రామడుగు, నేటిధాత్రి:
గోపాలరావుపేట మండల కేంద్రం ఏర్పాటు చేయాలని చోప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యంకి జాతీయ యువజన అవార్డు గ్రహీత అలువాల విష్ణు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగినది. ఈసందర్భంగా అలువాల విష్ణు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గోపాలరావుపేట గ్రామం చుట్టుపక్కల ఆరు మండలాల పరిధిలోని సుమారు నలబై గ్రామాలకు ప్రధాన కూడలిగా ఉంది. గోపాలరావుపేట గ్రామం వర్తక,వ్యాపార, వాణిజ్య, విద్యా కేంద్రంగా గోపాలరావు పేట గ్రామం ఇరవై ఐదు సంవత్సరాల నుండి కొనసాగుతుంది. గ్రామంలో సుశీలమైనటువంటి అన్ని వసతులతో కూడిన వ్యవసాయ మార్కెట్ యార్డు, 24 గంటల ప్రసూతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ పశు వైద్య ఉపకేంద్రంతో పాటు ఒక కార్పొరేట్ హాస్పిటల్, మూడు వాణిజ్య బ్యాంకులు, రెండు పెట్రోల్ బంకులతో పాటు సెంట్రల్ లైటింగ్ తో కూడినటువంటి సువిశాలమైన గోపాలరావుపేట చౌరస్తా కూడలి వర్తక వాణిజ్యపరంగా జిల్లా స్థాయిలో లభించే అన్ని రకాల సామాగ్రికి నిలయంగా ఉంది. సాంకేతికపరంగా ప్రభుత్వ రంగ సంస్థల బిఎస్ఎన్ఎల్ తో పాటు పలు ప్రైవేట్ సంస్థలకు చెందిన టెలికం టవర్లు కూడా ఏర్పాటు అయ్యాయి. అలాగే గ్రామంలో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ సెంటర్ తో కూడిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రైవేట్ ఉన్నత పాఠశాలలో కార్పొరేట్ పాఠశాల, ప్రైవేట్ జూనియర్ డిగ్రీ కళాశాలతో పాటు ప్రైవేట్ దూరవిద్య కేంద్రం ద్వారా డిగ్రీ, పీజీ కళాశాలలో చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో అన్ని రకాల సంస్థలకు నిలయంగా గోపాలరావుపేట గ్రామం దినదినాభివృద్ధి చెందుతుంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రతినిత్యం అవసరాల కొరకు గోపాలరావుపేట గ్రామానికి వచ్చి వెళ్తూ ఉంటారు రవాణా సౌకర్యంతో కూడిన సదుపాయాలు గోపాలరావుపేట గ్రామంలో అన్ని వసతులు ఉన్నాయి. అలాగే గతంలో 1984 సంవత్సరంలో గోపాలరావుపేట గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి మహేంద్ర నాథ్ దృష్టికి తీసుకువెళ్లి వినతిపత్రం కూడా అందజేశారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్త మండలాల ఏర్పాటు చేసే క్రమంలో కూడా గోపాలరావుపేట మండల కేంద్రంగా ప్రతిపాదన వచ్చిన నలబై సంవత్సరాల చిరకాల వాంఛ అయిన గోపాలరావుపేట మండల కేంద్రం ఏర్పాటు కాలేదు. గతంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కూడా అసెంబ్లీలో గోపాలరావుపేట గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారని తెలిపారు. కానీ నలబై సంవత్సరాల కల కలగానే మిగిలిన పరిస్థితి నెలకొని ఉందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే గోపాలరావుపేట గ్రామాన్ని మండల కేంద్రం ఏర్పాటు అయ్యే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంని కోరడం జరిగింది. ఈకార్యక్రమంలో గ్రామ యువకులు కొలిపాక కమలాకర్, అరే వినోద్, కొలిపాక నాగరాజు, కొల్లూరి అనిల్, తదితరులు పాల్గొన్నారు.