*జనగణన సిబ్బందికి ప్రజలు సహకరించాలి*
*జనగణనలో భాగంగా నేటి నుండి జూన్ 9 వరకు ఇండ్ల గణన*
*జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్*
*సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)*
జనగణన 2027 మొదటి దశలో భాగంగా నేటి నుండి జూన్ 9 వరకు ఇంటింటికీ వచ్చి ఎన్యూమరేషన్ చేసే సిబ్బందికి ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరిమ అగ్రవాల్ కోరారు.
జనగణన మొదటి దశలో భాగంగా సిరిసిల్ల పట్టణం లోని సుభాష్ నగర్ లో ఎన్యూమరేటర్లు ఇండ్ల గణన కోసం చేస్తున్న మ్యాపింగ్ ప్రక్రియను సోమవారం కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
జనగణన ప్రక్రియ చాలా ముఖ్యమైనదని, గణాంకాల రూపకల్పనకు సమగ్ర, ఖచ్చితమైన వివరాలను ప్రజలు అందించి జనగణన సిబ్బందికి సహకరించాలని కలెక్టర్ అన్నారు.
ఈరోజు నుండి 3 రోజుల పాటు ఇండ్ల గణన కోసం బ్లాక్ వారీగా మ్యాపింగ్ చేయడం జరుగుతుందని, తదనంతరం ప్రతీ ఇంటి నుండి వివరాలు సేకరించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 173 మంది సూపర్ వైజర్లు, 1025 మంది ఎన్యూమరేటర్లకు శిక్షణ అందించామని, ఎన్యూమరేటర్లకు ఫోటో, క్యూ ఆర్ కోడ్ తో కలిగిన గుర్తింపు కార్డులు అందించడం జరిగిందని, దానిని స్కాన్ చేస్తే అధికారిక వెబ్ సైట్ లో పొంది ఉంచిన వారి పూర్తి వివరాలు వస్తాయని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. వారు అడిగే 33 రకాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పి సహకరించాలని కోరారు. వేసవి కాలం దృష్ట్యా క్షేత్ర స్థాయిలో ఎన్యూమరేటర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. జనగణన పేరుతో ఎవరైనా అనుమానిత వ్యక్తులు మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగే అవకాశం ఉంటుందని, అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు.
పరిశీలనలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస చారి, మున్సిపల్ కమీషనర్ ఖదీర్ పాషా, సిరిసిల్ల తహసీల్దార్ మహేష్, తదితరులు ఉన్నారు.
