సిపిఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి..
సిపిఐ 5వ జిల్లా మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
ఈ నెల 13,14 న నిర్వహించే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 5వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవన్ లో సిపిఐ నాయకులతో కలిసి మహాసభల గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ మహాసభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు హాజరు కానున్నట్లు తెలిపారు.
ఈ మహాసభలకు 150 మంది డెలిగేట్స్ తో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా మహాసభలను ఈ నెల జులై 13, 14 న రేగొండ ఎస్ ఎల్ ఎన్ గార్డెన్ లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
మహాసభలో జిల్లా సమగ్ర అభివృద్ధికై చర్చించి భవిష్యత్ కార్యక్రమం రూపొందించుకోవడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా భూపాలపల్లికి బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయాలని, జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం జిల్లా సమగ్ర అభివృద్ధిని ప్రతిబింబించే విధంగా మహాసభలలో చర్చించడం జరుగుతుందన్నారు.
అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయించాలని కోరారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన పెద్ద ఎత్తున చర్చ జరిపి తీర్మానాలు ప్రవేశపెట్టి ఆందోళన పోరాటాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. జిల్లా మహాసభలను ప్రజలు, మేధావులు, కార్మికులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని రాజ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు మాతాంగి రామచందర్, గురుజేపల్లి సుధాకర్ రెడ్డి, సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొరిమి సుగుణ, క్యాతరాజ్ సతీష్, నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్, గోలి లావణ్య, పెద్దమాముల సంధ్య, పొన్నగంటి లావణ్య, రమేష్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.