*కార్మికుల ఆరోగ్య హక్కులపై రాజీ లేదు ఈఎస్‌ఐ హాస్పిటల్స్ పూర్తయ్యే వరకు పోరాటం..
*ఈఎస్‌ఐ డిస్పెన్సరీల ఏర్పాటులో రాష్ట్రం నిర్లక్ష్యం వెంటనే భూములు కేటాయించాలని డిమాండ్..
తిరుపతి(నేటిధాత్రి)ఆగస్టు 21:
తిరుపతి పార్లమెంట్ పరిధి, నెల్లూరు జిల్లాలో కార్మికులకు, ఉద్యోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు కొత్త ఈఎస్‌ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలు ఏర్పాటు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర ఈఎస్‌ఐ డైరెక్టర్ జనరల్‌కి లేఖ రాశారు.
ఆ లేఖకు సంబంధించి ఈఎస్‌ఐ డైరెక్టర్ జనరల్ సమాధానమిచ్చారు. శ్రీ సిటీలో 100 పడకల కొత్త ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణం కోసం భూమి సేకరణ ప్రతిపాదనను ఈఎస్‌ఐ కార్పొరేషన్ గత జూన్ నెలలో జరిగిన సమావేశంలో ఆమోదించిందని తెలియజేశారుభూ సేకరణ పూర్తయిన తర్వాత వెంటనే ఆసుపత్రి నిర్మాణం ప్రారంభమవుతుందని తెలిపారు. నెల్లూరు పట్టణంలో కూడా ఈఎస్‌ఐ సొంత భూమిలో 100 పడకల ఆసుపత్రి నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దమయ్యామని, ఆసుపత్రి నిర్మాణం కోసం కాంట్రాక్టు ఇవ్వడం త్వరలోనే జరుగుతుందని పేర్కొన్నారు. తిరుపతి ఈఎస్‌ఐ ఆసుపత్రి విస్తరణకు సంబంధించి ఈఎస్‌ఐ కార్పొరేషన్ నిర్దేశించిన షరతుల ప్రకారం గత మూడు సంవత్సరాల్లో బెడ్ ఆక్యుపెన్సీ 70 శాతానికి మించి ఉండాలని, కానీ గత మూడు సంవత్సరాలలో బెడ్ ఆక్యుపెన్సీ తక్కువ నమోదవడంతో ప్రస్తుతం ఆసుపత్రి విస్తరణకు అర్హత రాలేదని చెప్పారు. అయితే భవిష్యత్తులో ఆక్యుపెన్సీ పెరిగితే విస్తరణ ప్రతిపాదనను మళ్లీ పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
కొత్తగా మంజూరైన ఈఎస్‌ఐ డిస్పెన్సరీల విషయానికి వస్తే, రాష్ట్ర ప్రభుత్వం తగిన భూములు ఇవ్వడంలో ఆలస్యం చేస్తోందని, అయినా కూడా తాత్కాలికంగా అద్దె భవనాల్లో వీటిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డైరెక్టర్ జనరల్ స్పష్టం చేశారు.
ఈ సందర్బంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ తిరుపతి, నెల్లూరు జిల్లాలలో అధిక సంఖ్యలో ఉన్న కార్మికులు, ఉద్యోగులకి తగిన వైద్య సదుపాయాలు కల్పించేందుకు ఈఎస్‌ఐ హాస్పిటల్స్ ఏర్పాటు చాలా ముఖ్యమని అన్నారు. గతంలో ఇదే అంశంపై పార్లమెంటులో పలుమార్లు ప్రస్తావించిన అంశాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు. త్వరలోనే ఈఎస్‌ఐ ఆసుపత్రుల నిర్మాణం ప్రారంభమయ్యేలా కృషి చేస్తామని అన్నారు. ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు కూడా తక్షణమే ప్రారంభమయ్యేలా ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు. ఈఎస్‌ఐ డిస్పెన్సరీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించి కార్మికుల సంక్షేమం పట్ల తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలని కోరారు.