https://epaper.netidhatri.com/view/381/netidhathri-e-paper-19th-september-2024
బిజేపి బ్లైండ్ ప్లాన్…కేజ్రి మైండ్ గేమ్.
అడుగడుగునా ఊహించని దెబ్బ కొడుతున్న కేజ్రివాల్.
డిల్లీని సొంతం చేసుకోలేక బిజేపి అవస్థలు.
ఆమ్ ఆద్మీని ఊడ్చేయాలకుంటున్న బిజేపి కలలు కళ్లలు.
కేజ్రివాల్ ను అరెస్టు చేయగలిగారు.
సిఎం. కుర్చీను దించలేకపోయారు.
కేజ్రి రాజీనామాకు నిరంతరం డిమాండ్ చేశారు.
కేజ్రి రాజీనామా చేస్తాననగానే సంబరపడ్డారు.
కేజ్రి తన సతీమణిని సిఎం చేస్తారని ఆశపడ్డారు.
అతిశీని సిఎం చేస్తామని కేజ్రి ప్రకటనతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ వ్యూహాలు అర్థం కాక బిజేపి పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. బిజేపి జాతీయ నాయకులు ఒకటి తలిస్తే అరవింద్ కేజ్రివాల్ మరొకటి చేస్తున్నారు. అరవింద్ కేజ్రివాల్ ను జైలుకైతే పంపగలిగారు గాని, ఆయనను ముప్పు తిప్పలు పెట్టలేకపోతున్నారు. ఆయన మీద రాజకీయ ఆధిపత్యం కొనసాగించలేకపోతున్నారు. ఎలాగైనా ఆమ్ ఆద్మీని ఊదేద్దామని ఎంత ప్రయత్నం చేస్తున్నా అరవింద్ రాజకీయ వ్యూహాలు చిక్కడం లేదు. దొరకడం లేదు. బిజేపి పెద్దలకు అందడం లేదు. అరవింద్ కేజ్రివాల్ ను జైలు పాలు చేసి మానసిక స్థైర్యం దెబ్బ తీయాలని చూశారు. కానీ ఆయన మరింత బలడుతున్నారు. ఒకప్పుడు డిల్లీకే పరిమితమైన ఆమ్ ఆద్మీ విస్తరణకు తెలియకుండానే బిజేపి వాళ్లే మార్గం చూపిస్తున్నారు. అరవింద్ కేజ్రివాల్ జైలులో వున్నంత కాలం ఆయనకు పదవి పిచ్చి తప్ప ప్రజలకు సేవ చేయాలని లేదని బిజేపి విమర్శిస్తూవచ్చింది. ఎలాగైనా కేజ్రివాల్ తో రాజీనామా చేయించి రాజకీయంగా పతనం వైపు నెట్టాలని చూసింది. కానీ అక్కడ కూడా బిజేపి ఎత్తుగడ పారలేదు. కేజ్రివాల్ ఒక వేళ రాజీనామా చేసినా తన సతీమణిని సిఎం. చేస్తారని భావించింది. జైలు నుంచి విడుదలైన కేజ్రివాల్ రెండు రోజులకు తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. దాంతో బిజేపి తన ఆరోపణలకు పదునుపెట్టింది. మరో లాలూ, రబ్రీ అంటూ విమర్శలు గుప్పించించింది. డిల్లీలో బిహార్ తరహా లాలు రాజకీయాలంటూ ఎత్తిపోడుపులు మొదలుపెట్టింది. పనిలో పనిగా బిజేపి డిల్లీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేసింది. బిజేపి రాష్ట్రపతి ముర్ముకు వినతిపత్రం కూడా అందజేసింది. కానీ అనూహ్యంగా కేజ్రివాల్ డిల్లీ ముఖ్యమంత్రిగా అతిశీ పేరును ప్రకటించారు. బిజేపి కేంద్ర నాయకత్వం బిత్తరపోయేలా చేశారు. బిజేపికి పాలుపోని సంకట స్థితిలోకి కేజ్రివాల్ నెట్టేశాడు. ఒక రకంగా బిజేపికి దారులన్నీ మూసేశాడు. అసలు దారి దొరక్కుండా చేశారు. ఇప్పటికే కేజ్రివాల్ మూలంగా బిజేపికి రాజకీయంగా కోలుకోలేని దెబ్బలు పడుతూనే వున్నాయి. ఇప్పుడు బిజేపి ఊహకందని దెబ్బ కొట్టాడు. బిజేపికి ముందు నుయ్యి..వెనక గొయ్యి తెచ్చిపెట్టాడు. డిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్టు చేసిన సందర్భంలోనే కేజ్రివాల్ తనను బిజేపి అరెస్టు చేయిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని నిజం చేసి బిజేపి ఇరుకున పడింది. అది కేజ్రివాల్ జైలుకు వెళ్లిన తర్వాత బిజేపికి అర్థమైంది. అయినా బిజేపి ఏదో ఒక ఆశతో కేజ్రివాల్‌పై పైచేయి సాధిస్తామన్న నమ్మకంతో అడుగులు వేస్తూనే వుంది. కేజ్రివాల్ వాటిని బిజేపి తప్పటగులుగా తెల్చేస్తూనే వున్నారు. బిజేపి పరువు గంగలో కలిపేస్తూనే వున్నారు. ఇప్పుడు కేజ్రివాల్ ఇలాంటి దెబ్బ కొడతారని బిజేపి అధినాయకత్వం కలలో కూడా ఊహించలేదు. బిజేపి ఇంతగా చతికిలపడే పరిస్థితి వస్తుందని ఊహించలేదు. అనవసరంగా కేజ్రివాల్ ను కెలికి తప్పు చేశామా? అన్న భావన కొందరు బిజేపి పెద్దలు వెలుబుచ్చుతూనే వున్నారు. ఇదే అదునుగా బిజేపిని కేజ్రివాల్ దెబ్బ మీద కొడుతూనే వున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బిజేపికి గడ్డుకాలం తెచ్చేందుకు కేజ్రివాల్ సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. నిజానికి డిల్లీలో రాష్ట్రపతి పాలన తేవాలని బిజేపి కేంద్ర నాయకత్వం తహతహలాడుతోంది. కేజ్రివాల్ సరికొత్త ఎత్తుగడతో బిజేపి చతికిలపడిపోయింది. అంతే కాకుండా ఆమ్ ఆద్మీ నాయకురాలు అతీశీ మీద ఎలాంటి ఆరోపణలు లేవు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక బిజేపి ఆగమాగమౌతోంది. ముందుకు వెళ్లలేక, వెనక్కి తగ్గలేక కొత్త ఎత్తులు ఎలా వేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఎలాగైనా డిల్లీని సొంతం చేసుకోవాలని పదేళ్ల నుంచి ఆరాటపడుతోంది. ఇప్పటికైనా ఆ అవకాశం దక్కుతుందనుకున్న ఆశలు ఆవిరి కావడంతో దిక్కులు చూస్తోంది.