పీల్చి పిప్పి చేస్తున్న పన్నులు!?

-సామాన్యుడి మీద మోయలేని భారాలు?

-చిరు వ్యాపారుల గుండెల మీద గుది బండలు!

-ఆదాయ పన్నుకు అర్థం మార్చేస్తున్నారు?

-చిరు వ్యాపారుల జీవితాలు చీకటి చేస్తున్నారు.

-పన్నుల పేరుతో జనం నడ్డి విరుస్తున్నారు.

-లావాదేవీలే ఆదాయం పన్నులకు కొలమానం చేస్తున్నారు?

-లాభాల మీద వసూలు చేయాల్సిన పన్నులు వ్యాపారం మీద జిఎస్టీ వేస్తున్నారు?

-అందరూ బ్యాంకు అకౌంట్లు తీసుకోవాలన్నారు.

-జీరో బ్యాలెన్స్‌ అకౌంట్లు కోట్లాదిగా తెరిపించారు.

-తర్వాత మినిమమ్‌ బ్యాలెన్స్‌ వుండే విధంగా చేశారు.

-ఆ తర్వాత డిజిటల్‌ చెల్లింపులకు దారులు వేశారు.

-డిజిటల్‌ చెల్లింపులకు ఎలాంటి పన్నులుండవని నమ్మించారు.

-ఇప్పుడు మెల్లగా డిజిటల్‌ లావాదేవీలను లెక్కగట్టి జిఎస్టీ అంటున్నారు.

-కచ్చితంగా జిఎస్టీ లైసెన్స్‌ లు తీసుకోవాలంటున్నారు.

-పండ్ల బండి వ్యాపారంలో లక్షల ఆదాయం వుంటుందా?

-కూరగాయల వ్యాపారులు కోట్లు గడిస్తారా?

-చిన్న చిన్న కిరాణ షాపు దారులు కోట్లు సంపాదించుకునే వీలుందా?

-ఎటు పోతుంది అర్థిక వ్యవస్థ?

-జనాన్ని గుళ్ల గుళ్ల చేసే దాకా వదిలిపెట్టరా?

-వ్యాపారుల్లో తిరుగుబాటు ఊహించలేదు.

-డిజిటల్‌ చెల్లింపులపై జనమే ఎదురు తిరుగుతారని అంచనా వేయలేదు.

 

హైదరాబాద్‌,నేటిధాత్రి:                                                 

సామాన్యుడు బతికేదెలా? చేసిన కష్టం నోటిదాకా రాకపోతే రాకపోతే ఎలా? పొద్దంతా చేసిన కష్టంలో మిగులు లేకపోతే ఎలా? భవిష్యతకు భరోసా ఎలా? రేపటి గురించి ఆలోచంకుంటే జీవనం సాగేదెలా? జీవితమంటే కష్టం, సంపాదన, ఖర్చు ఈ రహస్యంలో ఎన్ని ఇబ్బందులున్నాయో పాలకులకు తెలియకుండాపోతోందా? ప్రభుత్వాలకు సలహాలు ఇచ్చేవారు ఎంత మంది వున్నా, నాయకులు ప్రజల్లో వుండడం లేదా? ప్రజల కష్టం తెలియడం లేదా? పనులే కాదు,ఉద్యోగాలే కాదు, స్వయం ఉపాది మేలని అనుకున్నవారు ఇక దివాళా తీయాల్సిందేనా? కర్ణాకట ప్రజలు ఎందుకు నిరసనలకు దిగుతున్నారు? ఇదే ఇప్పుడు దేశ వ్యాప్త చర్చకు దారి తీస్తోంది. సహజంగా సమాజంలో కొంత మంది వ్యాపారాలు చేసుకుంటే కష్టానికి అదనంగా రూపాయి తోడౌతుందని అనుకుంటారు. ఎక్కడో కూలీ చేయడం ఎందుకు? మన పని మనం చేసుకుందామని అనుకుంటారు. అలా ఏదో చిన్నా చితకా వ్యాపారం చేసుకోవాలనుకుంటారు. ఆత్మగౌరవంతో బతకాలనుకుంటారు. తాము బతకడమే కాకాండా పని చేసుకునేవారికి ఉపాధి కూడా కల్పించాలనుకుంటారు. కొన్ని వ్యాపారాల్లో కుటుంబమంతా పని చేస్తుంది. సహజంగా ఉద్యోగం చేసే ఒకరు ఉద్యోగం చేస్తే కుటుంబమంతా ఖాళీగా వుంటుంది. కాని కూలీ చేసుకునే కుటుంబాలలో అందరూ పని చేస్తే తప్ప పూట గడవదు. కూలీ అంటే ఒక రోజు వుండొచ్చు. మరో రోజు లేకపోవచ్చు. అదే కష్టం చిన్న వ్యాపారంలో చేస్తే కుటుంమంతా పనిచేయొచ్చు. ఓ నాలుగు రూపాయలు వెనకేసుకోవచ్చు. ఇదీ సగటు వ్యక్తి ఆలోచన. దాంతో రోడ్ల మీద పండ్ల వ్యాపారం చేసుకుంటారు. కొందరు చిన్న టిఫిన్‌ సెంటర్ల ఏర్పాటు చేసుకుంటారు. మహిళలకు అవసరమైన బొట్టు బిల్లలు, రబ్బరు బ్యాండ్లు అమ్ముకుంటారు. ఇలా రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ బతుకుంటారు. గత పదేళ్ల క్రితం వరకు వీరికి బ్యాంకు అకౌంట్లు కూడా వుండాలన్న ఆలోచన వుండేది కాదు. ఎందుకంటే ఆ సంపాదనతో బ్యాంకుల్లో డబ్బు దాచుకునేంత సంపాదన వచ్చేదే కాదు. అలాంటప్పుడు బ్యాంకులతో కూడా వారికి పని వుండేది కాదు. కాని కేంద్రలో బిజేపి వచ్చిన తర్వాత సమాన్యులు ఇప్పటికీ బ్యాంకు మెట్లెక్కింది లేదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సగటు వ్యక్తికి బ్యాంకు అంటే ఏంటో తెలియకుండాపోయింది. అంటూ బిజేపికి చెందిన పెద్దలు మాట్లాడుతుంటే జనం సంతోషించారు. తమకు లోక జ్ఞానం బిజేపి ఇస్తుందనుకున్నారు. కాని ఆ జ్ఞానం వచ్చే సరికి సంపాదనలో సగం ప్రభుత్వాల ఖాతాల్లోకి వెళ్లే ప్రమాదముందని ఎవరూ ఊహించలేదు. తొలుత అందిరికీ బ్యాంకు అకౌంట్లు వుంటే ఆత్మగౌరవం వస్తుందని నమ్మించారు. జీరో అకౌంట్లు కోట్లాదిగా ఇప్పించారు. తొలుత బ్యాంకు ఖాతాలలో డబ్బు లేకపోయినా సరే అన్నారు. ఆ తర్వాత మినిమన్‌ బ్యాలెన్స్‌ వుండాలన్నారు. అందుకు ఎవరూ బ్యాంకులకు నేరుగా వెళ్లాల్సిన అవసరంలేదన్నారు. ఆన్‌ లైన్‌ సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడే జీఎస్టీ అనే బాదుడుకు ముహూర్తం పెట్టారు. దేశమంతటా ఒకే పన్ను విదానం తెస్తున్నామన్నారు. ప్రభుత్వ సేవలు అన్ని ప్రాంతాల వారికి సమానంగా అందాలన్నారు. ప్రతి వస్తువుకు దేశమంతాటా ఒకే పన్ను విధానం వుండాలన్నారు. ఇది దేశ ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతుందని అనుకున్నారు. కాని మొదటికే మోసం వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు జిఎస్టీ అధికారులు నోటీసులు పంపిస్తుంటే చిరు వ్యాపారులు లబోదిబోమంటున్నారు. దేశంలో పెద్ద నోట్ల వల్ల అవినీతి పెరిగిపోతుందని, నల్ల దనం పేరుకుపోతుందని అన్నారు. డబ్బంతా పెద్ద చేతుల్లో వుంటుందని, సామాన్యుడు అక్కడే ఆగిపోతున్నాడన్నారు. ఇలాంటి మాటలు పేద వర్గాలకు ఎంతో ఊరట కల్గిస్తాయి. దేశంలో నల్లధనం అదుపులోకి వస్తే దేశమంతా సుభిక్షంగా వుంటుందని నమ్మించారు. నోట్ల రద్దు చేశారు. కష్టాల సుడిగుండాన్ని తెరిచారు. తర్వాత కొంత కాలానికి ఆన్‌ లైన్‌ చెల్లింపుల ద్వారా ఎక్కడా నల్లదనం నిలువకు ఆస్కారం వుండదని అన్నారు. మెల్లిగా అన్ని రకాల వర్గాలకు ఈ ఆన్‌ లైన్‌ చెల్లింపులు అలవాటు చేశారు. కొన్ని కంపనీలు మనీ రిటన్‌ అనే స్కీమ్‌ను అమలు చేశారు. అటు నోట్ల రద్దుతో చిల్లర మార్చుకోవడం కొంత ఇబ్బంది కరంగా మారింది. డిజిటల్‌ మనీ మార్పిడి అనేది చిరు వ్యాపారులకు వరంగా మారిందన్న నమ్మకం కలిగింది. ఇక ఇప్పుడు అసలైన పన్నుల బారానికి రంగం సిద్దమైంది. ఇందులో నిగూఢ రహస్యం దాగి వుంది. నిత్యం దేశ వ్యాప్తంగా ఎంత వ్యాపారం సాగుతుందనే లెక్క తేలిపోయింది. అయితే ఆర్ధిక వేత్తల అత్యుత్సాహమో, లేక జీఎస్టీ అధికారుల అనాలోచిత నిర్ణయమో గాని, మొదటికే మోసం వచ్చే పరిస్ధితి వచ్చింది. రోడ్డుమీద ఓ పండ్ల వ్యాపారి ప్రతి చెల్లింపును ఆన్‌లైన్‌ ద్వారానే తీసుకుంటున్నారు. ఇక్కడ నగదు వ్యాపారం కూడా ఎంతో కొంత సాగుతుంది. కానీ ఎక్కువ శాతం అందరూ ఆన్‌లైన్‌ చెల్లింపులే చేస్తున్నారు. ప్రతి వ్యక్తికి బ్యాంక్‌ అకౌంట్‌ సౌకర్యం కల్పించిందే ఇందుకు. సెల్‌ఫోన్‌ల వ్యాపారం పెంచారు. ప్రతి వ్యక్తి చేతిలోకి ఇంటర్‌నెట్‌ సౌకర్యం కలిగేలా చేశారు. ఒకప్పుడు ఇంటర్‌ నెట్‌ అనేది కంపనీలకుమాత్రమే పరిమితమయ్యేది. ఇప్పుడు ప్రతి వ్యక్తి చేతిలోకి వచ్చేలా చేశారు. మాట్లాడేందుకు ఉపయోగపడే సెల్లు , సకల కార్యాలకు నిలయం చేశారు. ఆన్‌లైన్‌చెల్లింపులు కూడా అలవాటు చేశారు. పండ్లు, కూరగాయలు, చిన్న చిన్న టిఫిన్‌ సెంటర్లు నిర్వహించుకునే వారికి వస్తున్న చెల్లింపుల్లో లక్షల రూపాయలు కనిపిస్తున్నాయి. కాని ఒక పండ్ల వ్యాపారి మార్కెట్‌ నుంచి ఎంతకు కొనుగోలు చేస్తున్నాడు. అందుకు రవాణాకు ఎంత ఖర్చు చేస్తున్నాడు. తెచ్చిన పండ్లు ఎంత వరకు అమ్ముడౌతున్నాయి. ఎంత వృధా పోతున్నాయి. అతనికి సహాయకులుగా ఎంత మంది పనిచేస్తున్నారు. పండ్లు అమ్ముడుపోక ఎంత నష్టపోతున్నాడు. ఇవన్నీ జీఎస్టీ అధికారులు లెక్కలోకి తీసుకోవడం లేదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. డబ్బు రాక, పోకలు పోను మిగులును లెక్కిస్తున్నారా? లేక ఆదాయం మొత్తం లెక్కలోకి తీసుకుంటున్నారా? అన్నది కూడా చర్చించాల్సిన అవసరం వుంది. సామాన్య వ్యాపారులు జీఎస్టీ రిజిస్రేషన్‌ చేసుకోవాలంటే సాద్యమౌతుందా? అయితే ఏకకాలంలో కర్నాటకలో సుమారు 14వేల మంది చిరు వ్యాపారులకు జిఎస్టీ నోటీసులు పంపినట్లు వారు వెల్లడిస్తున్నారు. తమ వద్ద వున్న జిపేల బోర్టులు తొలగిస్తున్నారు. జిఎస్టీలు కట్టలేమని చెబుతున్నారు. నాలుగేళ్ల తర్వాత లావాదేవీల మీద జిఎస్టీలు వేయడం లో అర్దమేమిటని ప్రశ్నిస్తున్నారు. తము బతకాలా? వద్దా? అని నిలదీస్తున్నారు. ఇదెక్కడి దోపిడీ అని అంటున్నారు. తాము తెచ్చే ప్రతి వస్తువు మీద ముందే అన్ని రకాల పన్నులు చెల్లించిన తర్వాత మళ్లీ ఈ జిఎస్టీ ఏమిటంటున్నారు. అంతే కాకుండా ఆహార పదార్ధాలు, కూరగాయాలు, పండ్లు విడివిడిగా అమ్ముకునే చిరు వ్యాపారులు జీఎస్టీ చెల్లించాల్సిన అసవరం లేదు. కాని జిఎస్టీ అధికారులు నోటీసుల పంపడంపై చిరు వ్యాపారాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ నెల 25న కర్నాకట బంద్‌కు చిరు వ్యాపారులు పిలుపునిచ్చారు. ఇది ఇక్కడి నుంచి దేశ వ్యాప్తంగా పాకే అవకాశం వుంది. ఇప్పటికే ప్రజలు ధరలతో బెంబేలెత్తిపోతున్నారు. మొదట్లో డిజిటల్‌ చెల్లింపులకు ఎలాంటి పన్నులుండవన్నారు. తర్వాత రోజుకు ఏక కాలంలో రెండు వేల కన్నా ఎక్కువ డిజిటల్‌ చెల్లింపులు చేస్తే ఫైన్‌ పడుతుందన చెప్పారు. ఇప్పుడు ఏకంగా చిరు వ్యాపారులకు జిఎస్టీ నోటీసులు పంపించేస్తున్నారు. అసలు చిరు వ్యాపారులు ఏడాదికి లక్షలాది రూపాయలు లాభాలు ఆర్జించే అవకాశం వుందా? లావాదేవీలన్నీ లాభాలౌతాయా? వచ్చిన సొమ్మంతా ఆదాయమౌతుందా? అందులో ముడిసరుకుల ఖర్చులు ఎలా తేల్చుతారు. రూపాయికి ఐదు పైసల లాభం కూడా రాని వ్యాపారాలలో లక్షల ఆదాయం సాధ్యమౌతుందా? కూరగాయల వ్యాపారులు కోట్లు గడిరచినట్లు ఎక్కడైనా సాక్ష్యముందా? పండ్ల వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులు ధనవంతులైనట్లు ఎక్కడైనా చూశారా? అధికారులు సగటు వ్యక్తుల మీద ఇలా పన్నుల మీద పన్నులు వసూలు చేసుకుంటూ పోతే ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు తప్పవు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version