మానేరు రివర్ ఫ్రంట్ అవినీతిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలి.

మానేరు రివర్ ఫ్రంట్ అవినీతిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలి

జిల్లా ఇంచార్జీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మానేరు రివర్ ఫ్రంట్,కేబుల్ బ్రిడ్జి పనుల అభివృద్ధి పై అధికారులతో సమీక్ష చేయాలి

సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

 

కరీంనగర్ జిల్లా ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం సృష్టించడానికి పర్యాటక రంగ అభివృద్ధి కోసం గత బిఆర్ఎస్ ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్, తీగల వంతెన నిర్మాణ పనుల్లో పూర్తిగా అవినీతి,అక్రమాలు చోటు చేసుకున్నాయని,తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని విజిలెన్స్ ద్వారా సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం రోజున సిపిఐ కరీంనగర్ నగర సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ లోని మానేరు ఫ్రంట్,తీగల వంతెన ను సిపిఐ బృందం పరిశీలించింది. ఈసందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణం కోసం ఐదు వందల కోట్ల నిధులు మంజూరు చేయగా అందులో వంద కోట్లు టూరిజం శాఖ, వంద కోట్లు నీటి పారుదల శాఖ నిధులు మంజూరు చేసిందని, పర్యాటక రంగ అభివృద్ధి కోసం చేపట్టిన పనులు మధ్యలో ఆగిపోయాయని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో కరీంనగర్ కు చెందిన శాసనసభ్యులు ఆనాటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో జరిగిన ఈ పనులు పూర్తిగా అవినీతి మయమై లోపభూయిష్టంగా జరిగాయని, తన అనుచరులైన వారిని, వారి కుటుంబానికి చెందిన వారిని కాంట్రాక్టర్లుగా, బినామీలుగా ఉపయోగించుకొని పనుల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పనులను అసంపూర్తిగా చేశారన్నారు. అప్పటి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆగమేఘాల మీద కరీంనగర్ కు వచ్చి మానేరు రివర్ ఫ్రంట్ పనులను ప్రారంభించారని, కానీ నేటికీ పనులకు అతిగతి లేదన్నారు. రివర్ ఫ్రంట్ ప్రాంతంలో నిర్మించిన చెక్ డ్యాములు పూర్తిగా నాణ్యత లోపం తో నిర్మించడం వల్ల వర్షాలకు ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కొట్టుకుపోయాయని, నిర్మాణ లోపాలు ఉన్నటువంటి
మానే రివర్ ఫ్రంట్ కు రెండు వందల కోట్లు రూపాయల నిధులను ఏప్రాతిపదికన విడుదల చేశారో నేటి ప్రభుత్వం స్పష్టం చేయాలని, నిర్మాణ పనుల్లో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే విజిలెన్స్ విచారణ చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వెంకటరెడ్డి తెలిపారు. తీగల వంతెనను ఆనాటి రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హడావుడిగా ప్రారంభించారని, రెండు వందల ఎనిమిది కోట్ల నిధులు వెచ్చించి కనీసం విద్యుత్ దీపాలు, రోడ్లు సరిగా వేయకపోవడం, వేసిన వీధి దీపాలు వెలగకపోవడం దారుణమని, నాడు ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లా ఇంచార్జీ మంత్రిగా నియామకమైనందున తక్షణమే జిల్లా అధికారులతో కేబుల్ బ్రిడ్జి మానేరు ఫ్రంట్ పై సమీక్ష సమావేశం జరిపి అవినీతి అక్రమాలకు పాల్పడి నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అవినీతి ఎక్కడ జరిగితే అక్కడ సిపిఐ ప్రత్యక్షమవుతుందని అవినీతి అంతమే సిపిఐ పంతమని, ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ చేపట్టకుంటే సిపిఐ చూస్తూ ఊరుకోదని ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈప్రాజెక్టులో రెండు వందల కోట్ల ప్రజాధనాన్ని మొక్కుబడిగా ఖర్చు చేసి నీటిపాలు చేసిందని, ప్రజాధనాన్ని సంక్షేమం కోసం కాకుండా కాంట్రాక్టర్ లబ్ధికోసం అప్పగించిన నాటి ప్రభుత్వంలో మంత్రి గంగుల కమలాకర్ కోట్లాది రూపాయల నిధులను దుర్వినియోగం చేశాడని విమర్శించారు. ఏమేరకు అభివృద్ధి పనులు జరిగాయని,ఎంత అవినీతి జరిగిందని,ఎందుకు పనులు నిలిచిపోయాయి అనే విషయాలపై నిష్పక్షపాతంగా కాంగ్రెస్ ప్రభుత్వం తగిన విచారణ చేపట్టి బాధ్యులైన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసు నమోదు చేసి ప్రజాధనాన్ని రికవరీ చేయాలని అవినీతిపై సిపిఐ పోరాటం చేస్తుందని మర్రి వెంకటస్వామి తెలిపారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యురాలు కిన్నెర మల్లవ్వ, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు,న్యాలపట్ల రాజు,కటికరెడ్డి బుచ్చన్న యాదవ్,కసిరెడ్డి మణికంఠ రెడ్డి,బండ రాజిరెడ్డి,కంది రవీందర్ రెడ్డి,మచ్చ రమేష్, బ్రామండ్లపల్లి యుగేందర్, నాయకులు గామినేని సత్తయ్య, నగునూరి రమేష్, కూన రవి, చెంచల మురళి, మామిడిపల్లి హేమంత్ కుమార్,సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version