‘భూ భారతితో రైతులకు మేలు’
కలెక్టర్ విజయేందిర బోయి
జడ్చర్ల నేటి /ధాత్రి:
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో సోమవారం మండలంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ విజయేందిర బోయి, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గత ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు భూభారతి చట్టం అమల్లోకి వచ్చిందని, భూ భారతి చట్టంలో పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ చేస్తే ముందు నిర్ణీత కాలంలో విచారణ, పాసు పుస్తకాలలో భూమి పటం, భూ ఆధార్ కార్డుల జారీ, ఇంటి స్థలాలకు, వ్యవసాయతర భూములకు హక్కుల రికార్డు, రైతులకు ఉచిత న్యాయ సహాయం, మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ఎవరైనా ప్రభుత్వం భూధాన్, అసైన్డ్, ఎండోమెంట్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం ఉందన్నారు. భూభారతి చట్టంతో రైతులకు మేలు కలుగుతుందన్నారు.
అనంతరం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ధరణి పేరుతో అనేక అక్రమాలకు పాల్పడిందని, బీఆర్ఎస్ రాజకీయ నాయకులు రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి, ప్రభుత్వ భూములను పట్టాలుగా మార్చారన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని ప్రజలకు మేలు చేస్తుందన్నారు. సాదా బైనామాల క్రమబద్ధీకరణ సెక్షన్ 6 ప్రకారం.. 2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసి, గత 12 సంవత్సరాలుగా.. అనుభవంలో ఉంటూ.. 12-10- 2020 నుండి 10-11-2020 మధ్య కాలంలో క్రమబద్ధీకరణ కోసం చిన్న సన్నకారు రైతులు పెట్టుకున్న దరఖాస్తులపై ఆర్డీవోలు విచారణ చేసి అర్హత ఉన్న వారి నుండి ప్రస్తుత రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారన్నారు. భూభారతి చట్టంలో రైతులకు మేలు కలుగుతూ.. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు, ఆర్డీవో నవీన్, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ తహసిల్దార్ లిఖిత రెడ్డి, బాలానగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గుమ్మల్ల అశ్విని రాజేశ్వర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్, విజయలక్ష్మి తిరుపతి, వెంకట్ రెడ్డి, పొట్లపల్లి యాదయ్య, శ్రీనాథ్ నాయక్, రైతులు పాల్గొన్నారు.