https://epaper.netidhatri.com/
`కొత్తవారికి అవకాశం ఇవ్వండి.
`కార్యకర్తల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోండి.
`ఆత్మలు ఇతర పార్టీలలో వున్న వారుకూడా వున్నారు.
`వడపోత అవసరం.
`లేకుంటే ప్రజలు మరింత నిరాశకు లోనౌతారు.
`ప్రజలు కేసిఆర్ వెంట వున్నారు.
`కార్యకర్తలు కోరుకునే అభ్యర్థులను నిలబెట్టండి.
`అత్యధిక సీట్లు ఖాయం చేసుకోండి.
హైదరాబాద్,నేటిధాత్రి:
ఇప్పటికైనా తేరుకోండి..జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోండి. కార్యకర్తలు ఏం చెబుతున్నారో వినిపించుకోండి. వారి అభిప్రాయాలు స్వీకరించండి. వారి సూచనలకు విలువ ఇవ్వండి. కనీసం వారు ఏం చెప్పాలనకుంటుంటున్నారో చెప్పనీయండి. వారి మనుసలో ఏముందో మీరే అడిగి తెలుసుకోండి. లేకుంటే నాయకులు, కార్యకర్తల మనసులో వున్న తాజా అభిప్రాయాలు కూడా సమాధి అయిపోతాయి. పొగడ్తలకు ఇంకా పొంగిపోకండి. అంతా బాగుందని ఎవరైనా అంటే మురిసిపోకండి. పూర్తిగా నమ్మేయకండి. నిజనిర్ధారణ చేసుకోండి. పది మంది అభిప్రాయలను పోల్చి చూడండి. ప్రతి నియోజకవర్గం సందర్శించండి. కింది స్ధాయికార్యకర్త కూడా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండి. తోటి కార్యకర్తల మనోభావాలకు విలువనివ్వండి. ఇప్పటికైనా మన పార్టీలో కూడా మాట్లాడే స్వేచ్ఛ వుందని గర్వపడేలా చేయండి. వారు సంతోషపడేలా చూడండి. మా మాటలకు, మా సూచనలకు విలువ వుంటుందన్న నమ్మకాన్ని వారిలో కల్పించండి. ఎందుకంటే నిన్నటిదాకా అధికారంలో వున్నారు. ఏ కార్యకర్తకు అందుబాటులో లేరు. ఎంత సేపు పాలన తప్ప పార్టీకి సమయం ఇవ్వలేదు. ఈ మాట ఎన్టీఆర్ కాలం నుంచి, చంద్రబాబు పాలన నుంచి, ఇప్పుడు తెలంగాణలో కేసిఆర్ పాలనలో కూడా వింటూనే వున్నాం. ఎందుకంటే ఈ విషయాలు పూర్తిగా కేసిఆర్‌కు కూడా తెలుసు.
ఉమ్మడి రాష్ట్రంలో 1989లో ఎన్టీఆర్ ఓడిపోవడానికి కారణం కేవలం ఆయన నేరుగా ప్రజలను కలవకపోవడం.
పై స్ధాయి నేతలకు తప్ప, ఆయన దర్శనబాగ్యం ఎవరికీ అందకపోవడం. ఎంతో నిజాయితీగా, అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినా 1989లో తెలుగుదేశం ఓడిపోయింది. తర్వాత 1994లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. కానీ అధికార మార్పిడి జరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. పాలనలో విపరీతమైన సంస్కరణలు తెచ్చారు. కొత్త పరిపాలనావిధానాలు అమలు చేశారు. పాలనలో ప్రజలను భాగస్వాములు చేశారు. శ్రమ దానం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పచ్చదనం..పరిశుభ్రత అనే కార్యక్రమాలు చేపట్టారు. రైతులకు చేయూత అనే కార్యక్రమం అమలు చేశారు. ఆ రోజుల్లో రైతులకు పని ముట్లు ఉచితంగా ప్రభుత్వం ద్వారా అమలు చేశారు. హైటెక్ పాలనకు మొదలు పెట్టారు. నేరుగా అధికారులతో చంద్రబాబు మాట్లాడుతుండడం చేశారు. జన్మభూమి కార్యక్రమంతో ప్రజలకు బాగా చేరువయ్యారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలు తీర్చారు. కొత్తకొత్త ఫ్లైఓర్లు నిర్మాణం చేసి, హైదరాబాద్‌కు అప్పుడున్నంత మేర కొత్త హంగులు దిద్దారు. అప్పటి ప్రజా ప్రతినిధులు ఎప్పుడూ ప్రజల్లో వుండాలంటే ఎప్పటికిప్పుడు శిక్షణా తరగతులు ఏర్పాటు చేసేవారు. ఈ కార్యక్రమాల సృష్టివెనుక, అమలు వెనకు వున్న నాయకుడు కేసిఆర్. ఈ విషయం ఈతరానికి తెలియకపోవచ్చు. అంతే కాదు, 1999 ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి రావడానికి తటస్థులను రాజకీయాల్లోకి ఆహ్వానించి, కొత్త తరం రాజకీయాలకు పురుడుపోసిన చాణక్యంలో కేసిఆర్ పాత్ర కూడా ఎంతో కీలకమైంది. మరి అలాంటి కేసిఆర్ పాలకుడుగా తెలంగాణలో ఉద్యమ నేత ప్రజలకు మరింత చేరువౌతాడని అందరూ అనుకున్నారు. కాని ఆయన రానురాను జనానికి దూరమౌతూవచ్చారు. కాని జనానికి అవరమైన అన్ని పనులు చేసిపెట్టారు. ఎన్ని చేసినా మా నాయకుడు మా కళ్ల ముందుకు రావడం లేదన్న వెలితి మాత్రం ప్రజల్లో అలాగే మిగిలిపోయింది. అదే బిఆర్‌ఎస్‌ను దెబ్చతీసింది.
ఒకనాడు తెలుగుదేశం పార్టీ ప్రస్ధానం, ప్రాభవం కోసం ఎంతో కృషి చేసిన కేసిఆర్, తన సొంత పార్టీ విషయంలో మాత్రం పదేళ్లకే ప్రజలకు దూరమయ్యేలా కావడానికి ఆయన జనంలో లేకపోవడమే అన్నది మాత్రం అందరూ అంగీకరిస్తున్న విషయం.
తెలంగాణలో ఇప్పటికీ ఎవరి నాయకత్వం కావాలని ఏ సగటు వ్యక్తిని అడిగినా టక్కున చెప్పే సమాధానం ఒక్కటే..అది కేసిఆర్ …అంతలా ఆయన ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నాడు. కాని ఆయన ద్వారా నేతలైన వారు మాత్రం ప్రజలకు దూరమయ్యారు. కేసిఆర్ తో ప్రజల్లోకి వస్తే సమస్యలు తెలుస్తాయి. నాయకుల నిజస్వరూపాలు తెలుస్తాయని అందరూ అనుకున్నారు. కాని ఆయన రాలేదు. నాయకుల పట్ల ప్రజల్లో వున్న వ్యతిరేకతను స్పష్టంగా తెలుసుకోలేకపోయారు. పైగా పదేళ్ల కాలంలో ప్రతి మూడు నెలలకోసారి పార్టీ తరుపున చేయించిన అనేక సర్వేలలో ఎమ్మెల్యేల పనితీరుపై అనేక రిపోర్టులు వచ్చాయి. వాటిని కూడా అనేక పార్టీ సమావేశాల్లో సాక్ష్యాత్తు కేసిఆరే వెల్లడిస్తూ వచ్చారు. తీరు మార్చుకోవాలని సూచిస్తూ వచ్చారు. ఒక రకంగా హెచ్చరించారు. కాని ఏం జరిగింది. కేసిఆర్ చర్యలు తీసుకోలేదు. అప్పటి ఎమ్మెల్యేలు తమ తీరును మార్చుకోలేదు. పద్దతులు అసలే మార్చుకోలేదు. పెద్దగా పనులు నిర్వహించిన దాఖలాలు కనిపించలేదు. తెలంగాణ వ్యాప్తంగా బిఆర్‌ఎస్‌లో ఓ ముప్పై మంది ఎమ్మెల్యేల పనితీరుపై నిరంతరం ఆరోపణలు వచ్చాయి. మీడియాలో ప్రత్యేక కథనాలు వచ్చాయి. రాసిని జర్నలిస్టులను బెదించిన వార్తలు కూడా వచ్చాయి. కాని ఆరోపణలు వచ్చిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తమ తీరు మార్చుకోలేదు. అటు ప్రజల్లోనే కాదు, పార్టీలో కూడా నాయకులకు అందుబాటులో లేకుండా, గ్రూపులు తయారు చేసి, కార్యకర్తల్లోనే చీలిక తెచ్చిన ఎమ్మెల్యేలు కూడా వున్నారు. మనమంతా ఒక కుటుంబం అంటూనే వ్యత్యాసాలు చూపించిన నేతల పట్ల ఎన్నికల తరుణం సమీపిస్తున్నప్పుడు వారి అసంతృప్తిని భహిరంగానే వ్యక్తం చేస్తూనే వచ్చారు. వారి అభిప్రాయాలు పార్టీ పరిగణలోకి తీసుకోలేదన్నది వాస్తవం. అప్పటి ఎమ్మెల్యేల తీరును తప్పుపడుతూనే, మళ్లీ వాళ్లకే టిక్కెట్లు ఇస్తే ప్రజలు ఎలా స్వాగిస్తారనుకున్నారో గాని, మొత్తానికి పార్టీని చేజేతులా ముంచుకున్నది మాత్రం వాస్తవం.
త్వరలో పార్లమెంటు ఎన్నికలు రానున్నాయి.
ఈ పార్లమెంటు ఎన్నికల్లోనైనా సిట్టింగుల పేరుతో టిక్కెట్లు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. ప్రజా వ్యతిరేకత, నాయకుల అసంతృప్తి లేని వారికి టిక్కెట్లు ఇవ్వండి. పార్టీ శ్రేణులు ఎంత కష్టమైనా పడి, ప్రజలను ఒప్పించి, మెప్పించి గెలిపించుకుంటారు. అంతే కాని పార్టీలోనే వ్యతిరేకత వున్న వారికి మాత్రం మళ్లీ టిక్కెట్లు ఇవ్వొద్దు. మళ్లీ జాతీయ పార్టీల ముందు దిగదుడుపు కావొద్దు. ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు సంతోషం లేదు. మళ్లీ ప్రజలు కేసిఆర్ నాయకత్వం వైపే చూస్తున్నారు. తెలంగాణ విముక్తి ప్రధాతగానే, తెలంగాణ ప్రగతి దాతగా కేసిఆర్‌నే ప్రజలు కోరుకుంటున్నారు. అందువల్ల గెలుపు గుర్రాలకు అవకాశం ఇవ్వండి. ప్రజల్లో వ్యతిరేకత వున్నవారిని పక్కన పెట్టండి. అవసరమైతే కొత్త వారికి అవకాశం ఇవ్వండి. సీనియర్లను పార్టీ సేవలకు వినియోగించుకోండి. ఇంత కాలం ఎలాంటి పదవులు అందని వారిలో పార్టీలో మంచి పేరున్న నాయకులను గుర్తించండి. వారికి అవకాశం ఇవ్వండి. ప్రజలే గెలిపించుకుంటారు. శాసన సభ ఎన్నికల్లో అభ్యర్ధులకు సహరించక, వారి ఓటమికి పరోంక్షంగా సహకరించిన పార్లమెంటు సభ్యులు కూడా బిఆర్‌ఎస్‌లో వున్నారు. కొందరేమో తటస్ధంగా వుంటూ, ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొనలేదు. మరికొందరు ఎమ్మెల్యేలుగా వున్న సమయంలో తమ మాట లెక్క చేయలేదని, తమకు ప్రాధాన్యతనివ్వలేదని మనసులో పెట్టుకొని పార్టీని దగ్గరుండి ఓడిరచిన వారు కూడా వున్నారు. అలాంటి వారు ఎవరన్నది పార్టీలో అందరికీ తెలిసిందే..ఇది బహిరంగ రహస్యమే..అందువల్ల వారిని పూర్తిగా పక్కన పెట్టాల్సిన అవసరం వుంది. అలాంటి అవకావవాదులు, ఒక వేళ పార్టీ గెలిపించినా, మరో వైపు చూడకుండా వుండరన్న నమ్మకం లేదు. అలాంటివారు కూడా వున్నారు. అందుకే ప్రజలు కూడా తస్మాస్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. గత శాసన సభ ఎన్నికల సమయంలోనే ప్రజలు హెచ్చరించారు. అయినా అదే నాయకులను ప్రజలమీద బలవంతంగా రుద్దాలని ప్రయత్నం చేశారు. దాంతో ప్రజలు ఆ నాయకులను తిరస్కరించారు. ఇప్పుడు కూడా పొరపాటను అదే పనిచేయొద్దు. ప్రజల్లో, పార్టీలో కూడా మంచి పేరు లేని వారికి టిక్కెట్లు ఇవ్వొదు. ఇదీ జనం మాట…పార్టీ శ్రేణులు మొత్తుకుంటున్న మాట…