తెలంగాణ పాటకు ప్రపంచం దాసోహం!

`తెలంగాణ యాసకు పాటలమ్మ పరవశం.

`తెలంగాణ కావ్యాలకు సంగీతమే సాగరం!

`తెలంగాణ మట్టి పరిమళాలతో రాగమాడుతున్న తాండవం.

`తెలంగాణ ఉద్యమంతో పల్లె పాటకు పెరిగిన ఆదరణ.

`ఆది నుంచి తెలంగాణ పాటలో వున్న మట్టి వాసన.

`తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పాటకు పట్టాభిషేకం.

`ప్రపంచం నలుమూలలా పాకుతున్న పాటల విన్యాసం.

`మిస్‌ వరల్డ్‌ నోటి నుంచి జాలు వారిన ముత్యాల వాన.

`రాను బొంబయ్‌కి రాను అంటూ ఊగిపోతున్న ప్రపంచం.

`అర్థం తెలియకపోయినా అల్లుకుపోతున్న పాట.

`వందల మిలియన్లతో అగ్రగామిగా నిలుస్తున్న మన తెలంగాణ పాట.

`ఒకప్పుడు తెలంగాణ పాటకు అవమానం.

`ఇప్పుడు తెలంగాణ పాటకు వైభోగం.

`తెలంగాణ పాట రాష్ట్రానికే సౌభాగ్యం.

`మనసు పరవశానికి పట్టాభిషేకం.

`ఆనందాన్ని పంచుతున్న ఆరోగ్యం.

`వెలుగులోకి వస్తున్న సంగీత సరస్వతులకు జేజేలు కొడుతున్న ప్రపంచం.

`ఎన్ని సార్లు విన్నా తరగనంత సంతోషాన్ని నింపుతున్న మధురగానం.

`అది తెలంగాణ యాసలో వున్న మధురామృతం.

`ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ విన్నా సినిమా పాటలు.

`ఇప్పుడు ప్రపంచమంతా మారు మ్రోగిపోతున్న తెలంగాణ పాటలు.

`తెలంగాణ యాస కమ్మదనం తొక్కుతున్న పాటల పరవళ్లు.

`తెలంగాణ కవిగాయకులు అంటే పాటల ప్రపంచాన్ని ఏలుతున్న రారాజులు.

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        తెలంగాణపాట అనగానే మది పులకిస్తుంది. మనసు పరవశిస్తుంది. తెలంగాణ పాట అంటేనే రక్తం ఉరకలేస్తుంది. ఊపును నింపుతుంది. ప్రశ్నను రేకెత్తిస్తుంది. వ్యవస్ధను నిలదీస్తుంది. సమాజాన్ని దారిలో పెడుతుంది. ఆలోచనను సృష్టిస్తుంది. నిజాన్ని వెలికి తీస్తుంది. నిప్పులా కాలుతుంది. సూటిగా బాణంగా గుచ్చుకుంటుంది. తూటాలా పేలుతుంది. మస్కిష్కంలోకి దూసుకుపోతోంది. ఆలోచింపచేస్తుంది. చైతన్యం నింపుతుంది. ఉద్యమానికి ఊపిరిలూదుతుంది. పోరాటానికి దారి చూపిస్తుంది. ప్రకృతిని ఆరాదిస్తుంది. ప్రకృతి గొప్పదనం చెప్పుతుంది. గాలి, నీరు, నిప్పు, నింగి,నేలను కలుపుకొని సాగుతుంది. ఉప్పెనలా దూసుకొస్తుంది. సునామీ సృష్టిస్తుంది. గడ్డిపరకలు గడ్డపారలౌతాయి. ఎండిన ఆకులు కూడా అలజడులు సృష్టిస్తాయి. వాగులు పరుగులందుకుంటాయి. వంకలు దుంకుతుంటాయి. కొండ, కోనలు కూడా ప్రతిధ్వనిస్తుంటాయి. ఇదీ తెలంగాణ పాటంటే…ఇదే తెలంగాణ గానమంటే..ఆ గానంలో ఆత్రం వుంటుంది. ఆకలి వుంటుంది. తిరుగుబాటు వుంటుంది. కమ్మదనం వుంటుంది. అందుకే తెలంగాణ పాటకు దాసోహం అనని వారుండదు. రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా అంటే శివుడు కూడా కన్నీరు కార్చాల్సిందే. ఆ కన్నీటితో శివలింగం కూడా తడిసి ముద్ద కావాల్సిందే. ఆ కన్నీటితోనే అభిషేకం జరిపిన పాట తెలంగాణ పాట. అవును ఇది అతిశయోక్తి కాదు. ఆర్తి. తెలంగాణస్పూర్తి. తెలంగాణ పదానికి దేవుళ్లే కదిలిన దార్తి…తెలంగాణ ఉద్యమ కాలంలో మిట్టపల్లి సురేందర్‌ రాసిన రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అంటూ పాట రాస్తే, ఆ రాగానికి తెలంగాణ మొత్తం కన్నీటిపర్యంతమైంది. తెలంగాణ కోసం ప్రాణాలు తీసుకుంటున్న పిల్లల తల్లిదండ్రుల కడుపుకోత కండ్ల ముందు కదలాడిరది. ఏకంగా శివుణ్ణే ప్రశ్నిస్తుంటే తెలంగాణ సమాజమంతా నివ్వెరపోయింది. తెలంగాణ ఇస్తారా? లేదా? అని డిల్లీని నిలదీసింది. కొట్లాడి సాదించుకుందామనే ధైర్యాన్ని ఆ పాట తెలంగాణ యువతలో నింపింది. అదీ తెలంగాణ పాట గొప్పదనం. తెలంగాణ పాట ఇప్పుడు పుట్టింది కాదు. ఇక్కడితో ఆగేది కాదు. తెలంగాణలో బతుకమ్మ పుట్టినప్పుడే పాట పుట్టింది. తర్వాత నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ పాట గళమెత్తింది. తెలంగాణ ఉద్యమం కోసం రెండు దఫాలుగా యాభై ఏళ్లపాటు ప్రతిసారి పాటల రెక్కలు కత్తిరించినా, కొత్త రెక్కలు తొడుక్కొని ఊరకలెత్తింది. ఈ భూమి మనదిరా.. వాడ మనది రా..అంటే చైతన్యం నింపింది. ఎంతో మంది కవి గాయకులు తెలంగాణను పాటల సీమగా మలిచారు. ఇప్పుడు స్వర్గసీమను ఏలుతున్నారు. ప్రజల నాలుకలమీద జీవిస్తూనే వున్నారు. అలా ఎంతో మంది కవులు,గాయకులు తెలంగాణ గడ్డ మీద పుట్టారు. అయితే తెలంగాణ పాటను తమ స్వార్ధం కోసం వాడుకున్న ఆంద్రులున్నారు. వారి రాజకీయం కోసం అణిచి వేసిన వాళ్లున్నారు. సినిమా వాళ్లు తెలంగాణ పాటతో కోటీశ్వరులయ్యారు. కాని తెలంగాణ కవులకు చిల్లిగవ్వలు ఇవ్వకుండా మోసం చేశారు. తెలంగాణ పాటను రాజకీయ నాయకులు అణిచివేశారు. అయినా ఆకలిని కూడా ఎదరించి నిలబడిరది తెలంగాణ పాట. ఆకలికి అమ్ముడుపోనిది తెలంగాణ పాట. ఎవరో వేసే మెతుకుల కోసం ఆరాటపడనిదే తెలంగాణ పాట. తనను తాను సృష్టించుకొని పల్లకిలో ఊరేగిందే తెలంగాణ పాట. ఆ పాటల పరంపరంలో ఉద్యమానికి ఊపిరులూదిన పాటలు అనేకం వున్నాయి. పొడుస్తున్న పొద్దు మీద అంటూ గద్దర్‌ పాడిన పాటలు, జయయజహే తెలంగాణ అంటూ అందెశ్రీ రాసి పాడిన పాటలున్నాయి. నేలమ్మ నేలమ్మా అంటూ జయరాజ్‌ రాసిన పాటలున్నాయి. అయ్యోనివా నువ్వు అవ్వోనివా అంటూ తెలంగాణను మేలుకొలిపిన పాటలున్నాయి. నాగేటి సాళ్లల్ల నా తెలంగాణ అని వినిపించిన గానాలున్నాయి. ఇదవన్నీ తెలంగాణకు ముందు…కాని ఇప్పుడు తెలంగాణ తర్వాత కూడా తెలంగాణ పాట తన ప్రస్ధానం ఆపుకోలేదు. ఆగిపోలేదు. మరింత దూకుడు పెంచింది. అందుకే తెలంగాణ పాట గురించి చెప్పాలంటే తెలంగాణ రాకకు ముందు, తెలంగాణ తర్వాత అని చెప్పాలి. అప్పటి పాటలు ఆణిముత్యాలు. ఇప్పటి పాటలు ప్రపంచాన్ని ఏలుతున్న వజ్రాలు. ఎందుకంటే తెలంగాణ అంటేనే పాటల పూదోట. అది ఎరుపెక్కినా పాట ద్వనిస్తుంది. పచ్చగా మారినా పరవశించి పాడుతుంది. ఉద్యమాల బాటకు దారులు వేసిన పాట. పోరాటాలను కడుపులో నింపుకొని దూకిన పాట. తెలంగాణ పాట అంటేనే పోరాటాల చరిత్ర. అణివేతను నిలదీసిన తిరుగుబాటు. అస్ధిత్వ ఆరాటాన్ని, ఆత్మ గౌరవ నినాదాన్ని నింపుకొని సాగుతుంది. పాట హృద్యంగా వుండాలన్నా, రక్తం మరగాలన్నా తెలంగాణ పాటేకావాలి. ఇది తెలంగాణ పాట గొప్పదనం. నిండు గుణం. ఒకప్పుడు తెలంగాన పాటంటే పౌరుషం..పోరాటం మాత్రమే అనుకునే వారు. కాని దాని వెనుకున్న ఆకలి ఆరాటాలు పట్టించుకునేవారు కాదు. తెలంగాణ పాటలో తిరుగుబాటు బావుటానే చూసేవారు. కాని అది గుండెల్లో మండుతున్న అగ్నికి ప్రతిరూపం అని పాలకులు భావించకపోయేవారు. సముద్రంలో ఎగసిపడుతున్న అలలు అని తెలుసుకోలేకపోయారు. వాటిని అణిచి వేశారు. పాటను కాలరాయాలనుకున్నారు. ఆనాడే తెలంగాణ పాటకు స్వేచ్చనిస్తే ప్రపంచాన్నే శాసించేది. ప్రపంచానికే చైతన్యాన్ని నింపేది. తెలంగాణలో అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఆ పాటలు సజీవమే..కాని తెలంగాణలో ఇప్పుడు కొత్త తరంపాటలొస్తున్నాయి. రసరంజనిలో ఓలలాడిస్తున్నాయి. ప్రతి తెలంగాణ గుండెలో ఆనందాన్ని నింపుతున్నాయి. మనసును పరవశింపజేస్తున్నాయి. ముసలీ ముతక కూడా కాలు కదిపేలా చేస్తున్నాయి. పసి పిల్లలు తొట్టెలో కూడా కూడా ఊగిపోయేలా చేస్తున్నాయి. తెలంగాణలో కన్నీటి పాటల నుంచి పన్నీటి పాటలు ఉధ్భవిస్తున్నాయి. పాటల జడివానలో ప్రపంచాన్ని తడిపి ముద్ద చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ పాటకు ప్రపంచం దాసోహమంటోంది. తెలంగాణ యాస ప్రపంచపు అంచులను తాకుతుంటే పాటలమ్మ పరవశించిపోతోంది. తెలంగాణ కావ్వాలకు సంగీత సాగరమే నాట్యం చేస్తోంది. తెలంగాణ మట్టి పరమిళలాతో రాగమే తాండవమాడుతోంది. ఇది ముమ్మాటికీ నిజం. ఎందుకంటే తెలంగాణకు చెందిన ఓ కుర్ర కళాకారుడు రాము రాథోడ్‌ గాయకుడై, కవిjైు, నర్తించి నిర్మించిన రాను..నే..రాను బొంబైకి రాను అనే పాట సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ప్రపంచంలో మైకెల్‌ జాక్సన్‌ పాట కూడా 500 మిలియన్లు దాటిన సందర్భం లేదు. దేశంలోని ఏ గాయకుడు పాడిన పాట కూడా అంత దూరం వెళ్లలేదు. ఎంత పెద్ద పాటైనా సరే పది కోట్లు దాటడడమే ఒకప్పుడు రికార్డు. కాని ప్రపంచంలోని తెలుగు వాళ్లే కాదు, బాష తెలియని వాళ్లు కూడా ఆ బాణీలకు, మాటలకు ఫిదా అయిపోయారు. 50 కోట్ల మంది వీక్షించారు. తన్మయత్వానికి లోనయ్యారు. అంటే మాటలు కాదు. మామూలు విషయం అసలే కాదు. తెలంగాణ యాసలో ఈ మధ్య వస్తున్న అనేక పాటలు కూడా అదే దారిలో పరుగులు తీస్తున్నాయి. ఓ పిలగ వెంకటేష అంటూ సాగుతున్న పాట, దారి పొంట వత్తుండు..దవ్వ దవ్వ వత్తుండు..దారిదుద్దునా, పోనిద్దునా? అంటూ సాగే పాట కూడా ప్రపంచాన్ని జయించాలని పరుగులు పెడుతోంది. ఇలా రోజు రోజుకూ కొత్త కొత్త పాటలు వస్తున్నాయి. వేటికవే ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. తెలంగాణ యాసను దిగంతాలకు చేర్చుతున్నాయి. ఒకప్పుడు తెలంగాణ యాసను చీదరించుకున్న వాళ్లు, ఈసడిరచుకున్న వాళ్లు సైతం ఆ మాధుర్యానికి గులాములౌతున్నారు. తామెందుకు చేయలేమని ఆంద్రాకు చెందిన వాళ్లు కూడా తెలంగాణ యాసలో పాటలు రాస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణ బాషను అదేం బాష.. అనేవారు. తెలంగాణ నుడి కారాలను వెక్కిరించేవారు. తెలంగాణ నుంచి వచ్చే సాహిత్యాన్ని చిన్న చూపు చూసేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పాటకు ఆదరణ పెరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పాటకు పట్టాభిషేకం జరుగుతోంది. మిస్‌ వరల్డ్‌ నోటి నుంచి జాలువారిని ముత్యాల వాన రాను..నే రాను బొంబైకి రాను..! అర్ధం తెలియకపోయినా తెలంగాణ పాట అల్లుకుపోతోంది. అందరి నాలుకల మీద నాట్యం చేస్తోంది. తెలంగాణ పాట ఇప్పుడు వైబోగం చవి చూస్తోంది. తెలంగాణ రాష్ట్ర సౌభాగ్యాన్ని గుర్తు చేస్తోంది. ప్రతి మనిషిలో వున్న పరవశానికే పదనిసలు నేర్పుతోంది. ప్రపంచమంతా పట్టాభిషేకం చేస్తుంటే తెలంగాణ యాస మధురగానంలో ఓలలాడుతోంది. పాటల పరవళ్లు తొక్కుతులంటే తెలంగాణ కళాకారులు సంగీత ప్రపంచంలో రారాజులౌతున్నారు. తమ రాజ్యాలనేలుతున్నారు. ఆల్‌ ది బెస్ట్‌. మైడియర్‌ న్యూ జనరేషన్‌.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version