోతున్నారు. అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్నారు. సక్రమ నిర్మాణదారులను వేదిస్తుంటారు. అక్రమ నిర్మాణదారులు టౌన్ ప్లానింగ్ అధికారులు ఎంత చెబితే అంత ముట్టజెబుతారు. అన్నీ వాళ్లే చూసుకుంటారు. అక్రమార్కులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు. బిల్డింగ్ మొదలు పెట్టిన నుంచి పూర్తయ్యే వరకు అక్రమ నిర్మాణదారులు ఉద్యోగులను ఇంటి అల్లుడిని చూసుకుంటున్నట్లు చూసుకుంటున్నారు. లంచాలు, విందులు, వినోదాలు అన్నీ అందిస్తున్నారు. కాని సామాన్యులు కనీసం లంచం ఇచ్చుకోలేరు. టౌన్ ప్లానింగ్ ఉద్యోగులు అడిగినంత సొమ్ము అసలే ఇచ్చుకోలేరు. ఇంకా ఇక్కడ వింతేమిటంటే 60 గజాలు, వంద గజాల స్ధలాలలో సహజంగా జివన్ ప్లస్ వరకు మాత్రమే అనుమతి వుంటుంది. అంత వరకే నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తారు. కాని అధికారులు అశీస్సులతో నిర్మాణదారులు ఆరు అంతస్ధులు వేసుకున్నా పట్టించుకోరు. అటు వైపు చూడరు. ఎందుకంటే నిర్మాణం చేసుకోపో..అని అభయమిచ్చేదే టౌన్ ప్లానింగ్ అధికారులు. అలా ఒకరిని చూసి ఒకరు అదికారులు అడిగింత ముట్టజెప్పి నిర్మాణాలు చేసుకుంటూ పోతున్నారు. ముఖ్యంగా హైటెక్‌సిటీ, …..లలో ఐటి కంపనీలు ఎక్కువ. ఆ ప్రాంతాలలో కొత్తగా వెలిసిన కాలనీలు చూస్తే పద్మవ్యూహమైనా అర్దమౌతుందేమో కాని, ఆ కాలనీలు అర్ధం కావు. అన్ని ఆరు అంతస్ధుల బిల్డింగులే. ఎక్కడ చూసినా ఐటి ఉద్యోగులకు అవసరమైయ్యేలా నిర్మాణం చేసి ఇస్తున్న అద్దె బిల్డింగులే. అరవై, వంద గజాలలో ఆరు అంతస్ధుల నిర్మాణాలు. కనీసం గాలి కూడా దూరనంత సందు కూడా వుండనంత ఇరుగ్గా, పక్కపక్కనే బిల్డింగులు. ఇళ్లముందు రోడ్లు కూడా కనీసం పది ఫీట్లు కూడా వుండవు. రెండు ఆటోలు ఎదురెదురు వచ్చినా ముందుకు వెళ్లలేవు. నలుగురు ఏక కాలంలో నడుచుకుంటూ వెళ్లలేరు. ఆ రోడ్లమీదే కార్లు, బైక్‌లు. ఇలా అంతా చిందరవందర జీవితాలను తలపించేలా కాలనీలుంటాయి. ఇలాంటి నిర్మాణాలన్నీ అక్రమమే. ఏ ఒక్కటి సక్రమం కాదు. ఎందుకంటే 60, 100 గజాల స్ధలాలలో జిప్లస్ వన్ మాత్రమే నిర్మాణాలు చేసుకోవాలి. ఎట్టిపరిస్ధితుల్లోనూ ఐదారు ప్లోర్లకు అనుమతులు ఇవ్వకూడదు. అదికారులు చాక చక్యంగా నోటి మాట ద్వారా అనుమతులిస్తారు. నిర్మాణాలు పూర్తయిన తర్వాత వాటిని కూల్చివేసేందుకు కూడా వీలుండదు. కనీసం ఆ సందుల్లోకి జేసిబిలు కూడా వెళ్లలేవు. అంటే కూల్చడానికి వీలు లేనంత సందుల్లో నిర్మాణాలు చేపడతారు. 60, 100 గజాలలో ఆరు అంతస్ధులు నిర్మాణం చేసుకునేవారు ఓ పది లక్షల రూపాయలు టౌన్ ప్లానింగ్ అదికారులు చేతుల్లో పెడితే చాలు. అనుమతులు అర క్షణంలో ఇచ్చేస్తారు. మూడు నాలుగు నెలల్లో నిర్మాణాలు పూర్తి చేస్తారు. ఆరు నెలల్లో బిల్డింగులు అద్దెకిచ్చేస్తారు. ఇంత స్పీడ్‌గా నిర్మాణాలు జరిగిపోతుంటాయి. పక్క పక్కనే వెలసిన ఆరు అంతస్ధుల నిర్మాణాల కోసం విపరీతమైన బోర్లు వేస్తారు. భూమిని గుళ్ల గుళ్ల చేస్తారు. సహజంగా ఓ వంద గజాల స్ధలంలో ఓ నిర్మాణం చేపడితే ఓ పది మంది నివాసం వుండేందుకు ప్రకృతి సహకరిస్తుంది. స్వచ్చమైన గాలి, సరిపడినంత నీరు అందుతుంది. ప్రైగా మున్సిపల్ శాఖ ఏర్పాటు చేసే డ్రైనేజీ సిస్టమ్ కూడా అంత మేరకే వుంటుంది. కాని నిబంధనలకు విరుద్దంగా కమర్షియల్ నిర్మాణాలు చేసి, ఒక్కోబిల్డింగ్‌లో కనీసం వంద నుంచి నూటాయాభై మందికి వుంటున్నారు. ఇలా వేలాది నిర్మాణాలున్నాయి. అందుల్లో లక్షల్లో కిరాయిదారులుంటున్నారు. ఐటి కంపనీలు దగ్గరగా వుండడం వల్ల తప్పని పరిస్ధితుల్లో ఐటి ఉద్యోగులుంటున్నారు. ఐటి ఉద్యోగుల అవసరం గుర్తించిన వాళ్లు అక్రమంగా ఇలాంటి నిర్మాణాలు సాగిస్తున్నారు. ఏదైనా అనుకోని ఉపద్రవం ఎదురైతే ఒక్కరు కూడా బతికి బట్టకట్టే పరిస్ధితి వుండదు. భూకంపం లాంటి విపత్తులొచ్చినా బతికే చాన్సు వుండదు. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే బూడిత తప్ప మరేం మిగలదు. పర్మిషన్లు ఇచ్చే ముందు అదికారులు భవిష్యత్తు గురించి ముందూ వెనక ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు. లక్షలు చేతుల్లో పడుతున్నాయా? లేదా? అన్నదే చూసుకుంటున్నారు. అక్రమ పర్మిషన్లు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఏది జరిగినా తప్పించుకునేందుకు జిప్లస్ వన్ మాత్రమే ఇచ్చామని చెప్పుకునేలా మాటతోనే పర్మిషన్లు ఇచ్చుకుంటూపోతున్నారు. ఎందుకంటే అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి అక్రమ నిర్మాణం జరిగే అవకాశమే లేదు. సామాన్యులు కాంపౌడ్‌వాల్‌ను ఒక ఇంచ్ ముందుకు తెస్తేనే కూల్చేస్తారు. అలాంటిది ఆరు ఫ్లోర్లకు అనుమతులిస్తున్నారు. అలాంటి అక్రమ నిర్మాణాలు, జిహెచ్‌ఎంసి సర్కిళ్ల అధికారులు అవినీతిపై మీ నేటిధాత్రిలో వరుస కథనాలు త్వరలో…