నర్సంపేట డిగ్రీ కళాశాలలో ఏఐపట్ల అవగాహన సదస్సు
విద్యా రంగంలో కృత్రిమ మేధస్సు- వినియోగంపై విద్యార్థులకు దిశానిర్దేశం.
నర్సంపేట, నేటిధాత్రి:
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా విద్యా వారోత్సవాల ఆరో రోజు కృత్రిమ మేధస్సు అవగాహన, ఆవిష్కరణ కార్యక్రమాన్ని నర్సంపేటలో
ప్రభుత్వ డిగ్రీ కళాశాల శుక్రవారం నిర్వహించారు.కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పింగళి ప్రభుత్వ మహిళా కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ డి. సురేష్ బాబు ముఖ్య వక్తగా హాజరై విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించారు.మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ వంటి అంశాలపై యువత అవగాహన పెంచుకోవాలని ప్రిన్సిపాల్ నవీన్ సూచించారు. ఏఐ భవిష్యత్ ఉద్యోగ అవకాశాలకు మార్గదర్శకమని అన్నారు. విద్యా వ్యవస్థలో ఏఐ ప్రాధాన్యత, బోధన-అభ్యాస ప్రక్రియలో సాంకేతిక వినియోగం, డేటా భద్రత, మానవ విలువల పరిరక్షణపై డాక్టర్ సురేష్ బాబు వివరించారు.విద్యార్థులు ఏఐని వినోదానికి మాత్రమే కాకుండా విద్య, పరిశోధన, ఉపాధి అభివృద్ధికి ఉపయోగించుకోవాలని వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి సత్యనారాయణ అన్నారు.ఈకార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ కందల సత్యనారాయణ, ప్రజాపాలన సమన్వయకర్త ఎస్. కమలాకర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
