విద్య, తెలుగు సంస్కృతి అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చర్యలు..
ఏపీ నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని మారిషస్‌లో సంస్కృతిక వేడుకగా నిర్వహించుకుంటారని మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ వ్యాఖ్యానించారు. తెలుగు భాష విద్య సంస్కృతిని కాపాడటంలో మారిషస్ తెలుగు మహాసభ ముఖ్య పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
మారిషస్‌లో తెలుగు సాహిత్యం, భాషను ప్రోత్సహించడంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశేష కృషి చేశారని మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ (Mauritius President Dharam Bir Gokul) వ్యాఖ్యానించారు. చంద్రబాబు మారిషస్ వచ్చినపుడు దేశంలో విద్య, తెలుగు సంస్కృతి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. తెలుగు భాషాభివృద్ధి కోసం కృషి చేస్తోన్న సీఎం చంద్రబాబుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని తెలిపారు ధరమ్ బీర్ గోకుల్.
ఇంగ్లీష్ భాష ఎక్కువగా వినియోగించడంతో తెలుగు వంటి ప్రాచీన భాషపై ప్రతికూల ప్రభావం చూపుతోందని అన్నారు. ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచంలో సగానికి పైగా భాషలు అంతరించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పూర్వికుల నుంచి వచ్చిన మాతృభాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి విధిగా తీసుకోవాలని సూచించారు. చారిత్రాత్మక, విశిష్టమైన మూడో ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరు జిల్లాలో జరపడం అభినందనీయమని తెలిపారు. ఈ మహాసభల్లో తనకు ప్రసంగించే అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. గుంటూరులో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు వైభవంగా కొనసాగుతోన్నాయి. ఇవాళ(ఆదివారం) ఈ సభలో పాల్గొని ప్రసంగించారు ధరమ్ బీర్ గోకుల్.
