ఛలో…‘చార్‌ధామ్’.. దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్…
మన జీవిత పుస్తకంలో ‘చార్‌ధామ్’ యాత్ర లాంటి పేజీ ఒకటి ఉంటే దానికి మరింత విలువ చేకూరుతుంది. ‘చార్‌ధామ్’ యాత్రలో వేసే ప్రతీ అడుగు జీవితంలో కొత్త మలుపునిస్తుంది. మానసికంగా ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఆ విశేషాలే ఇవి…
అంటే నాలుగు క్షేత్రాలని అర్థం. దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్ రాష్ట్రం హిమాలయ పర్వత శ్రేణుల్లో కొలువై ఉన్న 4 పుణ్య క్షేత్రాలు యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లను దర్శించుకునేందుకు చేసే యాత్రనే ‘చార్‌ధామ్’ యాత్ర అంటారు. జీవితంలో ఒక్కసారైనా ఈ నాలుగు పుణ్యక్షేత్రాలు దర్శించాలని ప్రతీ హిందువు కలలు కంటారు. ప్రతీ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో మొదలై… అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ యాత్ర ముగుస్తుంది. ఈ దేవాలయాలు హిమాలయాల్లో ఉంటాయి కాబట్టి చలికాలం అంతా మంచులో కప్పబడి ఉంటాయి. అందుకే చలికాలం వాటిని దర్శించడం కుదరదు. కావున ఆరు నెలలపాటు దేవాలయాలు మూసేసి ఉంచుతారు.
యమునోత్రితో ప్రారంభమయ్యే ఈ యాత్ర గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ దర్శనంతో ముగుస్తుంది. అందరూ ఇలానే చేయాలని లేదు. కొందరు కొన్నింటిని మాత్రమే దర్శించుకుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారు ముందుగా ఢిల్లీ చేరుకోవాలి. విమానంలో వెళ్లాలనుకునేవారు డెహ్రాడూన్, రైలులో రిషికేశ్ వరకు వెళ్లవచ్చు లేదా ఢిల్లీ నుంచి 206 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించి హరిద్వార్ చేరుకోవాలి. అక్కడ రాత్రి బస చేసి గంగా హారతి, మానసా దేవి దేవాలయాన్ని దర్శించుకోవచ్చు. మరుసటి రోజు ఉదయాన్నే హరిద్వార్ నుంచి బారాకోట్ మీదుగా యమునోత్రికి వెళ్లే బస్సులు ఉంటాయి.
