సిపిఎం పార్టీ నుంచి10 కుటుంబాలు లిబరేషన్ పార్టీ లో చేరిక
పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా
భూపాలపల్లి నేటిధాత్రి
సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ ను బలోపేతం చేయాలని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఎం నుంచి సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ లో 10 కుటుంబాలు శ్రీకాంత్, బంధు క్రాంతి, బుర్ర స్వాతి, బంధు సుజాత, కిష్టయ్య, వెంకటేష్, కుమార్ తదితరులు చేరారు. వారికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రమేష్ రాజా ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. చారిత్రక నేపథ్యం ఉన్న భూపాలపల్లి గడ్డపై సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ విస్తరింపజేయాలని, విప్లవోద్యమ వారసత్వాన్ని నిలబెట్టాలని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా లిబరేషన్ విస్తరిస్తుందని పార్లమెంట్ లోను ప్రజాక్షేత్రంలోనూ ప్రజా సమస్యలపై అనేక పోరాటాలను నిర్వహిస్తుందని అన్నారు. దేశంలో ఫాసిస్టు శక్తుల ప్రమాదం పెరిగిపోయిందని, ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. బిజెపి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుందని, రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఎస్ ఐ ఆర్ పేరుతో ప్రజల ఓటు హక్కును హరిస్తుందని, ప్రజలపై తీవ్రమైన దాడిని కొనసాగిస్తుందని తెలిపారు. ప్రస్తుతం జరగనున్న కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పోటీ చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ప్రజా వ్యతిరేక బడ్జెట్ గా ఉందని రేవంత్ రెడ్డి సర్కార్ అంకెల గారడీ చేసిందని విమర్శించారు.
