మా కుటుంబానికి సన్నిహితుడు
ఇటీవల కన్నుమూసిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను డాక్టర్ మోహన్‌బాబు పరామర్శించారు. ఆయనతో తనకున్న…
ఇటీవల కన్నుమూసిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను డాక్టర్ మోహన్‌బాబు పరామర్శించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని, నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. కోట శ్రీనివాసరావు మరణించిన రోజున తాను హైదరాబాద్‌లో లేనని, అందుకే ఈ రోజు ఇలా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చాననీ మోహన్‌బాబు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘కోట శ్రీనివాసరావు నాకు అత్యంత ఆప్తుడు. ఆయన మరణం తీవ్ర దిగ్ర్భాంతి కలిగించింది. ‘కన్నప్ప’ సినిమా విడుదలైన రోజున నాకు ఫోన్ చేసిన ‘సినిమా చాలా బాగుంది. విష్ణుకు మంచి పేరు వచ్చింది’ అని చెప్పారు. 1987లో ‘వీరప్రతాప్’ సినిమాలో మాంత్రికుడిగా ఆయనకు మెయిన్ విలన్‌గా అవకాశం ఇచ్చాను. ఆ తర్వాత మా బేనరులోనే కాకుండా బయటి చిత్రాల్లో కూడా ఇద్దరం కలసి నటించాం. ఏ పాత్ర అయినా అవలీలగా పోషించగల గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు. అలాగే రకరకాల మాడ్యులేషన్స్‌లో డైలాగులు చెప్పగలిగిన నటుడు. మా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు’ అన్నారు.