వేతనాల పెంపుకై మార్చి 10న అంగన్వాడీల ఛలో విజయవాడ..
తిరుపతి నేటిధాత్రి :
అంగన్ వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారం, వేతనాల పెంపుకై మార్చి 10వ తేదీన ఛలో విజయవాడ, మహాధర్నా కార్యక్రమాలను చేపట్టనున్నట్టు, కార్యక్రమ జయప్రదానికై సిఐటియు తరపున సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తున్నట్టు కందారపు మురళి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో 42 రోజులపాటు అంగన్ వాడీ సిబ్బంది ఆంధ్ర రాష్ట్రంలోని యావత్తు స్కూళ్ళను మూసివేసి ఆందోళనా కార్యక్రమంలో పాల్గొన్నారని కందారపు మురళి గుర్తు చేశారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన చర్చల సందర్భంగా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు చేసిందని వాటిని జీఓలుగా నేటికీ విడుదల చేయకపోవడం సమంజసం కాదని కందారపు మురళి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అంగన్ వాడీలకు వైసీపీ ప్రభుత్వం కంటే గొప్ప నిర్ణయాలు చేసి సహకరిస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు సమ్మె సందర్భంలో పలుమార్లు చెప్పారని అధికారంలోకి వచ్చాక ఏమాత్రం పట్టించుకోవటం లేదని,గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలను సైతం అమలు చేయడం లేదని ఆరోపించారు.
చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఒక రకంగా ఎన్నికల తర్వాత మరో రకంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఏడాది కాలం గడుస్తున్నా కనీసం అంగన్వాడీలను పిలిపించి మాట్లాడాలన్నా కనీసమైన నైతికతను ప్రభుత్వం ప్రదర్శించకపోవడం వారి చిత్తశుద్ధిపట్ల అనుమానానికి ఆస్కారం ఏర్పడిందని అన్నారు.
ప్రభుత్వ వైఖరి కారణంగానే రాష్ట్రంలో సిఐటియు, ఎఐటియుసి ఐఎఫ్ టియు అనుబంధ అంగన్వాడీ యూనియన్ల ఆధ్వర్యంలో పదవ తేదీన మహాధర్నా కార్యక్రమం చేపట్టనున్నట్టు ఆయన ఆ ప్రకటనలో వెల్లడించారు.
తిరుపతి జిల్లాలోని అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములై ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు..