స్మార్ట్ సిటీలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి
అవినీతికి కారణమైన మాజీ మేయర్ సునీల్ రావు ఆస్తులపై ఏసీబీ దాడులు చేయాల -సిపిఐ
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ నగరంలో స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి జరిగిందని దీనిపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని, మాజీ మేయర్ సునీల్ రావు అక్రమ ఆస్తులపై ఏసీబీ అధికారులు విచారణచేయాలని కోరుతూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ నగరంలో కోట్ల రూపాయల నిధులతో జరిగిన స్మార్ట్ సిటీ పనుల్లో పూర్తిగా అవినీతి అక్రమాలు రాజ్యమేలాయని దీనిని పట్టించుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మేయర్ సునీల్ రావు కొందరు బినామీ కాంట్రాక్టర్లను ఏర్పరచుకొని ఇష్టం వచ్చిన రీతిలో స్మార్ట్ సిటీ పనులలో అవినీతి అక్రమాలు ప్రోత్సహించాడని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దిగమింగాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుట్ పాతుల నిర్మాణం, జంక్షన్ల సుందరీకరణ, పార్కుల నిర్మాణం, రోడ్లు, మురుగు కాలువల నిర్మాణాలలో పూర్తిగా అవినీతి అక్రమాలు జరగాయని అధికారులు రాజకీయ నాయకులు ఒక్కటై కరీంనగర్ నగరాన్ని దోచుకున్నారని విమర్శించారు.
సంవత్సరం కాకముందే ఫుట్ పాతుల టైల్స్ దెబ్బతిన్నాయని, రోడ్లు పగళ్ళు వచ్చాయని కాంట్రాక్టర్ పూర్తిగా నాణ్యత పాటించకపోవడం కాంట్రాక్టర్ కి వత్తాసు పలకడం వల్ల అవినీతి రాజ్యమేలిందని వెంటనే స్మార్ట్ సిటీ పనుల్లో జరిగిన అవినీతి పై విచారణ జరిపి కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మొన్నటి వరకు మేయర్ గా కొనసాగిన సునీల్ రావు స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి జరిగిందని మేయర్ పదవి పోయిన తర్వాత గుర్తుకు రావడం సిగ్గుచేటని సునీల్ రావు మాటలు వింటుంటే దొంగే దొంగ అన్నట్లుగా వ్యవహరించడం సరైంది కాదనిఆరోపించారు. సునీల్ రావుకు కరీంనగర్ నగరంలో బహుళ అంతస్తుల భవనం, విదేశాల్లో భవంతులు ఏవిధంగా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. సునీల్ రావుకు చిత్తశుద్ధి ఉంటే తను కౌన్సిలర్ గా పోటీ చేసిన సమయంలో ఎన్నికల అపిడవిట్లో పెట్టిన ఆస్తుల వివరాలు ఇప్పుడు తన ఆస్తుల వివరాలు ప్రజలకు వివరించి తన చిత్త శుద్ధి నిరూపించుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్మార్ట్ సిటీలో జరిగిన అవినీతి, సునీల్ రావు అక్రమాలపై విచారణ చేపట్టాలని లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని సురేందర్ రెడ్డి హెచ్చరించారు. ఈధర్నాలొ సిపిఐ నగర సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు జిల్లా కౌన్సిల్ సభ్యులు కటికిరెడ్డి బుచ్చన్న యాదవ్,బీర్ల పద్మ, కొట్టి అంజలి, మచ్చ రమేష్, ఆర్ వెంకటేష్ నగర కార్యవర్గ సభ్యులు గామినేని సత్యం, కె.సంతోష్ చారి, చంచల మురళి, నగునూరి రమేష్, ఎలిశెట్టి భారతి, చారి, రాము, సాంబరాజు, బెక్కంటి రమేష్, లక్ష్మీ,రజిత, సుజాత, రమ, సందీప్ రెడ్డి, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.