ఏ సమాజోద్దరణ కోసం తీశారు!
`ఏ లక్ష్యం వైపు సినీ అడుగులేశారు.
`లక్షలు పెట్టి సినిమా తీసి కోట్లు సంపాదించుకున్నారు.
`ప్రజల బలహీనత సొమ్ము చేసుకున్నారు.
`విద్యార్థులను రెచ్చగొట్టారు.
`ఆవేశపరులను చేసి వారి జీవితాలు ఆగం చేశారు
`ఓ తరం యువత జీవితాలలో నిప్పులు పోశారు.
`యువతను అడవుల పాలు చేశారు.
`విప్లవాల పేరు రెచ్చగొట్టి ఎర్ర సినిమాలు తీశారు.
`ఎర్ర సినిమాలతో యువతకు ఒరిగిందేమీ లేదు.
`ఆ కుటుంబాలలో కడుపు కోతలు మిగిల్చారు.
`తల్లిదండ్రులకు సేవ చేయాల్సిన పిల్లలు అడవుల బాట పట్టారు.
`ఆకలి, నిద్రలతో పాటు జీవితాలు కోల్పోయారు.
`తల్లిదండ్రులకు పుత్రశోకాలు మిగిల్చారు.
`అలా సినిమాలు తీసిన వాళ్ల పిల్లలు ఏ ఒక్కడూ అడవి బాట పట్టలేదు.
`జూబ్లీ హిల్స్ , బంజారా హిల్స్, ఫీలింనగర్ , కొకపేట లో బంగళాలు కట్టుకున్నారు.
`వారి పిల్లలు విదేశాలలో చదువుకున్నారు.
`తరతరాలు తిన్న తరగని ఆస్థులు సంపాదించుకున్నారు.
`ఎర్ర సినిమాలలో పని చేసిన కార్మికుల చేత కూడా వెట్టి చాకిరి చేయించుకున్నారు.
`ఎర్ర సినిమాలు తీసి సమాజంలో గొప్ప వాళ్లుగా చెలామణీ అయ్యారు.
`పల్లె ప్రజల జీవితాలలో నిప్పులు పోశారు.
`సమాజంలో బతకాల్సిన యువతను అడవి జీవితాలకు అంకితం చేశారు.
`జీవితాలు నరక ప్రాయం చేశారు…సినిమాలు తీసిన వారు సమాజంలో ఊరేగుతున్నారు.
హైదరాబాద్,నేటిధాత్రి: ఎర్ర జెండా పట్టుకున్న వారిలో ఎంత మంది బాగుపడ్డారో గాని, ఎర్ర సినిమాలు తీసిన వాళ్లు మాత్రం బాగు పడ్డారు. కోట్లు సంపాదించుకున్నారు. సినిమా మీది సినిమాలు తీసి కోటీశ్వరులయ్యారు. సమాజంలో గుర్తింపు పొందిన వ్యక్తులుగా చెలామణి అయ్యారు. 70`80వ దశకం నుంచి మొదలు, తెలంగాణ ఉద్యమం ఊపందుకునే దాకా ఎర్ర జెండాలు ఎగిరాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కసారిగా కనుమరుగయ్యాయి. అంటే రంగు లజెండాలున్నా, ఎజెండాలు లేకుండా సాగే ఏ ఉద్యమైనా ఎంతో కాలం నిలవదని చరిత్ర తేల్చిచెప్పినట్లైంది. అయితే ఇక్కడే అసలు తిరకాసు దాగి వుంది. సమాజంలో ఎగిరిన ఎర్ర జెండాలు వేరు. సినిమాల్లో ఎగురవేసిన ఎర్ర జెండాలువేరు. ఎర్ర జెండాల ముసుగులో సినిమాలు తీసి తెలంగాణ యువతను తప్పు దారి పట్టించిన సినిమాలెన్నో వున్నాయి. తెలంగాణ యువతను తప్పుడు మార్గం పట్టించి, వారి జీవితాలను నాశనం చేశాయి. ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే ఏపిలోవున్న ఏ యూనివర్సిటీలలో ఎర్ర జెండాల ఎగురవేత కనిపించేది కాదు. కాని తెలంగాణలో యూనివర్సిటీలలో మాత్రమే ఎర్రజెండాలు ఎగురవేసేవారు. తెలంగాణ విద్యార్ధుల జీవితాలను పక్కదారి పట్టించారు. తెలంగాణ యూనివర్సిటీలలో ఎర్రజెండాలు ఎగురవేసి, యువతను తప్పుదారి పట్టించిన విద్యార్ది నాయకులు ఏపికి చెందిన వాళ్లే వుండడం గమనార్హం. ఇప్పటికీ ఎర్ర జెండాలతో వున్న ఏ పార్టీలో కూడా సామాజిక న్యాయం జరగలేదు. చట్టసభలకు ఎన్నికైన వారిలో బడుగులు పెద్దగా లేరు. ఒక్కరో ఇద్దరో వుంటే వారి పెత్తనం నడవనీయలేదు. ఇప్పుడు కూడా ఓ ఎర్ర జెండా పార్టీ నుంచి ఎమ్మెల్యే అయింది కూడా అగ్రకులానికి చెందిన నాయకుడే. ఇదీ ఎర్ర పార్టీల చరిత్ర. ఆ పార్టీలకు చెందిన అగ్ర నాయకులు కూడా అగ్ర కులాలకు చెందిన వాళ్లే. ఆ ఎర్ర ఎజెండాతో పత్రికలు నడిపిన వారు, ఆ ముసుగులో ఇంకా వున్న వాళ్లు కూడా అగ్ర కులాలకు చెందిన వాళ్లే. ఆ ఎర్ర రంగును చూపించి, సినిమాలు తీశారు. అందులోనూ అందరూ అగ్ర వర్ణాలకు చెందిన వాళ్లే వున్నారు. ఎందుకంటే ఉద్యమం వేరు. పోరాటం వేరు. కాని విప్లవం అనేది ఒక రుగ్మత. దాన్ని అంటించేవాళ్లు బాగానే వుంటారు. ఆ మంటల్లో తగలబడి పోయే వాళ్లు అణగారిన వర్గాలే వుంటారు. ప్రపంచంలో ఏ విప్లవం చూసినా రాజ్యాధికార ప్రయోజనం తప్ప, ప్రజా ప్రయోజనం ఎక్కడా కనిపించదు. కాని మసిబూసి మారేడు కాయ చేస్తారు. సామాన్యుల జీవితాలను సమిథలు చేస్తారు. నేనే సైతం అంటూ పాటలు రాస్తారు. వాళ్లు మాత్రం విలాసాలలో మునిగి తేలుతారు. అలా ఎర్ర రంగు పులిమి తీసిని సిమామాలు, వారి గురించి చెప్పుకుంటే చరిత్ర కూడా క్షమించదు. ఒకప్పుడు మాదాల రంగారావు అనే హీరో అనేక ఎర్ర సినిమాలు తీశారు. వీళ్లంతా ఎర్ర పార్టీల మీద వున్న ప్రేమతో సినిమాలు తీసిన వారు కాదు. సినిమా హీరోలు కావాలన్న లక్ష్యంతో ఇండస్ట్రీకి వెళ్లిన వాళ్లు. సినిమా ప్రపంచాన్ని ఏలాలన్న లక్ష్యంతో వెళ్లారు. కోట్లు సంపాదించాలన్న లక్ష్యంతోనే సినిమాలను తీశారు. అలా తీసిని సినిమాలన్నీ హిట్ల మీద హిట్లయ్యాయి. సమాజంలో ఏదో జరిగిపోతున్నట్లు, అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నట్లు రక్తి కట్టించే సన్నివేశాలు రాసి, తీశారు. యువతలో విషం నింపారు. విద్యార్థులు కాలేజీకి వెళ్లేదెందుకు? బాగా చదువుకొని ఉన్నత విద్యావంతులై, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి, దేశ ఆర్దిక ప్రగతికి, పురోగతికి తోడ్పడాలి. రేపటి తరాన్ని నిర్మించి, ఉజ్వలమైన భవిష్యత్తు కళ్లారా చూడాలి. కాని కాలేజీ కుర్రవాడ, కులాసాగ తిరిగెటోడ..విలాసాల మాట మరవరో..విప్లవాల బాట పట్టారో అని రెచ్చగొట్టారు. సమాజంలో అంతరాలు నిర్మించారు. కొంత మంది స్వార్ధ పరుల కోసం యువతరాన్ని మొత్తం నాశనం చేశారు. అలాంటి వారికి పాలకులు కూడా సహకరించిన సందర్బాలున్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలు కూడా తమ స్వార్ధం కోసం ఎర్ర జెండాలను నెత్తికెత్తుకున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశంపార్టీ పెట్టినప్పుడు నక్సలైట్లు దేశ భక్తులన్నారు. కాని అదే ఎన్టీఆర్ అదికారంలోకి వచ్చిన తర్వాత నక్సలైట్లపై నిషేదం విధించారు. సమాజంలో సారా నిషేదించాలని నక్సలైట్లు కోరితే, వారుణీ వాహినీ అని పోలీస్ స్టేషన్లలో అమ్మించారు. అదే తెలుగుదేశం పార్టీ మళ్లీ 1994లో అదికారంలోకి రావడానికి మద్య నిషేద ఉద్యమం తెచ్చారు. అదికారంలోకి వచ్చారు. ఇలాంటి సమయంలో సుందులో సడేమియాలగా సిమాలు నిర్మాణం చేశారు. ఓ వైపు తన పత్రికలో నక్సలైట్లపై నిషేదం విధించాలని వార్తలు రాసిన రామోజీ రావు, పీపుల్స్ ఎన్‌కౌంటర్ అంటూ సినిమా తీశాడు. కోట్లు గడిరచారు. ఆ సినిమా చూడడానికి వెళ్లిన వారిని పోలీసులు పట్టుకొని నక్సలైట్ల ముద్ర వేసి, వారిని అరెస్టులు చేశారు. ఇక మరో నటుడు నారాయణ మూర్తి తీసిన ఎర్రసినిమాల మూలంగా అభం శుభం తెలియని ఎంతో మంది యువతీ,యువకులు కూడా నక్సలైట్లలో చేరారు. జీవితాలను ఆగం చేసుకున్నారు. ఎర్ర సినిమాలు తీసి కోట్లు గడిరచారు. దాసరి నారాయణ రావులాంటి దర్శకులు కూడా సంపాదన కోసం ఎర్ర సినిమాలు తీశారు. కోట్లు గడిరచారు. ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీలో వున్నారు. కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యుడయారు. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. కాని దాసరి నాలుగైదు ఎర్ర సినిమాలు తీశారు. ఎర్ర జెండాలో అంత పవర్ వుంటే ఆయన ఎందుకు నక్సలైట్లలో చేరలేదు? మోహన్ బాబు లాంటి నటుడు కూడా అడవిలో అన్న అంటూ సినిమా తీశారు. కోట్లు సంపాదించుకున్నారు. అలా తీసిన సినిమాలతో వచ్చిన లాభాలతో ఆస్దులు కూడ బెట్టుకున్నారు. తన పిల్లల్ని మంచిగా చదివించుకున్నారు. వారిని సినిమా హీరోలను చేశాడు. అలా సంపాదించిన సినిమాలతో వచ్చిన డబ్బుతో ప్రైవేటు విద్యా సంస్ధలు నడుపుతున్నాడు. విద్యా వ్యాపారిగా మారాడు. అడవిలో అన్న సినిమా చూసి, ఆవేశంతో అడవుల్లోకి వెళ్లిన వాళ్లలో ఎంతో మంది విగతజీవులయ్యారు. తిరిగిరానిలోకాలకు వెళ్లిన వాళ్లున్నారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరుకాదు సిని పెద్దలెంతో మంది ఎర్ర సినిమాలు తీశారు. ఆఖరుకు సూపర్ స్టార్ కృష్ణ కూడా ఎన్ కౌంటర్ అని సినిమా తీసి హిట్ కొట్టారు. కోట్లు సంపాదించారు. వీళ్లలో ఎర్ర జెండాలెన్ని రకాలో కూడా ఎవరికీ తెలియదు. ఆ ఎర్రజెండాల్లో నక్సలైట్లు వేరు అని తెలిసినా సినిమాలు చేశారు. తెలంగాణ యువతలో కల్లోలం నింపారు. ఎర్ర సినిమాలు తీసి సమాజోద్దరణ అన్నారు. ఎక్కడ చేశారు? ఏం చేశారు? సమాజాన్ని ఏ లక్ష్యం వైపు నడిపించారు. అమితాబచ్చన్ సినిమా చూసి ఒకరు దొంగగా మారారన్న వార్తను తాటికాయలంత అక్షరాలతో వార్తలు రాశారు. కాని ఎర్ర జెండాలు చూపించి, ఎంతో మంది యువత జీవితాలను ఆగం చేసిన ఆ సినిమా గురించి ఎవరూ ఎందుకు రాయలేదు? లక్షలు పెట్టి కోట్లు సంపాదించుకున్నారన్న వార్తలుఎందుకు రాయలేదు. ప్రజల బలహీనతలను కూడా ఇలా సొమ్ము చేసుకున్నారని ఏ మీడియా ఎందుకు ప్రశ్నించలేదు. ఎంతో మంది విద్యార్దులను సినిమాల ద్వారా రెచ్చగొట్టి వారి జీవితాలను ఆగం చేశారు. కొన్ని వేల మంది యువతను అడవుల పాలు చేశారు. విప్లవాల పేరుతో ఎర్ర సినిమాలు తీశారు. వాటికి ఎర్ర మట్టి అని పేరు పెట్టారు. ఆఖరుకు ఎర్రసైన్యం అంటూ కూడా పేర్లు పెట్టేశారు. అంటే దేశాన్ని కాపాడుతున్న సైనికులతో పోల్చారు. అదేంటోగాని అప్పటి పాలకులు కూడా ఆ సినిమాలు ధియేటర్‌కు వెళ్లి చూసిన వారిని అరెస్టులు చేశారు. కాని అలాంటి సినిమాలు తీసిన నిర్మాతలు,దర్శకులు, హీరోలకు అవార్డులిచ్చారు. వారిని గొప్ప వ్యక్తులుగా చిత్రీకరించారు. వారిని గౌరవించారు. ఎర్ర సినిమాలు చూసిన వారినే నిర్భందించిన కాలంలో ఎర్ర సినిమాలు తీసిన వారినికూడా అరెస్టులు చేస్తే ఆ దరిద్రం పాకకుండా పోయేది. విద్యా వంతమైన సమాజ నిర్మాణం జరగాలంటే అడవుల బాట కాదు పట్టాల్సింది. విద్యాలయాల బాట పట్టాలని చెప్పలేదు. ఎర్ర సినిమాలతో ఆనాడైనా,ఈనాడైనా యువతకు ఒరిగిందేమీ లేదు. కొన్ని లక్షల కుటుంబాలలో కడుపుకోతలు మిగిల్చారు. తల్లిదండ్రులకు పుత్రశోకాలు మిగిల్చారు. సమాజంలో సామాజిక సృహ పేరుతో సినిమాలు తీసిన వాళ్ల సినిమాలకు పనిచేసిన వారిని కూడా వెట్టి చాకిరీ చేయించుకున్నారు. వారికి సినిమాల్లో అవకాశమివ్వడమే గొప్ప అన్నట్లు వారి కష్టం దోచుకున్నారు. ప్రజల జీవితాల్లో సినిమాల పేరుతో నిప్పులు పోశారు.