ఆసియా ఖండంలోనే అరుదైన రోడ్డుకు….!
ఇదేమి దుస్థితి!
◆:- అత్యంత పెను ప్రమాదకరంగా గంగ్వార్ ప్రధాన కూడలి
◆:- తరచూ ప్రమాదాల బారిన ప్రయాణికులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్,స్వాతంత్రానికి ముందు, నిజాం నవాబుల పాలనలో నిర్మించిన రోడ్డది. ఎలాంటి ప్రమాదకర మూల మలుపులు లేకుండా ఏకంగా దాదాపు 39 కిలో మీటర్ల మేర రోడ్డును నిర్మించారు. అది ఆసియా ఖండంలోనే అరుదైన రోడ్డుగా నేటికీ గుర్తింపున్న రోడ్డది.
ఆర్అండ్జి విశ్రాంతి భవనం, అల్లాదుర్గం ప్రధాన కూడలి నుండి న్యాల్ కల్ మండలం, గంగువార్ ప్రధాన కూడలి మార్గం ద్వారా మెటల్ కుంట రైల్వే స్టేషన్ వరకు రోడ్డును నిర్మించారు. రోడ్డు మధ్య నుండి కుడి, ఎడమ 75 అడుగుల మేరకు రోడ్డును నిర్మించారు. ఐతే ఎంతో చారిత్రక నేపథ్యం గల రోడ్డు ప్రస్తుతం ప్రయాణికులు, వాహన చోదకులకు అత్యంత పెను ప్రమాదకరంగా మారింది. మోస్తారు వర్షం కురిసిందంటే చాలు జహీరాబాద్ బీదర్ రోడ్డు, గంగువార్ ప్రధాన కూడలి వద్ద అధిక మొత్తంలో వరద నీరు చేరి చిన్నపాటి చెరువును తలపిస్తోంది.
ఆ రోడ్డు మార్గాన అనునిత్యం వందల సంఖ్యలో ప్రయాణికులు, వాహన చోదకులు జహీరాబాద్, న్యాల్ కల్, నారాయణఖేడ్, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గంగువార్ ప్రధాని కూడలి వద్ద భారీగా వరద నీరు చేరడంతో పెను ప్రమాదకరంగా మారింది.
ముఖ్యంగా ద్విచక్ర ఆటో వాహన చోదకులు తరచుగా ప్రమాదాల బారిన పడాల్సిన పరిస్థితి నెలకొంది. పాలకులు, జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి వరద నీటిని తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, వాహన చోదకులు, చిరు వ్యాపారులు కోరుతున్నారు.