సహజ వ్యవసాయం ద్వారా పంటల ఉత్పత్తి
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
సహజ వ్యవసాయంపై రైతులకు శిక్షణ కార్యక్రమం
నర్సంపేట,నేటిధాత్రి:
సహజ వ్యవసాయం ద్వారా పంటల ఉత్పత్తి ఖర్చులు గణనీయంగా తగ్గడంతో పాటు భూమి సారాన్ని సంరక్షించుకోవచ్చని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం నర్సంపేట మండలం రాజుపేట గ్రామంలోని రైతు వేదికలో సహజ వ్యవసాయం (నేచురల్ ఫార్మింగ్)పై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గారు హాజరై రైతులనుద్దేశించి మాట్లాడుతూ, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపికపై రైతులకు అవగాహన, శిక్షణ చాలా అవసరమని పేర్కొన్నారు.సహజ వ్యవసాయం ద్వారా పంటల ఉత్పత్తి ఖర్చులు గణనీయంగా తగ్గడంతో పాటు భూమి సారాన్ని సంరక్షించుకోవచ్చని తెలిపారు.ఎక్కువగా పురుగు మందులు ఎరువులు వాడడం వల్ల ఆరోగ్య సమస్యలకు వస్తున్నాయని, వాటి నివారణకు పురుగు మందులు లేని నాణ్యమైన ఆహారం అవసరమని తెలియజేశారు.
రసాయనాల వినియోగాన్ని తగ్గించి, సహజ పద్ధతులను అనుసరించడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను పెంచవచ్చని రైతులకు సూచించారు.అనంతరం రైతులకు సహజ వ్యవసాయం కోసం అవసరమైన నేచురల్ ఫార్మింగ్ కిట్లను జిల్లా కలెక్టర్ గారు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అగ్రికల్చర్ జెడి అనురాధ, హార్టికల్చర్ జిల్లా అధికారి శ్రీనివాస్ రావు, నర్సంపేట సహాయ వ్యవసాయ సంచాలకులు దామోదర్ రెడ్డి , వ్యవసాయ అధికారి కృష్ణ కుమార్, నర్సంపేట తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
