బిజెపి పాలనలో ప్రమాదంలో పౌర హక్కులు
ప్రజాస్వామ్య పరిరక్షణకు కామ్రేడ్ ఓంకార్ ఉద్యమాలు ఆదర్శం
ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
“పౌర హక్కుల పరిరక్షణ- ఓంకార్ పాత్ర” అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం
నర్సంపేట,నేటిధాత్రి:
కేంద్ర బిజెపి పాలనలో భారత రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని వాటి రక్షణ కోసం ప్రతి పౌరుడు కామ్రేడ్ ఓంకార్ గారి త్యాగస్ఫూర్తితో ఉద్యమించాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, సిపిఐ జిల్లా నాయకుడు అక్కపెళ్లి రమేష్, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు ఎలకంటి రాజేందర్, మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి అడ్డూరి రాజు, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు కల్లేపల్లి ప్రణయ్ దీప్, టీజెఎస్ జిల్లా అధ్యక్షుడు షేక్ జావిద్, డిబిఆర్ఎస్ అందే రవిలు పిలుపునిచ్చారు.శుక్రవారం ఎంసిపిఐ(యు) డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవాల్లో భాగంగా పౌర హక్కుల పరిరక్షణ ఓంకార్ పాత్ర అనే అంశంపై వామపక్ష కమ్యూనిస్టు సామాజిక ప్రజా సంఘాల బాధ్యులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని స్థానిక నర్సంపేట లోని ఓంకార్ భవన్ లో పార్టీ డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్ అధ్యక్షతన జరిగింది.
ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన వారు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఈడి,సిబిఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీ నాయకులను అక్రమంగా జైలులో పెట్టుతున్నదని ఆరోపించారు.అర్బన్ నక్సలైట్లని టెర్రరిస్టులని రకరకాల పేర్లతో నిర్బంధం ప్రయోగిస్తూ మావోయిస్టుల పేరుతో బూటకపు ఎన్కౌంటర్లతో అడవిలో మూలవాసులైన ఆదివాసీలను కాల్చి చంపుతున్నారని అటవీ సంపద కార్పొరేట్ పెట్టుబడిదారులకు కట్టబెడుటకు దోచిపెడుటకు అనేక కుట్రలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.భారత రాజ్యాంగంలోని మూడవ భాగంలో ఆర్టికల్స్ 14 నుంచి 24 లో పొందుపరచబడిన స్వేచ్ఛ సమానత్వ మత విద్య సాంస్కృతిక రాజ్యాంగ ప్రాథమిక హక్కులను కాలరాస్తూ పౌరులుగా స్వేచ్ఛగా జీవించలేని స్థితికి నెట్టివేస్తున్నారని 1975 ఎమర్జెన్సీ కంటే భిన్నంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ప్రజాస్వామిక పత్రిక స్వేచ్ఛను సైతం హరించి వేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆనాడు కామ్రేడ్ ఓంకార్ పౌర హక్కులు శాంతిభద్ర సమస్యలపై అసెంబ్లీలో సుమారు రెండు గంటలకు పైగా మాట్లాడి ప్రజా పోరాటాల పరిరక్షణకై హక్కులకై గలమెత్తి చట్టసభలకు వన్నె తెచ్చి నేటి తరానికి ఆదర్శంగా నిలిచారని బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా భార్గవ కమిషన్ వేయించి సాక్షులను ప్రవేశపెట్టి పాలకవర్గాల గుట్టు రట్టు చేసిన గొప్ప యోధుడు కామ్రేడ్ ఓంకార్ ని ఆయన పౌర హక్కుల రక్షణ కోసం చేసిన కృషి నేటికీ ఎంతో అనుసరణీయమని ఈ క్రమంలో ప్రమాదంలో ఉన్న పౌర హక్కులను కాపాడుకునేందుకు వామపక్ష కమ్యూనిస్టు సామాజిక శక్తులు ఐక్యంగా ముందుకు సాగాలని ఆ దిశలో ప్రతి పౌరుడు ఉద్యమాల్లో కలిసిరావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఎంసిపిఐ(యు) జిల్లా నాయకులు కుసుంబ బాబురావు, నాగెల్లి కొమురయ్య, వంగల రాగసుధ, డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, జిల్లా కమిటీ సభ్యులు కేశెట్టి సదానందo, కలకోట్ల యాదగిరి, దామ సాంబయ్య, ఏఐఎఫ్డిఎస్ డివిజన్ కార్యదర్శి మార్త నాగరాజు,కర్నే సాంబయ్య, సింగరబోయిన కట్టయ్య, జి.అశోక్, సాయి తదితరులు పాల్గొన్నారు.