రైల్వే బడ్జెట్‌లో కొత్తగా తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు లేవు
కొన్నేళ్లుగా సాగుతున్న ప్రాజెక్టులకే కేటాయింపులు
నూటికి నూరుశాతం విద్యుద్దీకరణ సాధించిన ద.మ.రైల్వే
హైదరాబాద్ మెట్రోరైల్ విస్తరణకు మొండి చేయి
అవసరాలకు అనుగుణంగా లేని కేటాయింపులు
హైదరాబాద్,నేటిధాత్రి:
ఈసారి రైల్వే బడ్జెట్‌లో దక్షిణమధ్య రైల్వేకి (రెండు తెలుగు రాష్ట్రాలు) రూ.14,754కోట్లు కేటా యింపులు జరిగాయి. వీటిలో రూ.9417కోట్లు ఆంధ్రకు, రూ.5337కోట్లు తెలంగాణకు కేటా యించారు. రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టులకు పెట్టుబడులు రూ.84,559కోట్లకు చేరుకోగా అదే తెలంగాణలో రూ.41677 కోట్లతో రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని తెలపడం గమనార్హం. దక్షిణమధ్య రైల్వే పరిధి ఆంధ్ర, తె లంగాణ రాష్ట్రాల్లో విస్తరించింది. ఇప్పటివరకు నూటికి నూరుశాతం విద్యుద్దీకరణ పూర్తికావడమే కాదు, కవచ్ అమలు చేయడంలో దేశంలోనే మిగిలిన రైల్వేలతో పోలిస్తే లీడర్‌గా కొనసాగు తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఐదు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి. ఇవి ఏడు జిల్లా లను అనుసంధానిస్తూ 9 స్టాపేజ్‌లు కలిగివున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులు
ఈసారి రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఏకంగా రూ.9417కోట్లు కేటాయించినట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ విలేకర్లకు చెప్పడం ఒకింత ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఇందులో అంకెల గారడీ తప్ప కొత్తగా రాష్ట్రానికి ఇచ్చిన ప్రాజెక్టులు లేదా రైల్వే లైన్లు లేవని, గతంలో కొనసాగుతున్న వాటి ఖర్చును కలిపి ఇంతమొత్తం కేటాయించామని చెప్పినట్టు బాగా పరిశీలిస్తే అర్థమవుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న నంబూరు`ఎర్రుపా లెం రైల్వేలైన్ నిర్మాణానికి రూ.2245కోట్ల ఖర్చుతో కేంద్రం ఆమోదం తెలిపిందని ఎంతగానో ప్రచారం చేసుకున్న సంగతి తెలిసిందే. విచిత్రంగా ఈ బడ్జెట్‌లో దీనికి కేటాయింపుల ఊసే లేదు. అంటే కేంద్రం ఈ రైల్వేలైన్ పట్ల సానుకూలంగా లేదన్న సత్యం అవగతమవుతుంది. వచ్చే నాలుగేళ్ల కాలంలో ఈప్రాజెక్టు పూర్తవుతుందని ఏపీలోని కూటమి ప్రభుత్వం ఊదరకొడుతోంది.మరి కేటాయింపుల దగ్గరికి వచ్చేసరికి ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కేదీ స్పష్టం కావడంలేదు. నిజం చెప్పాలంటే దీర్ఘకాలంగా పెండిరగ్‌లో ఉన్న ప్రాజెక్టులకే నిధులు కేటాయించలేదు..ఇక కొత్త ప్రాజెక్టులకు దిక్కెక్కడ అనేది స్పష్టమవుతోంది.
విజయవాడాఖరగ్‌పూర్, విజయవాడానాగ్‌పూర్ ఫ్రైట్ డెడికేటెడ్ కారిడార్లు, తిరుపతి కేంద్రంగాబాలాజీ డివిజన్ ఏర్పాటు, విజయవాడాగూడూరు నాలుగోలైన్, కడపాబెంగళూరు రైల్వేలైన్ అలైన్‌మెంట్ల గతేంటో ఎవరికీ అర్థం కాని పరిస్థితి! ఇక విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి రైల్వేస్టేషన్లను రూ.1132.43కోట్లతో ఆధునికీకరిస్తున్నట్టు చెప్పారు. నిజమే ఇవి నేటి బడ్జె ట్‌కు సంబంధించినవి కావు. రెండేళ్ల క్రింతం నుంచే వీటి ఆధునికీకరణ పనులు కొనసాగుతు న్నాయన్న సత్యం గుర్తించాలి. రాష్ట్రంలో 1700 కిలోమీటర్ల పరిధిలో కవచ్ ప్రాజెక్టులు చేపడతామని, ఇప్పటికే 130 కిలోమీటర్ల పరిధిలో కవచ్ పూర్తిచేసినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు కూడా గతకాలం నుంచి అమలు చేస్తున్నదే. ప్రస్తుతం రూ.85వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను కొనసాగిస్తున్నందువల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఇక కొత్త ప్రాజెక్టులేవీ ఇవ్వడంలేదన్న సత్యాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయించిన రూ.9417కోట్లు 2024ా25 రైల్వే బడ్జెట్‌లో కేటాయించిన రూ.9138 కోట్లతో పోలిస్తే కేవలం రూ.279 కోట్లు అదనం అంతే! నిజానికి ఈ మొత్తం ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులను ఈ ఏడాది కొనసాగించేందుకు సరిపోతాయి అంతే!
కాకినాడాపిఠాపురం, మాచర్లానల్గండ, కంభరాప్రొద్దుటూరు, గూడూరుాదుగ్గరాజపట్నం, కొండపల్లిాకొత్తగూడెం, భద్రాచలరాకొవ్వూరు, జగ్గయ్యపేటామేళ్లచెర్వు లైన్లకు కేటాయింపులు ఎక్కడ? కడపాబెంగళూరు (255కి.మి.) రైల్వేలైన్ విషయంలో కూడా కేంద్రం ముఖం చాటేసింది. కోటిపల్లిానర్సాపురం, నడికుడిాశ్రీకాళహస్తి, డోన్‌ాఅంకోలా రైల్వేలైన్ల ఊసేలేదు. ఇక రైల్వే మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 73 రైల్వే స్టేషన్లను అమృత్‌భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నా మని చెప్పారు. నిజమే కాని ఇవి కూడా గత రెండేళ్లుగా కొనసాగుతున్నవే. ఏతావాతా చెప్పాలం టే ఈఏడాది రైల్వేబడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మొండిచెయ్యి చూపిందనే చెప్పాలి.
తెలంగాణ పరిస్థితి అంతే…
గత ఏడాది రైల్వే బడ్జెట్‌తో పోలిస్తే తెలంగాణకు కేవలం ఒక్క కోటి రూపాయలు అదనంగా కే టాయింపు జరిగింది. అంటే గత ఏడాది రూ.5336 కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.5337కోట్లు కేటయించి చేతులు దులుపుకుంది. ఆంధ్రప్రదేశ్‌కే గుడ్డిలో మెల్ల అన్నట్లు గత ఏడాదితో పోలిస్తే రూ.279కోట్లు అదనంగా కేటాయిస్తే, తెలంగాణకు ఘోరంగా రూ.కోటి మాత్రమే అదనంగా కేటాయించింది. రాష్ట్రంలో నూటికి నూరుశాతం విద్యుదీకరణ పూర్తయిందని చెబుతూనే గత కొన్నే ళ్లుగా తెలంగాణకు కేటాయింపులు స్థిరంగా పెరుగుతున్న సంగతి గుర్తుచేశారు. కానీ పెరుగు తున్న జనాభా అవసరాలకు ఈ కేటాయింపులకు ఎంతమాత్రం పొంత వుండటంలేదు. మంత్రి చెప్పిన ప్రకారం తెలంగాణలో మౌలిక సదుపాయాల విస్తరణకు ఇప్పటివరకు రూ.41677 కో ట్లు కేంద్రం ఖర్చు చేసింది. ఈ మొత్తాలు గత కొన్నేళ్లుగా చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించినవి తప్ప కొత్తవి కాదన్న సంగతి గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం తెలంగాణలో 627 కిలోమీటర్ల మేర కవచ్ అమలు జరుగుతుండగా మరో 1100 కిలోమీటర్లకు టెండర్లను ఆహ్వానించగా, ఇంకా 1326 కిలోమీటర్లకు కవచ్ మంజూరైంది. తెలంగాణలో 2529 కిలోమీటర్ల మేర, 22 ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. వీటికి అయ్యే ఖర్చు రూ.39,300 కోట్లు. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి రూ.1992కోట్లతో కొనసాగుతోంది. 7వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ను ఆధునికీకరించారు. ఇవన్నీ గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ప్రాజెక్టులే. కానీ రాష్ట్రానికి ఈ బడ్జెట్ లో కొత్త ప్రాజెక్టులకు ఆమోదం లభించిందేమీ లేదు. బడ్జెట్ కేటాయింపులు కూడా ఆయా ప్రాజెక్టులకు అయ్యే ఖర్చులో భాగంగానే ఈ మంజూరయ్యాయి.
పుణ్యక్షేత్రాలకు అనుసంధానత ఏదీ?
భద్రాచలం, మేడారం, రామప్ప వంటి పుణ్యక్షేత్రాలున్న జిల్లాలకు, వనపర్తి, సూర్యాపేట, నాగర్ కర్నూల్, కొడంగల్, పరిగి, నారాయణపేట, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ వంటి వెనుకబడిన ప్రాంతాలకు, నిర్మల్, ఇచ్చోడ వంటి అటవీ ప్రాంతాలకు ఇంతవరకు రైలు అనుసంధానతే లేదు. రాష్ట్రంలో లక్షకు పైగా జనాభా వున్న పట్టణాలను రైల్వేలతో అనుసంధానిస్తానని కేంద్రం గతంలో చేసిన ప్రకటన ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాక కేంద్రం మంజూరు చేసిన ఫైనల్ లకేషన్ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్) ప్రాజెక్టుల సంఖ్య గత పదేళ్లలో చాలా పెరిగింది. నిధుల కేటాయింపులు పెరుగుతున్నా పెరుగుతున్న అవసరాలకు వీటికి అసలు పొంతనే వుండటంలేదు.
2010లో వికారాబాద్‌ాకృష్ణా (నారాయణపేట జిల్లా) 121 కిలోమీటర్ల మేర రైల్వే ప్రాజెక్టుకు స ర్వే మంజూరైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.787కోట్లు ఖర్చవుతుందని అంచనా. 2012మార్చిలో రైల్వే బోర్డుకు నివేదిక ఇచ్చారు.2023 సెప్టెంబర్ 23న సర్వే మంజూరైంది. ఇప్పుడు ప్రాజెక్టు ప్రాథమిక అంచనా రూ.2196కోట్లకు చేరుకుంది. ఇది పూర్తయితే దక్షిణ తెలంగాణ లోని కొత్త ప్రాంతాలకు రైలు అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్‌కు ప్రయాణ సదుపాయం, తాండూరు సిమెంట్ పరిశ్రమకు సరఫరాలు సులభతరం కాగలవు. అంతేకాదు వికారాబాద్ నుంచి హుబ్లి, కొల్హాపూర్, గోవాలకు దూరం తగ్గుతుంది. మంజూరై ఇంతకాలమైనా ఇంకా సర్వేకు అతీగతీ లేదు. శంషాబాద్‌ావిజయవాడ సెమీ హైస్పీడ్ కారిడార్‌కు రైల్వేబోర్డు ఆమోదం తెలిపింది. ఇది పూర్తయితే రైళ్లు గరిష్టగా రూ.220కి.మీ వేగంతో ప్రయాణించగలవు. దీని సర్వే కొనసాగుతోంది. కరీంనగర్‌ాహసన్‌పర్తి రైల్వేలైన్ (62కి.మీ) కొత్త రైల్వే మార్గం కోసం 2011లో మంజూరైతే 2013లో రైల్వే బోర్డుకు చేరింది. అప్పటి అంచనా వ్యయం రూ.464 కోట్లు. మరి ఇప్పుడు రూ.1116 కోట్లకు పెరిగింది. ఇదెప్పుటకి పూర్తయ్యేనో తెలియదు. రీజనల్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా రీజినల్ రింగ్ లైన్‌ను కేంద్రం ప్రకటించింది. దీని సర్వే కోసం రూ.14కోట్లు కేటాయింపు కూడా జరిగింది. ఇది ఇంకా మొదలు కాలేదు. 564 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టు ంచనా వ్యయం రూ.12408కోట్లు!
హైద్రాబాద్ రెండోదశ మెట్రో ఆశలపై నీళ్లు
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో హైదరాబాద్ రెండో దశ మెట్రో ఊసే లేకపోవడంతో తెలంగాణ వాసులు తీవ్ర నిరాశకు గురయ్యారు. గత బడ్జెట్‌లో చెన్నై మెట్రో విస్తరణకు నిధులు కేటాయించారు. ఈసారి హైదరాబాద్ మెట్రో విస్తరణకు నిధులు,అనుమతులు వస్తాయనుకున్న వారి ఆశ లపై నీళ్లు చల్లుతూ ఎటువంటి కేటాయింపులూ జరపలేదు. రాష్ట్ర ప్రభుత్వం 74.6 కిలోమీటర్ల మెట్రో కేరిడార్‌తో డి.పి.ఒ. రూపొందించింది. దీని తర్వాత ఫోర్త్ సిటీ, నార్త్‌సిటీల ప్రాజెక్టులను కూడా రెండో దశలో బాగంగా చేర్చి 161.4 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్లు రూపకల్పన చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ కింద ఈ ప్రాజెక్టులను ప్రారంభించాల్సి వుంది. మొదటి ఐదు కారిడార్లకు రూ.24వేల కోట్లు (సుమారుగా) ఖ ర్చు కాగలదని అంచనాలు వేశారు. వీటికి కేంద్రం సావరిన్ గ్యారంటీతో పాటు రూ.4230కోట్లు తన వాటాగా కేటాయించాల్సి వుంది. కానీ రెండో దశ ప్రాజెక్టుకు కేంద్రం ఇప్పటివరకు ఆమోదం తెలపలేదు. గతంలో చెన్నైకి అడగకుండానే నిధులు కేటాయించిన కేంద్రం, ఇప్పుడు తెలం గాణ పట్ల తీవ్ర వివక్షను చూపుతున్నదన్న అభిప్రాయం ఏర్పడుతోంది. అయితే అధికార్లు చెప్పే ది మరోలా వుంది. మెట్రో గురించి కేంద్రం ప్రత్యేకంగా బడ్జెట్‌లో ప్రస్తావించాల్సిన అవసరం లేదంటున్నారు. ఒక్కసారి కేంద్రం ఆమోదం లభిస్తే అన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతాయంటున్నారు. రెండోదశ కేరిడార్ నిధులు సమస్యే కాదని, కేవలం సావరిన్ గ్యారంటీ రావడమే కష్టమని చె బుతున్నారు. నిజానిజాలు బయటపడాలంటే వేచి చూడాల్సిందే!