జహీరాబాద్ ఏరియా అస్పత్రి లో మందుల సంక్షోభం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణం లోని ఏరియా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత మరింత తీవ్రరూపం దాల్చుతోంది. అత్యవసర పరిస్థితుల్లో అవసరమయ్యే ఔషధాలు లభ్యంకాకపోవడంతో పేదలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యసేవలు పేదలకే ప్రధాన ఆశగా ఉండగా, ఈ ఆస్పత్రుల్లో ప్రాథమికమైన మందులు కూడా అందుబాటులో లేని స్థితి వైద్య రంగంలోని నిర్వహణ, నిధుల కేటాయింపు విధానాలపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.
వైద్యసిబ్బంది మరియు ఆస్పత్రి యాజమాన్య వర్గాల సమాచారం ప్రకారం, సుమారు రూ. 300 కోట్ల బకాయిలు క్లియరెన్స్ కాకపోవడంతో డ్రగ్ సరఫరాదారులు మందుల పంపిణీ నిలిపివేసినట్లు వెల్లడైంది. ఈ పరిస్థితి కారణంగా అత్యవసర చికిత్సలు, శస్త్రచికిత్సలు, క్యాన్సర్ చికిత్స, గర్భిణీ స్త్రీలకు అవసరమైన మందులు, ఐ సి యు లలో ఉపయోగించే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కూడా పూర్తిగా అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సపై ఆధారపడే వేలాది పేద కుటుంబాలు ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల వైపు మొగ్గుచూపాల్సి వస్తోంది. అయితే ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స ఖర్చులు అధికంగా ఉండటంతో ఈ కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆస్పత్రిలో ఒకే రోజున వందలాది మంది అత్యవసర రోగులు చేరుతుంటారు. కాని మందులు లేకపోవడంతో వైద్యులు ప్రత్యామ్నాయ మార్గంగా రోగులను బయట ఫార్మసీల నుంచి మందులు కొనమని సూచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అవసరమైన యాంటీబయాటిక్స్, ఇంజెక్షన్లు, శస్త్రచికిత్సలకు అవసరమైన మెడికల్ కిట్లు కూడా సరిపడా లభించడం లేదు.
వైద్య నిపుణులు ఈ పరిస్థితి కొనసాగితే మరణాల రేటు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తామని, ఆరోగ్య హక్కు అందరికీ అందుబాటులోకి తెస్తామని ఇచ్చిన హామీలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఆరోగ్య రంగానికి కేటాయించిన బడ్జెట్‌లో భాగం విడుదల కాలేదని ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నప్పటికీ, ఈ ఆలస్యం వెనుక నిర్వహణలోని నిర్లక్ష్యం, పరిపాలనా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పేదలకు వైద్య సేవలు అందించడంలో కీలకపాత్ర పోషించే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి సంక్షోభ పరిస్థితులు ఏర్పడటం బాధాకరం. జన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపే ఈ సమస్యను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని పలువురు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. మందుల కొరత పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లో ఈ సమస్య మరింత తీవ్రమవుతుందని, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
