చేనేత కార్మికుల ఉపాధిని దెబ్బతీయొద్దు…

చేనేత కార్మికుల ఉపాధిని దెబ్బతీయొద్దు

రూ.105 కోట్ల టెండర్ రద్దుతో కార్మికులు ఆందోళన

నర్సంపేట,నేటిధాత్రి:

 

ప్రభుత్వం టెస్కో (తెలంగాణ చేనేత సహకార సంఘం)కు ఏటా ఇచ్చే ఆర్డర్లను రద్దు చేయడం సమంజసం కాదని రాష్ట్ర చేనేత ఐక్య వేదిక మీడియా కార్యదర్శి లింగమూర్తి అన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు.2026-27 విద్యా సంవత్సరానికి విద్యార్థుల యూనిఫామ్ తయారీ కోసం టెస్కోకు ఇవ్వాల్సిన రూ.105.54 కోట్ల ఆర్డర్‌ను రద్దు చేయడం చేనేత కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. వివిధ సంక్షేమ శాఖల నుంచి వచ్చే ఆర్డర్లు కూడా నిలిపివేయడంతో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు.దశాబ్దాలుగా విద్యాశాఖ, సంక్షేమ శాఖల పరిధిలోని విద్యార్థులకు దుస్తులు తయారీ బాధ్యతను చేనేత సహకార సంఘాలు నిర్వహిస్తున్నాయని, అయితే ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారికి ఉపాధి లేకుండా పోయిందని విమర్శించారు. ప్రతి ఏడాది జనవరిలో వచ్చే ఆర్డర్లు ఏప్రిల్ నెలకు చేరుకున్నా రాకపోవడంతో కార్మికులు ఆదాయం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థుల యూనిఫామ్ ఆర్డర్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 393 చేనేత సహకార సంఘాల్లో ఇప్పటికే సరిపడా పని లేక కార్మికులు ఇబ్బందులు పడుతుండగా, ప్రభుత్వం కూడా ఆర్డర్లను నిలిపివేయడం దారుణమని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి టెస్కోకు ఆర్డర్లు కేటాయించేలా నిర్ణయం తీసుకోవాలని, అలాగే వివిధ శాఖల నుంచి వచ్చే పనులను చేనేత సంఘాలకు అప్పగించి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని లింగమూర్తి కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version