భక్తులతో పోటెత్తిన దత్తగిరి.. ముగిసిన సంగీత్ దర్బార్.
జహీరాబాద్. నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని బర్దిపూర్ దత్తగిరి క్షేత్రంలో తెలంగాణ ఉద్యమ గాయని రేలారే రేలా గంగా భక్తి పాటలతో దుమ్ము లేపింది. దత్తగిరి మహారాజ్ 46వ వార్షిక అమర తిథి సందర్భంగా ఆలయంలో రాత్రి ఆశ్రమ పీఠాధిపతులు అవధూత గిరి, సిద్దేశ్వరానంద గిరి జ్యోతి ప్రజ్వలన చేసి రాత్రి 10 గంటలకు సంగీత దర్బార్ ను ప్రారంభించారు. రేలారే గంగ బృందం సభ్యులు ఫోక్ సింగర్స్ జంగిరెడ్డి,సునీత, మల్లంపల్లి రాజు వారు నిర్వహించిన భక్తి జానపద గీతాలతో దత్తాత్రేయ స్వామి వారి భక్తులు మంత్ర ముగ్ధులయ్యారు. భక్తి పాటలతో దత్తగిరి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
ఆదివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమైన సంగీత దర్బార్ సోమవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగింది. గంగా ఫోక్ సాంగ్స్ తో మహిళల భక్తులు స్టెప్పులు, కోలాటలు వేశారు. అనంతరం నారాయణఖేడ్, బీదర్, జహీరాబాద్, ప్రాంతాల నుంచి వచ్చిన సంగీత కళాకారులతో భజన సంకీర్తనలు కొనసాగాయి. వేడుకలను తిలకించేందుకు హైదరాబాద్, సంగారెడ్డి, నారాయణఖేడ్, బీదర్, జహీరాబాద్, ప్రాంతాల భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దత్తగిరి చారిటబుల్ ట్రస్ట్ అల్లాడి వీరేశం, విశ్వమాను ధర్మ ప్రచారం నాయకులు శేరి నర్సింగ్ రావు, రాజు పాటిల్ గ్రామస్తులు తమ ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఝరాసంగం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.