-డైమనిక్ పాలిటిక్స్‌లో ఆరి తేరిన లీడర్!
-ఒక్కసారి కమిటైతే తన మాట తానే వినడు.
-రేవంత్ వేసిన స్కెచ్‌కు ఎదురుండదు.
-ఎవ్వరి సలహాలు తీసుకోడు.
-తన ఆలోచనలకు అనుగుణంగా మాత్రమే ముందుకు వెళ్తారు.
-తన నిర్ణయాలు వెంట నడిచే వారిని వదులుకోడు.
-ఒక్కసారి నమ్మితే జీవితాంతం వదిలిపెట్టడు.
-రాజకీయాలలో నీతికి చోటు వెతకడం సాధ్యం కాదని తెలుసు.
-అధికారం కోసం రాజకీయాలలో సందర్భోచిత అడుగులు నేర్చుకున్నాడు.
-ఓటమి నేర్పిన పాఠాలనుంచి వెంటనే బైట పడగలిగే శక్తి వున్న నాయకుడు.
-రెండేళ్ళుగా ప్రతిపక్షాలకు ఊపిరి సలపకుండా చేస్తున్నాడు.
-తనను తిట్టిన బిఆర్‌ఎస్‌ను ఓడిరచి గెలిగిన ధీరుడు.
-ఎదురయ్యే సమస్యలను క్షణాలలో మరిపించగలడు.
-రెండేళ్ళలలో జరిగిన పొరపాట్లను కూడా జనం మర్చిపోయేలా చేయగలడు.
-తన మాటలను మాత్రం ఎప్పుడూ లైమ్ లైట్‌లో వుంచగలడు.
-మీడియా అటెన్షనంతా తనపైనే ఫోకస్ చేసుకోగలడు.
-ఒక్క మాటతో సమస్యలన్నీ పక్కదారి పట్టించగలడు.
-రాజకీయ వ్యతిరేకుల చేత కూడా దటీజ్ రేవంత్ అనిపించుకోగలడు.
-రాజకీయాలెప్పుడూ సక్సెస్ చుట్టే తిరుగుతాయి.
-ఈ విషయం రేవంత్ కు తెలిసినంతగా మరే నాయకుడికి తెలియదు.
హైదరాబాద్,నేటిధాత్రి:
డైవర్ట్ అనే మాట లేకుండా దేశంలో రాజకీయాలు సాగడం లేదంటే అతిశయోక్తి కాదు. ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేదు అన్ని పార్టీలు అదే అనుసరిస్తున్నాయి. ఆ దారిలోనే నడుస్తున్నాయి. అలాంటి డైవర్షన్ పాలిటిక్స్‌ను ఎవరు సమర్థవంతంగా పోషిస్తే రాజకీయాలలో వాళ్లే కింగ్‌లౌతున్నారు. అలాంటి నాయకులే దేశమంతటా సాగుతున్నారు. డైవర్షన్ రాజకీయాలే ప్రపంచమంతా సాగుతున్నాయనేది కూడా ముమ్మాటికీ నిజం. అలాంటి రాజకీయాలను నమ్ముకుంటే తప్ప రాణించలేమని నాయకులు తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఎదురౌతున్నాయి. రాజకీయం కూడా ఒక లక్ష్యం చేసుకొని నాయకుడవ్వాలి. రాజకీయాలలో డైవర్షన్లు, డైమెన్షన్లు సహజం. అవి లేకుండా రాజకీయాలు సాధ్యమయ్యే రోజులు కావు. నైతికత అనే పదానికి కాలం చెల్లిన రోజులు. ముళ్లును ముళ్లుతోనే తీయాలి. బలమైన రాజకీయ శక్తులను ఎదిరించి నిలబడలాంటే లాజిక్‌ల కన్నా మ్యాజిక్‌లే ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. నమ్మకాల విన్యాసాలే రాజ్యమేలుతాయి. జనం ఎప్పుడూ ఏదో ఒకటి కొత్త దనం కోరుకుంటారు. ఆ కొత్తను సరికొత్తగా చూపించే నాయకుడు విజేత అవుతాడు. ఇప్పుడున్న పరిస్థితులలో మడికట్టుకునే రాజకీయాలు సాధ్యం కాదు. భీమ్మించుకొని కూర్చుంటే అసలే సాధ్యం కాదు. ఎత్తుకు పైఎత్తులలో అవతలి వారిని చిత్తు చేయాలంటే టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించాల్సిందే..గత పాలకుల కన్నా భిన్నంగా పాలిస్తానని నాలుగు మాటలు చెబితే ప్రజలు ఆహ్వానించే రోజులు ఎప్పుడో పోయాయి. అలా చెప్పిన వారిని కూడా ప్రజలు ఆదరించిన సందర్భాలు కూడా లేవు. జనం కోరుకునే వాటినైనా నాయకులు కళ్ల ముందు వుంచుతామనే మాటలు చెప్పి ఒప్పించాలి. లేకుంటే నాయకుడి ఆలోచనల్లోకైనా జనాన్ని రప్పించి గోల్ కొట్టాలి. ఒక్కసారి వెనుకబడితే ముందుకొచ్చే రోజులు కావు. ఎదురొచ్చిన వారి నుంచి తప్పుకుంటూ కాకుండా, వారిని తప్పిస్తూ ముందుకు వెళ్తేనే సక్సెస్ అవుతున్న రోజులు. ఈ ఎత్తులు, వ్యూహాలు ఆది నుంచి అనుసరిస్తూ, ఆచరిస్తూ ముందుకెళ్లి సక్సెస్ అయిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన అవకాశాలు ఎదురు రాలేదు. అవకాశాలను తన వైపు తిప్పుకొని గెలుస్తూ వచ్చాడు. నిజం చెప్పినా సరే తనదైన శైలిలో చెప్పి గెలిచాడు. అబద్దాలు చెప్పినా సరే జనం అవే వాస్తవమని నమ్మేలా చేశాడు. డైరెక్ట్‌గా డైవర్షన్ పాలిటిక్స్‌లో కింగ్ అయ్యారు. రాజకీయాలలో ఎలా గెలిచారన్నది ఎప్పుడూ పాయింట్ కాదు. గెలిచారా లేదా? అన్నదే కీ పాయింట్. అందుకే సిఎం. రేవంత్ రెడ్డి సక్సెస్‌కు కేరాఫ్‌గా నిలిచారు. అవతలి వారిని ప్రతిసారి ఊహించని దెబ్బ కొట్టడంలో ఆరి తేరిన నాయకుడనిపించుకున్నారు. ప్రతి సందర్భంలోనూ అసమ్మతి నుంచి సమ్మతి పొందిన నాయకుడై వెలుగొందుతున్నారు. బరి గీసి నిలబడి, ఎదురించి నిలబడి విజయాన్ని దాసోహం చేసుకుంటున్నారు. దటీజ్ రేవంత్ రెడ్డి అని ప్రత్యర్థుల చేత కూడా అనిపించుకుంటున్నారు. రాజకీయాలలో రకరకాల భిన్నాభిప్రాయాలు వుండొచ్చు. అభిప్రాయ బేధాలు పొడసూపొచ్చు. కానీ కాదనుకున్న వారి చేత కొనియాడబడే స్థాయికి చేరుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది అందరికీ సాధ్యం అసలే కాదు. అందుకు అకుంఠిత దీక్ష అవసరం. కష్టాలు, నష్టాలు తరుముతున్నా నిలబడే ధైర్యం కావాలి. అన్నిటికన్నా గుండె నిబ్బరంగా వుండాలి. కష్టాలను చిరు నవ్వు తో స్వాగతించే మనస్తత్వం అలవడాలి. గెలుపే లక్ష్యం తప్ప మిగతావన్నీ చాలా చిన్న సమస్యలుగానే చూడాలి. లక్ష్యం పెద్దదైనప్పుడు ఎదురయ్యే సమస్యలు గడ్డిపరకలుగా మార్చుకోవాలి. ఒక్కసారి కమిటైతే తన మాట తానే వినను అనే రాజకీయాలు చేయడంలో సిఎం. రేవంత్ రెడ్డి దిట్ట. మనకంటూ కొన్ని పక్కా వ్యూహాలు సొంతగా వుండాలి. వాటికి తోడు ఇతర నాయకుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. మొత్తం ఇతరుల మీద ఆధారపడితే మొదటికే మోసం రావొచ్చు. ఈ విషయం స్పష్టంగా తెలిసిన నాయకుడు రేవంత్ రెడ్డి. అందుకే రేవంత్ వేసిన స్కెచ్‌కు ఎదురుండదు. ప్రతిపక్షంలో వున్నప్పుడు అటు కేసిఆర్ ను పదే పదే రెచ్చగొట్టి, మీడియా అటెన్షన్ అంతా తనవైపు తిప్పుకునే వారు. పిసిసి అధ్యక్షుడుగా వున్న సమయంలో ఒక్కరోజు కూడా రాజకీయాలకు దూరంగా వున్నది లేదు. కేసిఆర్‌ను ప్రశాంతంగా నిద్రపోనిచ్చింది లేదు. మల్లన్న సాగర్ బాదితుల పక్షాన పోరాటం చేసినా, బాసర విద్యార్థుల పక్షాన నిలిచే రాజకీయం చేసినా ప్రజలను తనవైపు తిప్పుకున్నాడు. తన ఆలోచనలకు అనుగుణంగా మాత్రమే ముందుకు వెళ్తారు. తన నిర్ణయాలతో వెంట నడిచే వారిని వదులుకోడు. ఒక్కసారి నమ్మితే జీవితాంతం వదిలిపెట్టడు. ఇంతటి మంచి తనం రేవంత్ రెడ్డి సొంతం. అందుకే పార్టీలకు అతీతంగా రేవంత్ రెడ్డి ని ఇష్టపడతారు. పార్టీలు వేరైనా, సిద్ధాంతాలు వేరైనా వ్యక్తుల మధ్య వుండే స్నేహపూర్వక సంబంధాలు వేరు. ఇప్పుడున్న రోజులలో రాజకీయాలలో నీతికి చోటు వెతకడం సాధ్యం కాదని రేవంత్‌కు స్పష్టంగా తెలుసు. అందుకే అధికారం కోసం రాజకీయాలలో సందర్భోచిత అడుగులు నేర్చుకున్నాడు. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా రాజకీయాలలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడం రేవంత్ లా అందరికీ సాధ్యం కాదు. ఓటమి నేర్పిన పాఠాలనుంచి వెంటనే బైట పడగలిగే శక్తి వున్న నాయకుడగా తనను తాను నిరూపించుకున్నాడు. నేటి తరం నాయకులకు, యువతకు ఆదర్శంగా నిలిచారు. అంతే కాదు రెండేళ్ళుగా ప్రతిపక్షాలకు ఊపిరి సలపకుండా చేస్తున్నాడు. కేసిఆర్ లాంటి నాయకుడు కూడా ఒక మాట అనడానికి ముందూ వెనుక ఆలోచిస్తున్నాడు. గతంలో కేసిఆర్ ఉద్యమ కాలంలో ఎంతటి వారినైనా సరే చీల్చి చెండాడే వారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందు మాట్లాడాలంటే ఒక రకంగా జంకుతున్నాడు. ఎందుకంటే తనను తిట్టిన బిఆర్‌ఎస్‌ను ఓడిరచి గెలిగిన ధీరుడు రేవంత్ రెడ్డి. తన పాలనలో ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎదురైన అనేక సమస్యలను క్షణాలలో మరిపించగలిగేలా ఎత్తులు వేస్తూ వస్తున్నాడు. రెండేళ్ళలలో జరిగిన కొన్ని పొరపాట్లను కూడా జనం మర్చిపోయేలా చేయగలడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులకు సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. దానిని వివాదం చేయాలని బిఆర్‌ఎస్ ఎంత చూసినా ఆ పార్టీకి సాధ్యం కాలేదు. బిఆర్‌ఎస్ ఎంత మొత్తుకున్నా ప్రజలు వినిపించుకోలేదు. ఎందుకంటే కాళేశ్వరం కూలిన దాని ముందు సుంకిశాల ఎంత చిన్నది అని ఎదురుదాడి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి మొదలుపెట్టారు. దానిని పూర్తి చేసే బాధ్యత కాంట్రాక్టర్ దంటూ బిఆర్‌ఎస్ ను దబాయించారు. ఆఖరుకు ఆ పాపం కూడా బిఆర్‌ఎస్ ఖాతాలో వేసి ఎదురుదాడి చేశారు. మళ్ళీ ఇప్పటి వరకు బిఆర్‌ఎస్ సుంకిశాల మీద మాట్లాడిరది లేదు. అలా రాజకీయంగా ప్రత్యర్థులను ఇరికించడం రేవంత్ రెడ్డి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పకతప్పదు. ఆ మధ్య ఎస్‌ఎల్బీసి టన్నెల్ వ్యవహారం ఎటు పోయిందో కూడా తెలియనంతగా రాజకీయాలను తన వైపు తిప్పుకోగల సమర్థవంతమైన నాయకుడు రేవంత్ రెడ్డి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కాకపోవడానికి కూడా కేసిఆరే కారణమని ప్రజలను నమ్మించిన నాయకుడు రేవంత్ రెడ్డి. కేవలం కేసిఆర్ చేసిన అప్పుల మూలంగా నెల నెల మిత్తీలకే 6 వేల కోట్లు చెల్లిస్తున్నానని చెప్పి, ప్రజలను నమ్మించి పార్లమెంటు ఎన్నికలలో బిఆర్‌ఎస్ కు ఒక్క సీటు కూడా రాకుండా రాజకీయం చేసిన నాయకుడు రేవంత్ రెడ్డి. రాజకీయంగా తన మాటలను మాత్రం ఎప్పుడూ లైమ్ లైట్‌లో వుంచగలడు. మీడియా అటెన్షనంతా తనపైనే ఫోకస్ చేసుకోవడంలో రేవంత్ రెడ్డి దిట్ట. ఒక్క మాటతో సమస్యలన్నీ పక్కదారి పట్టించగలడు. రాజకీయాలెప్పుడూ సక్సెస్ చుట్టే తిరుగుతాయి. ఈ విషయం రేవంత్ కు తెలిసినంతగా మరే నాయకుడికి తెలియదు.