https://epaper.netidhatri.com/
ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలు.
చెరిపేయడానికి గీతలు కాదు, ఉక్కు సంకల్పంతో చెక్కిన శిల్పాలు.
చరిత్రకు నేర్పిన తెలంగాణ ఉద్యమ పాఠాలు.
వేలెత్తి చూపినంత మాత్రాన చెదిరేవి కాదు.
తూలనాడితే తుడిచిపెట్డుకుపోవు.
ఎద్దేవా చేస్తే ఎగిరిపోవు.
నిందలేస్తే నీటి మీద రాతలు కాదు.
హరీష్ అడుగులు ఉద్యమ భీజాలు.
ఉద్యమ పోరు భీజాక్షరాలు.
తెలంగాణ సాధనకు వేసిన మార్గాలు.
తెలంగాణ సాధనలో అలుపెరగని ధీరుడు.
తెగించి కొట్లాడిన వీరుడు.
ఎదిరించి నిలబడిన ధీరోదాత్తుడు.
తెలంగాణ కోసమే జీవితాన్ని రణం చేసుకున్న పోరాటయోధుడు.
నేటిధాత్రి హైదరాబాద్:
అధ్భుతమని తెలిస్తే అందరూ ముందుకొస్తారు. ముళ్లబాట అని తెలిస్తే అందరూ వెనకడుగు వేస్తారు. కాని నడవాలనుకున్నప్పుడు ముళ్లెదురైనా, రాళ్లు రప్పలు అడ్డొచ్చినా, వాగులు, వంకలు దాటాల్సివచ్చినా ముందుకు వెళ్లేవారే లక్ష్యసాధకులు. ఆ లక్ష్యం ప్రజాకాంక్ష అయితే ముళ్లను తొక్కుకుంటూ, వెనక వచ్చేవారికి దారి నేనౌతా! బాటనేనౌతా!! అని అవరోధాలుకు వెరవకుండా ముందుకు నడిచేవాళ్లే ప్రజలకు గుండెల్లో నిలుస్తారు. చీకటిని చూసి పారిపోరు. పోరుకు వెలుగులద్దుతారు. ప్రజలకు వెలుగులు పంచుతారు. ప్రజల మేలు కోసం ఎంతటి చీకటైనా చీల్చి చెండాడుతారు. వెలుగుల ప్రభాతం కాంతులు వెదజల్లుతారు. అలాంటి వాళ్లలో ఒక్కడుగా చరిత్ర చెక్కిన యోధుడుగా, సంగం చెక్కిన శిల్పాలలో ఒకే ఒక్కడుగా వెలుగొందుతారు. అది తన్నీరు హరీష్‌రావై మన కళ్లముందు కనిపిస్తారు. తెలంగాణ కోసం హరీష్‌రావు చేసిన దానిని గురించి ప్రస్తావించినా కనీసం పుణ్యమైనా దక్కుతుంది. కాఇన ఎగతాలి చేసి పాపం మూటగట్టుకుంటున్నారు. ఆనాడు ఎలాగూ స్వార్ధంకోసం తెలంగాణ కోసం మాట్లాడలేదు. ఇప్పటికైన తెలంగాణ కోసం కొట్లాడిన హరీష్‌రావు త్యాగాన్ని కొనియాడండి. లేకుంటే మీ రాజకీయ జీవితానికి కూడా అర్ధం వుండదు. తెలంగాణ ఉద్యమం ఒక్క రోజో,రెండు రోజులో సాగింది కాదు. ఏడాదో, రెండేళ్లు చేసి ఆపింది కాదు. నిరంతరంగా పద్నాలుగు సంవత్సరాల పాటు ఏక బిగిన, విరామం అంటూ లేకుండా సాగింది. అంతటి కాలంలో నిత్యం తెలంగాణ నామ స్మరణతో కాలం గడిపిన నాయకుడు హరీష్‌రావు. నిత్యం తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో ఎంతో విలువైన జీవితాన్ని గడిపిన నాయకుడు హరీష్‌రావు. అందరూ కుటుంబాలతో, పండగలు, పబ్బాలు గడుపుకుంటూ వుంటుంటే, హరీష్‌రావు ఆ పద్నాలుగేళ్లు జరుపుకున్న పండుగ లేదు. కడుపు నిండా అన్నం తిన్న రోజు లేదు. నిరంతరం ప్రజల మధ్యే, ప్రతి నిమిషం తెలంగాణ కోసమే…అదీ హరీష్‌రావు ఉద్యమ జీవితం. ఎప్పుడు ఏ వార్త వినాల్సివస్తుందో…తెల్లారితే ఏ పేపర్‌లో ఏ విషాద వార్త చదవాల్సి వస్తుందో…అని కంటిని నిండా నిద్ర లేని రాత్రులు గడిపిన ఉద్యమకారుడు హరీష్‌రావు. తెలంగాణలో ఏ మూలనో ఉద్యమకారుడు బలిదానం చేసుకున్నాడని తెలిసిన వెంటనే అర్ధరాత్రి, అపరాత్రి అని తేడా లేకుండా అక్కడికి చేరుకొని, ఆ కుటుంబాలకు అండగా నిలిచి, వారికి బాసగటా నిలిచిన నాయకుడు హరీష్‌రావు…వీటిలో ఏ ఒక్కటైనా ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడైనా చేశాడా? అంత కాలం జై తెలంగాణ అని ఎవరైనా నినదించారా? తెలంగాణ కోసం కొట్లాడారా? అధికారంలోకి వచ్చాం కదా? అని మాటకు ముందు, మాటకు వెనకాల హరీష్‌రావు ఉద్యమ చరిత్రను కించపర్చాలని చూస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే హరీష్‌రావును త్యాగాన్ని తక్కువ చేసి చూపించాలని ఆ పార్టీ నాయకులు తెగ తాపత్రయపడుతున్నారు. ఏనాడు తెలంగాణ ఉద్యమంలో కనిపించని వాళ్లు కూడా హరీష్‌రావు గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణలో వుంటూ, తెలంగాణపై , విషం కక్కిన వాళ్లు కూడా హరీష్‌రావు ఉద్యమాన్ని హేళన చేస్తున్నారు. ఏ ఒక్కనాడు జైతెలంగాణ అనడానికి కూడా నోరు రాని వాళ్లు కూడా హరీష్‌రావు చేసిన ఉద్యమం మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు. రాజకీయ అవసరాల కోసం తెలంగాణను బలిపెట్టేవారి పంచన చేరిన వారు కూడా తెలంగాణ ఉద్యమాన్ని గురించి ప్రస్తావించడం విడ్డూరం. ఏనాడు తెలంగాణ అమరవీరులను స్మరించని వాళ్లు కూడా ఇప్పుడు గొప్పలకు పోతున్నారు. తెలంగాణ ఉద్యమంటే అబద్దాలు చెప్పి, అదికారంలోకి వచ్చినంత సులువనుకుంటున్నారు. అగ్గిపెట్టె అంటూ ఎద్దేవాలు చేస్తున్నారు. కాని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూర్చున్న కుర్చీ ఒక రకంగా హరీష్‌రావు పెట్టిన బిక్షే. ఎందుకంటే ఉద్యమ ప్రస్తానమంతా మొత్తం చూస్తే కనిపించే అతికొద్ది త్యాగధనుల్లో, పోరాట యోధుల్లో హరీష్‌రావు ముందు వరసులో వుంటారు. కేసిఆర్ తర్వాత హరీష్‌రావే కనిపిస్తారు. అలాంటి నేత చేసిన సుధీర్ఘ ఉద్యమంపై మాట్లాడే అర్హత ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడికి లేదు. అసలు తెలంగాణ ఉద్యమం గురించి ప్రస్తావించే నైతికత ఏ ఒక్క కాంగ్రెస్ నేతకు లేదు. తెలంగాణ వచ్చినా, ఆనాడు కేంద్రంలో వున్న యూపిఏ ఇచ్చినా అది కేసిఆర్ పోరాటమే..హరీష్‌రావు నడిపిన ఉద్యమమే… ఏ తెలంగాణ ఉద్యమకారుడు చెప్పినా ఇదే ఫైనల్…
ఏం తెలుసు మీకు హరీష్‌రావు గురించి. ఆయన పోరాటం ఒక వైపు, రాజకీయం మరో వైపు రెండు వ్యూహాలను ఏక కాలంలో నిర్వర్తించి తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించిన నాయకుడు హరీష్‌రావు. తెలంగాణ సాదకుడు కేసిఆర్ అడుగు జాడల్లో నడుస్తూ, తెలంగాణ ఉద్యమ పోరాటంలో తొలి అడుగులు వేసిన ఉద్యమ సైనికుడు హరీష్‌రావు. కేసిఆర్ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టడానికి ముందు కొన్ని నెలల ముందునుంచి సిద్దం చేసిన యాక్షన్ ప్లాన్‌లో భాగస్వామి హరీష్‌రావు. తొలి కార్యకర్త కూడా ఆయనే అని చెప్పాలి. అప్పటికే కేసిఆర్‌తో ఎంతో మంది మేధావులు కలిసి వచ్చినా పార్టీపరంగా క్రియాశీలకపాత్ర పోషించిన వారిలో హరీష్‌రావు మొదటి వ్యక్తి అనే చెప్పాలి. ఆ తర్వాతే ఎవరైనా అన్నది కూడా అందరికీ తెలిసిందే. తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ కొన్ని నెలల పాటు సాగించిన చర్చలు, సంప్రదింపులు, అధ్యయనాలలో హరీష్‌రావు సహాకారం చాలా విలువైంది. కేసిఆర్ చెప్పిన ప్రతి పనిని తుచ తప్పకుండా అనుసరించి, పాటించి అమలు చేసిన నాయకుడు హరీష్‌రావు. సహజంగా యుక్త వయసులో ఏ వ్యక్తికైనా తన వ్యక్తి గత జీవితం, సంతోషం, సరదాలు మీద కలలు కంటుంటారు. కాని హరీష్‌రావు జీవితం మొత్తం తెలంగాణ ఉద్యమమే కనిపిస్తుంది. తెలంగాణ ఆకాంక్షనే వుంటుంది. నిజానికి ఆయనకు ఊహ తెలిసినప్పటికే తెలంగాణ భావన మది మొత్తం నిండిపోయింది. ఆది నుంచి కేసిఆర్‌తో వుండడం, ఆయనతో సాన్నిహిత్యం, కేసిఆర్‌భావజాలం చూస్తూ పెరిగిన వ్యక్తి హరీష్‌రావు. అందువల్ల ఆయనకు సహజంగానే తెలంగాణ అన్నది నరనరనా జీర్ణించుకుపోయి వుంటుంది. అందుకే ఎంతో గొప్ప గుణం, విభిన్నమైన మనస్తత్వం, ప్రజలతో మమేకమయ్యే జీవన విధానం అలవడిరది.
ఉద్యమ జీవితాన్ని ఎంచుకోవాలంటే ఎంతో దైర్యం కావాలి. పరిస్ధితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండాలి. అన్నింటికీ సిద్దపడి ముందుకు రావాలి. ఎంతో విజ్ఞత వుంటే తప్ప యుక్తవయసులో ఉద్యమ స్వరూపానికి తోడుగా నిలవడ లేరు. ఇక కేసిఆర్ తెలంగాణ ఉద్యమం పూర్తి స్దాయిలో మొదలుపెట్టాక, హరీష్‌రావు కూడా తన జీవితాన్ని ఉద్యమానికే అంకితం చేశాడు. అభివృద్ధి మా ప్రాంత హక్కు…తెలంగాణ మా జన్మ హక్కు అన్న నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన నాయకుడు హరీష్‌రావు అని చెప్పడంలో సందేహంలేదు. తెలంగాణ ఉద్యమంలో నేనూ ఆది నుంచే వున్నప్పటికీ, మా పాత్ర జిల్లా వరకు, ఉత్తర తెలంగాణ వరకు పరిమితమైంది. కాని హరీష్‌రావు పాత్ర మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సాగింది. ప్రతి విషయాన్ని , సందర్భాన్ని స్వయంగా పంచుకున్న అనుభవం నాకు వుంది. ఉద్యమ ప్రస్ధానంలో ఎన్నికల బాధ్యత అన్నది ఎంతో కీలమైంది. దాన్ని హరీష్‌రావు ఎంత బాద్యతగా నిర్వర్తిస్తారో అందరికీ తెలుసు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం వేరు…ఉద్యమ కాలంలో ఎన్నికల ప్రచారం వేరు. అడుగుడుగునా ఆటంకాలు. తెలంగాణ ఉద్యమం లేదని నిరూపించే ప్రయత్నం చేసేవాళ్లు కాచుకొని కూర్చునే వాళ్లు… పైగా తెలంగాణలో కూడా తెలంగాణ వ్యతిరేకులు చేసే కుట్రలు… ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సందర్భం కత్తి మీద సామే…ముఖ్యంగా ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సందర్భాలలో హరీష్‌రావు పడిన ప్రయాస అంతా ఇంతా కాదు. తాను రాజీనామా చేసినా, తన గెలుపే కాదు…మొత్తం తెలంగాణ ఎమ్మెల్యేల గెలుపు బాధ్యతలు భుజాన వేసుకొని, ముందుకు నడిచిన నాయకుడు హరీష్‌రావు. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా పరిస్ధితులు తారుమారయ్యే అవకాశాలున్న రోజులవి. ప్రజలను ఎంతో నమ్మకంగా తెలంగాణ ఉద్యమం వైపు మళ్లిస్తున్న కాలంలో అటు తెలంగాణ వాదులు, ఇటు మేధావులతో మమేకమైన సాగడం అన్నది ఎంతో ఓర్పుతో కూడుకున్నది.
తెలంగాణ ఉద్యమాన్ని ఉప్‌మని ఊదేద్దామని చూసే వారూ చూస్తూనే వుండేవారు. జలదృష్యంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడాన్ని కూడా జీర్ణించుకోలేని అప్పటి ప్రభుత్వం ఏకంగా ఆ నివాసాన్ని కూడా కూల్చేసింది. పార్టీకి నీడ లేకుండా చేశారు. అయినా మొక్కవోని ధైర్యంతో కేసిఆర్ ముందకు సాగడంలో హరీష్‌రావు పోషించిన పాత్ర చాలా విలువైంది. ఏ మాత్రం అవకాశం చిక్కినా ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రలు , నాయకులను పలుచన చేద్దామని డేగ కళ్లతో అప్పటి పాలక, ప్రతిపక్ష పార్టీలు చూసేవి. వాటిని తట్టుకుంటూ, ఎదుర్కొంటూ, నాయకులను కాపాడుకుంటూ , వారి ఆటలు సాగకుండా పార్టీని సైతం రక్షించుకున్నవారిలో హరీష్‌రావు ఒకరు. టిఆర్‌ఎస్ పార్టీ టిక్కెట్టు మీద గెలిచి, తెలంగాణ వాద ముసగు వదిలసే ఉద్యమానికి ద్రోహం చేసిన వాళ్లు కూడా వున్నారు. అలాంటి వారితో అప్రమత్తంగా వుండడంలో హరీష్‌రావు క్రియాశీలకపాత్ర పోషించారు. అనేక మందిని పార్టీలోకి తీసుకురావడంలో కూడా ఎంతో కృషి చేశారు. అందుకే ఆయనను ట్రబుల్‌షూటర్ అంటారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు తర్వాత వచ్చిన తొలి స్ధానిక సంస్ధల ఎన్నికల సమయంలో కేసిఆర్ విసృతం ప్రచారంలో వుంటే, హరీష్‌రావు ఊరూర తెలంగాణ జెండా ఎగరేసే పనిలో నిమగ్నమై, పార్టీ ఊరూరికి విస్తరించడంలో హరీష్‌రావు బలమైన ముద్ర వేశారు. మొదటిసారి కేసిఆర్ సిద్దిపేట నుంచి వరంగల్‌కు సైకిల్ యాత్ర చేపట్టారు. ఆ సమయంలో ముందు ప్రతి ఊరిలో హరీష్‌రావు పార్టీ జెండా ఆవిష్కరిస్తూ వెళ్లడం, కేసిఆర్ సైకిల్ యాత్ర సాగడం ఇప్పటికీ నాటి ఉద్యమారులకు గుర్తే వుంటుంది. ఆ తర్వాత సభల నిర్వహణ బాధ్యతలు కూడా హరీష్‌రావు మీదే పడేది. తొలిసారి కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన సింహ గర్జన దగ్గర నుంచి 2023 ఎన్నికల ముందు టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మర్చిన తర్వాత జరిగిన ఖమం తొలి సభ వరకు ఆయన చేపట్టిన సభలన్నీ విజయవంతమైనవే. ఇక వరంగల్‌లో మహాగర్జన పేరుతో సుమారు 15 లక్షల మందితో సభ ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదు. అప్పట్లోనే కాదు, ఇప్పటికీ ఆ సభ ఒక చరిత్ర. తెలంగాణ వచ్చిన తర్వాత పదవులు పొందిన వారైనా,రాజకీయంగా ఎదిగిన వారైనా, ఉద్యోగాలలో ప్రమోషన్లు వచ్చినవారైనా, కొత్తగా ఉద్యోగాలు పొందిన వారైనా, వేల కూడా పలకని భూములు కోట్లు విలువ చేస్తున్నాయంటే అది తెలంగాణ పుణ్యం. హరీష్‌రావు లాంటి వారి ఉద్యమఫలితం. ఉద్యమకారులను ఎవరు తక్కువ చేసిన మాట్లాడినా, తమను తాము తక్కువచేసుకున్నట్లే..తమను తాము నిందించుకున్నట్లే…తమ అస్దిత్వాన్ని తామే అమ్ముకున్నట్లే…హరీష్‌రావును విమర్శించడం అంటే తెలంగాణ పతానకు అవమానించడమే..అదీ హరీష్‌రావు ఉద్యమ రాజకీయ చరిత్ర. ఇంతటి చరిత్ర వున్న వాళ్లు కేసిఆర్ తర్వాత ఒక్క హరీష్‌రావుకేవుంది. దటీస్ హరీష్‌రావు. ఏనీ డౌట్.