ప్లాస్టిక్ పేపర్ ప్లేట్ల వాడకంపై అప్రమత్తంగా ఉండాలి
– జి. ఎం. పి. ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నల్లబెట్ట చిన్న రాజు యాదవ్
నేటి ధాత్రి అయినవోలు :-
హనుమకొండ జిల్లా అయినవోలు మండల కేంద్రంలో ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ గొర్రెలు, మేకల పెంపకదారుల సంఘం జి. ఎం. పి. ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నల్లబెట్ట చిన్న రాజు యాదవ్ అన్నారు.. ఈ రోజుల్లో ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ పేపర్ ప్లేట్లలో వేడి ఆహారం వడ్డించడం వల్ల ప్రమాదకరమైన విషపదార్థాలు విడుదలై, మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆయన హెచ్చరించారు. దీని వల్ల తెలియకుండానే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. అంతేకాకుండా, వాడిన ప్లాస్టిక్ ప్లేట్లు బయట పారేయడం వల్ల వాటిని గొర్రెలు, మేకలు తిని జీర్ణం చేసుకోలేక మరణిస్తున్నాయని తెలిపారు. ఇటీవల నక్కకట్టయ్య, ముడికా బాలకొమురయ్య, నల్లబెట్ట కొమురయ్యలకు చెందిన గొర్రెలు పెద్ద సంఖ్యలో చనిపోయిన ఘటనలను ఆయన ప్రస్తావించారు.ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, స్టీల్ ప్లేట్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ప్రతి ఫంక్షన్‌లో స్టీల్ ప్లేట్లు అందుబాటులో ఉండేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ వల్ల పశువులకు మాత్రమే కాకుండా భూమి సారానికి కూడా నష్టం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టకపోతే రాబోయే తరాలకు ప్రమాదం తప్పదని హెచ్చరిస్తూ, ప్రభుత్వాలు మరియు స్వచ్ఛంద సంస్థలు కలిసి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
