కులాల లెక్కలతో ఢిల్లీకి చెక్!

కులాల లెక్కలతో ఢిల్లీకి చెక్!
డేటా వెనుక రేవంత్ ప్లాన్!

 

తెలంగాణ ప్రభుత్వం కులగణన వివరాలను బహిరంగ పరిచింది. అయితే ఇప్పుడు ఎందుకు అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ డేటాను ఏప్రిల్ 2026లో వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచడం వెనుక కేవలం సామాజిక బాధ్యత మాత్రమే కాకుండా అత్యంత లోతైన రాజకీయ వ్యూహం కూడా దాగి ఉంది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో మహిళా రిజర్వేషన్లు ,నియోజకవర్గాల పునర్విభజన పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఈ అస్త్రాన్ని బయటకు తీసింది.

ఈ గణాంకాలను ఇప్పుడు విడుదల చేయడానికి ప్రధాన కారణం కేంద్రంపై ఒత్తిడి పెంచడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశవ్యాప్త జనగణన ప్రక్రియ ప్రారంభమవుతున్న తరుణంలో అందులో కులగణనను కూడా చేర్చాలనే డిమాండ్ బలంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం తన పరిధిలో 50 రోజుల్లోనే 1.12 కోట్ల కుటుంబాల డేటాను సేకరించి విజయవంతంగా ప్రదర్శించడం ద్వారా.. రాష్ట్రాలే చేయగలిగినప్పుడు కేంద్రం ఎందుకు చేయలేకపోతోంది అనే ప్రశ్నను బలంగా సంధించింది. ఈ డేటా ద్వారా సామాజిక న్యాయం సాధించడంలో తాము దేశానికే రోల్ మోడల్ అని చాటుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది.

మరో కీలక అంశం ఏమిటంటే.. రాబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన పెరుగుతోంది. కేవలం 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన సీట్ల విభజన జరిగితే రాజకీయ బలం తగ్గిపోతుందనే భయం ఉంది. ఈ నేపథ్యంలో శాస్త్రీయమైన కులగణన వివరాలు చేతిలో ఉంటే సామాజిక వర్గాల వారీగా తమ వాటాను డిమాండ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బలమైన ఆధారం దొరుకుతుంది. 56 శాతం ఉన్న బీసీలు , మెజార్టీగా ఉన్న మాదిగ సామాజిక వర్గాల గణాంకాలు ఇప్పుడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తాయి.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ,ఇతర రాజకీయ పరిణామాల దృష్ట్యా ఈ నివేదిక అధికార పార్టీకి ఒక రక్షణ కవచంలా పనిచేయనుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదనకు ఈ సర్వే ఫలితాలు చట్టబద్ధతను కల్పిస్తాయి. ఏ సామాజిక వర్గం ఎంత వెనుకబడి ఉందో లెక్కలతో సహా నిరూపించడం ద్వారా సంక్షేమ పథకాల కేటాయింపులో అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని ప్రశ్నించే అవకాశం లభిస్తుంది. మొత్తానికి.. ఈ కులాల లెక్కలు కేవలం అంకెలు మాత్రమే కావు.. ఇవి రాబోయే కాలంలో జాతీయ రాజకీయాల గమనాన్ని మార్చే దిశగా వేసిన వ్యూహాత్మక అడుగులు అనుకోవచ్చు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version