‘శ్రీరామ్’ బ్యాగ్‌తో తాజ్‌మహల్ చూసేందుకు అనుమతించలేదు.. పర్యాటకుడి ఆరోపణ
శ్రీరామ్ అని రాసున్న బ్యాగ్ ఉన్నందుకు తనను తాజ్‌మహల్ చూసేందుకు అనుమతించలేదంటూ యూపీకి చెందిన ఓ పర్యాటకుడు సంచలన ఆరోపణలు చేశారు. అయితే భద్రతా సిబ్బంది మాత్రం అతడి వాదనలను కొట్టిపారేశారు.
ఇంటర్నెట్ డెస్క్: తాజ్‌మహల్ చూసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి తాజాగా అక్కడి సెక్యూరిటీ సిబ్బందిపై సంచలన ఆరోపణలు చేశాడు. శ్రీరామ్ అని రాసున్న బ్యాగు తీసుకుని తాజ్‌మహల్ చూసేందుకు వెళుతున్న తనను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారని ఆరోపించాడు. బ్యాగ్ తీసుకుని లోపలకు వెళ్లనివ్వలేదని చెప్పాడు. యూపీలోని కాన్‌పూర్‌కు చెందిన ఆశిష్ చేసిన ఈ ఆరోపణలు ప్రస్తుతం సంచలనం రేకెత్తిస్తున్నాయి.
ఆశిష్ సోషల్ మీడియాలో ఈ ఆరోపణలు చేశాడు. ఎంట్రీ టిక్కెట్ ఉన్నా తనను లోపలకు పంపించలేదని చెప్పాడు. శ్రీరామ్ అని రాసున్న బ్యాగ్ కారణంగానే సెక్యూరిటీ సిబ్బంది తనను అనుమతించలేదని అన్నాడు.
అయితే, తాజ్‌మహల్ సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఆశిష్ ఆరోపణలను కొట్టిపారేశారు. ఈ ఉదంతానికి మత పరమైన కోణం జోడించే ప్రయత్నం చేయడం విచారకరమని వ్యాఖ్యానించారు. ఆశిష్ బ్యాగును స్కాన్ చేయగా అందులో పలు నిషేధిత వస్తువులు కనిపించాయని తెలిపారు. బ్యాగుపైనున్న మతపరమైన రాతలకు ఈ వివాదానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
ఈ విషయంపై సీనియర్ కమాండెంట్ వైభవ్ దూబే మాట్లాడుతూ.. అశిష్ బ్యాగులో సుపారీ, కట్టర్ వంటి పలు నిషేధిత వస్తువులు కనిపించాయని అన్నారు. బ్యాగును క్లోక్ రూమ్‌లో దాచిపెట్టి రావాలి లేదా వాటిని బయటే వదిలేయాలని స్పష్టం చేశామని చెప్పారు. కానీ అతడు మాత్రం ఈ ఉదంతాన్ని రికార్డు చేసి మతపరమైన కోణం జోడించే ప్రయత్నం చేయడం విచారకరమని అన్నారు.
మరో ఘటనలో ఓ వ్యక్తి తాజ్‌మహల్ లోపలి భాగాన్ని ఫొటో తీసే ప్రయత్నం చేశాడు. షాజహాన్, ముమ్‌తాజ్ మహల్‌లకు లోపలి నుంచి ఉన్న మార్గాన్ని కెమెరాతో రికార్డు చేశారు. దీంతో ఈ రెండు టూంబ్స్‌కు ఉన్న సీక్రెట్ మార్గాలు వైరల్ అయ్యాయి.