నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట రేంజ్ పరిధిలోని మండలాల్లో తునికి ఆకు సేకరణ కొరకు టెండర్లను వెంటనే పిలవాలని న్యూ డెమోక్రసీ నాయకులు డిమాండ్ చేశారు.శుక్రవారం నర్సంపేట రేంజ్ ఆఫీసర్ రవి కిరణ్ కు అఖిల భారత రైతు కూలి సంఘం, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నర్సంపేట డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్ లోని నర్సంపేట,నల్లబెల్లి,ఖానాపురం మండలాలతో పాటు రెడ్లవాడ తదితర గ్రామాలలో గత సంవత్సరం తునికాకు టెండర్లు పిలువపోవడం వలన వేసవికాలంలో గిరిజన పేదలకు ఉపాధి దెబ్బతిన్నదని వారన్నారు.అంతేగాక రాష్ట్ర ప్రభుత్వానికి రావలసిన ఆదాయం కూడా ఆగిపోయిందని తెలిపారు.అందుకు సంబంధించిన టెండర్లు వెంటనే పిలవాలని వారు డిమాండ్ చేశారు. గతంలో ఆకు సేకరించిన వ్యవసాయ కూలీలకు రావాల్సిన బోనస్ డబ్బులు కూడా చెల్లించలేదని వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నర్సంపేట డివిజన్ కమిటీ కార్యదర్శి ఎలకంటి రాజేందర్, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మొగిలి ప్రతాపరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు రాచర్ల బాలరాజు, డివిజన్ కార్యదర్శి జక్కుల తిరుపతి, బుర్ర వీరస్వామి, కొంపల్లి సాంబయ్య, బిగిని రవి తదితరులు ఉన్నారు