ఘోర ప్రమాదం.. లారీని వెనక నుంచి ఢీకొన్న కారు
లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈరోజు తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.
రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం బొంగులూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై లారీని వెనుక నుంచి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద అంబర్‌పేట్ నుంచి బోంగులూర్ వైపు వెళ్తుండగా ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అలాగే మృతులను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు మొయినబాద్ గ్రీన్ వాలీ రిసార్ట్‌లో పనిచేసే వారుగా గుర్తించారు. మలోత్ చందు లాల్(29), గగులోత్ జనార్దన్ (50), కావలి బాలరాజు (40)తో పాటు మరొకరు మృతి చెందారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.