హమాలి మహా గర్జనను విజయవంతం చేయండి.
తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎం.ఏ. కలీం, వర్కింగ్ ప్రెసిడెంట్ శివన్న
“నేటిధాత్రి”, హైదరాబాద్.
తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ దశమ వార్షికోత్సవ మహాసభను ఘనంగా, విజయవంతంగా నిర్వహించాలని యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ శివన్న పిలుపునిచ్చారు.
సోమవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో “హమాలి మహా గర్జన” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎం.ఏ. కలీం నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శివన్న మాట్లాడుతూ రాష్ట్రంలో హమాలీలు అనేక కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. పగలు – రాత్రి తేడా లేకుండా శ్రమించి సమాజానికి సేవలు అందిస్తున్న హమాలీలకు ఇప్పటికీ సరైన గుర్తింపు, సామాజిక భద్రత అందకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.ఎన్నికల సమయంలో ప్రభుత్వం హమాలి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ అమలు కాకపోవడం హమాలీలకు తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. వెంటనే హమాలి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి హమాలీల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు పది లక్షల మంది హమాలీలు వివిధ మార్కెట్లు, గోదాములు, రవాణా కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్ యార్డులు మరియు ప్రైవేట్ సంస్థల్లో కష్టపడి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు.
కనీస భద్రతా పథకాలు, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, వృద్ధాప్య పెన్షన్, పిల్లల విద్యకు సహాయం వంటి సంక్షేమ పథకాలు సరైన స్థాయిలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.హమాలీలు రోజువారీ కూలీలుగా పనిచేసే క్రమంలో ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అలాంటి సందర్భాల్లో వారికి ఎటువంటి భరోసా లేకుండా పోతుందని అన్నారు. కాబట్టి హమాలి వెల్ఫేర్ బోర్డు ద్వారా ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, వృద్ధాప్య పెన్షన్, పిల్లల విద్యా సహాయం వంటి సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.హమాలీల హక్కులు, సంక్షేమం కోసం ఈ నెల 15వ తేదీన హన్మకొండలోని హయగ్రీవాచారి మైదానంలో తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న “హమాలి మహా గర్జన” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శివన్న పిలుపునిచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో హమాలీలు, కార్మిక సంఘాల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ విలేకరుల సమావేశంలో యూనియన్ నాయకులు రవికుమార్ (మూసాపేట రైల్వే గూడ్స్ షెడ్ అధ్యక్షులు), ఉగ్రం యాదవ్ (బోయినపల్లి మార్కెట్ అధ్యక్షులు), సంఘం సలహదారులు ఆవాల హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
