విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు..
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వసతిగృహాలలో ఫుడ్ పొయిజనింగ్ ఘటనలపై లోక్‌సభలో ఎంపీ గురుమూర్తి ప్రశ్న..
తిరుపతి(నేటిధాత్రి)
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో తరచూ చోటుచేసుకుంటున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ తిరుపతి ఎంపీ డా.మద్దిల గురుమూర్తి లోక్‌సభలో కీలక ప్రశ్న వేశారు.గత ఏడాది కాలంలో తిరుపతి పార్లమెంటు పరిదిలోని నాయుడుపేట, సత్యవేడు, శ్రీకాళహస్తి తోపాటుగా రాష్ట్రంలో జరిగిన పలు సంఘటనలు తనను తీవ్రంగా కలచివేశాయని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు.
పరిశుభ్రత లోపం, పాడైన ఆర్ఓ ప్లాంట్లు, శుభ్రం చేయని నీటి ట్యాంకులు, వంటగది పరిశుభ్రత లోపం వంటి కారణాల వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్న నేపథ్యంలో ఎంపీ ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం వంటి వివరాలు కోరారు.
ఈ ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సమాధానం ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన సమాచారం గురించి ప్రస్తావిస్తూ, ఇటీవల కొన్ని పాఠశాలలలో నీరు,ఆహారం కలుషితం కావడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు మంత్రి స్పష్టం చేశారు. అయితే, వారందరికీ వైద్య చికిత్స అందించి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు.
ఈ ఘటనల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించి, లోపాలు ఉన్న చోట వెంటనే సరిదిద్దినట్లు తెలిపారు.
ఈ సమాధానంపై తిరుపతి ఎంపీ గురుమూర్తి స్పందిస్తూ ఇచ్చిన సమాధానానికి భిన్నమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగక ముందే చర్యలు తీసుకొంటే సమస్య ఉండేది కాదన్నారు. ఇప్పటికీ చాలా వసతి గృహాలలో కనీస వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. తప్పులు సరిదిద్దక పోగా ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించేలా నివేదికలు పంపుతున్నారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ప్రధాన మంత్రి పోషణ శక్తి నిర్మాణ పథకం వివరాల తోపాటుగా పాఠశాలల్లో భోజన నాణ్యత, భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల గురించి మంత్రి వివరిస్తూ
ఈ పథకాన్ని అమలు చేయడం, ప్రతిరోజూ విద్యార్థులకు పోషకాహారంతో కూడిన వేడి భోజనం అందించడం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలలు, వసతిగృహాలలో ఖచ్చితంగా పాటించాల్సిన పలు నియమాలు, సూచనలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. అగ్‌మార్క్ నాణ్యత గల సరుకులు కొనుగోలు చేయడం, వంట కార్మికులకు శిక్షణ ఇవ్వడం, వండిన ఆహారం పిల్లలకు అందించే ముందు ఉపాధ్యాయులు,పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులతో రుచి చూసే విధానం, అలాగే ఆహార నమూనాలను గుర్తింపు పొందిన ప్రయోగశాలలలో పరీక్షించడం వంటి చర్యలు అందులో భాగమని వివరించారు. అదే విధంగా, ఎఫ్‌సీఐ మంచి నాణ్యత గల ధాన్యం సరఫరా చేయడం కూడా ఈ మార్గదర్శకాలలో భాగమని పేర్కొన్నారు. అలాగే ఆహార భద్రతపై అవగాహన పెంపుకోసం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తయారు చేసిన ఫుడ్ సేఫ్టీ గైడ్‌బుక్, ఆహారంలో కల్తీ పరీక్షించే పద్ధతులపై వీడియోలు, అలాగే మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు అందుబాటులో ఉంచినట్లు మంత్రి వెల్లడించారు.
