`కమలం ఆటలో అరటిపండే.
`గెలుపు రచనలలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు.
`కుమ్ములాటలలో బిజేపి.
`ఆధిపత్యపోరులో కమలం కాలయాపన.
`నియోజకవర్గాల సమీక్షలలో దూసుకుపోతున్న కారు.
`అభ్యర్థుల ఎంపిక పనిలో నిమగ్నమైన చేయి.
`ఎంపిక ప్రక్రియలో కసరత్తులు లేని కమలం.
`ఈ ఎన్నికలు మూడు నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల ఆలోచన.
`బీఆర్‌ఎస్ ఓటమిపై జనం మరో స్పందన.
`బీజేపి బలంపై మొత్తానికి నివేదన.
`మూడు పార్టీలకు ఈ ఎన్నికలు ఒక అగ్ని పరీక్ష.
హైదరాబాద్,నేటిధాత్రి:
ఏడాది కాలం పాటు సాగిన సార్వత్రిక ఎన్నికల వేడిలో కాంగ్రెస్ గెలిచింది. కారు ఓడిరది. బిజేపి కొంత పుంజుకున్నది. ఇది గత శాసనసభ ఎన్నికల ఫలితం క్లుప్తంగా. మరి ఆ తర్వాత పరిస్దితి ఏమిటి? ప్రజలు ఇంకా చేయినీడనే కోరుకుంటున్నారా? కారును వదులుకొని బాధపడుతున్నారా? కమలాన్ని ఎందుకు ఎంచుకోలేకపోయామనుకుంటున్నారా? అన్న ప్రశ్నలకు కూడ త్వరలో సమాధానాలు దొరకనున్నాయి. సరిగ్గా రెండు నెలల్లో పార్లమెంటు ఎన్నికలు రానున్నాయి. రెండు నెలల క్రితం దాకా శాసన ఎన్నికలు మీద శ్రద్దపెట్టి ఒక తంతును పూర్తి చేసుకున్నాయి. మరో క్రతువు మిగిలే వుంది. దీంతో అసలు ఏ పార్టీది అసలు బలం..ఏ పార్టీది పాల పొంగు అన్నది తేలిపోనున్నది. పార్లమెంటు ఎన్నికల పలితాలతో రాష్ట్రంలో ఏ పార్టీ బలంగావున్నది. ఏ పార్టీ మనుగడ కోసం పోరాటిం చేయాలన్నదానిపై కూడా ఓ క్లారిటీ వస్తుంది. ఇంకా ఇందులో అనేక తిరకాలు రాజకీయాలు కూడా దాగి వున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఓ పార్టీని ఓ పార్టీ మింగేయాలని చూస్తోంది. అందుకు అవసరమైన వార్తలు నిత్యం ఆయా పార్టీలు వండి వారుస్తూనే వున్నాయి. ఆరు నెలలైతే మళ్లీ వచ్చేది మన కారే అని బిఆర్‌ఎస్ అంటోంది. ఆహా…మీరు వస్తామంటే మేం చేతులు కట్టుకొని చూస్తామా…కారును షెడ్డుకు తెచ్చుకొని కట్టేసుకుంటామని కాంగ్రెస్ అంటోంది. కాంగ్రెస్ నుంచి నలుగురుని లాగేసుకుంటే చాలు…ప్రభుత్వం తలకిందులైంతుదనేది బిఆర్‌ఎస్ ఆలోచన? నలుగురుపై బిఆర్‌ఎస్ గురి పెడితే ఏకంగా బిఆర్‌ఎస్‌ఎల్పీనే లేకుండా చేస్తామని కాంగ్రెస్ కలలు కంటోంది. ఇలాంటి రాజకీయాలు రెండు పార్టీల నడుమ నిత్యం చలి కాగుతుంటే..కమలం ఈ రెండి మధ్య నలిగిపోతుందా? లేక వెలిగిపోతుందా? అన్నది తేలాల్సివుంది. కాని రాష్ట్రంలో వున్న రాజకీయ పరిస్దితులను అంచనా వేసే వారికెవరికైనా పార్లమెంటు పోరు కాంగ్రెస్, కారు మధ్యనే వుంటాయన్న సంకేతాలు మాత్రం అందుతున్నాయి.
గత లోక్‌సభ ఎన్నికల్లో కమలం విరబూసినట్లు ఇప్పుడు కూడా విచ్చుకుంటుందా? లేక వాడిపోతుందా?
అన్న అనుమానం కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే కాంగ్రెస్ ఊరుకుంటుందా? కారు సీట్లను వదిలిపెడుతుందా? అన్న చర్చ కూడా జోరుగానే సాగుతోంది. కారు కాంగ్రెస్ మధ్యే పోటీ అన్నదానికి కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ రెంటి మధ్యనే ఆదిపత్య పోరు కనిపిస్తోంది. దాంతో..కమలం ఆటలో అరటిపండే అన్న మాటలు వినిపిస్తున్నాయి. శాసన సభ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలతో గట్టెక్కిన కాంగ్రెస్ ఈసారి కూడా ఎక్కువ స్ధానాలు గెలుచుకునే రచన సాగిస్తోంది. ఓటమి భారం పెద్దగా లేకపోయినా, క్యాడర్ కు మరింత భరోసా కల్పించాలంటే బిఆర్‌ఎస్ లోకసభ సీట్లు ఎక్కువగా గెల్చుకోవాలి. అందుకోసం బిఆర్‌ఎస్ ఓడిపోయిన రోజు నుంచే అంతర్మధనంలో వుంది. ఎక్కడ తప్పు జరిగిందన్నదానిపై లోతుగా అధ్యయనం చేసింది. ప్రజలనుంచి అందుతున్న విషయాలను చర్చించుకున్నది. క్యాడర్ చెప్పిన విషయాలపై కూడా దృష్టిపెట్టింది. ఎలాగైనా పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా అధిక సీట్లు గెలవాలి. అంతే కాదు కారు ప్రయాణం ఈ ఐదేళ్లు కుదుపుల లేకుండా, ఆటంకాలు లేకుండా సాగాలంటే కనీసం పది సీట్లైనా కారు గెల్చుకోవాలి.
గతంలో సారు, కారు, పదహారు అన్న నినాదం ఇప్పుడు తీసుకోవాలి.
ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై ప్రజల్లో కనిపించిన ఆ స్పందన ఇప్పటికీ సానుకూలంగా వుందా? కాంగ్రెస్‌కు అనుకూలంగానే వుంటుందా? వ్యతిరేకంగా మారుతుందా? అన్నదానిపైనే ప్రధానంగా ఈ ఎన్నికల ఫలితాలు ఆదారపడి వుంటాయని చెప్పడంలో సందేహం లేదు. ఆరు గ్యారెంటీలలో రైతు భరోసా, ఇరవై నాలుగు గంటల కరంటు, రైతు రుణమాఫీ, వంటి అంశాలు ఈ పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషిస్తాయి. వాటిపై ప్రజల్లో కనిపిస్తున్న వ్యతిరేకతను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బిఆర్‌ఎస్ వ్యూహ రచన చేసుకుంటోంది. ఎన్నికల మందు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అంటూ చెప్పింది. కాని అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లో అంటూ మెలక పెట్టింది. ఇది ఒక రకంగా కాంగ్రెస్‌కు ఆశనిపాతంగా మారనున్నది.
అధికారంలోకి వచ్చిన తర్వాత లంకెబిందెలు వుంటాయనుకుంటే, కనీసం కుండలు కూడా లేవంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదే పదే చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో కొంత వ్యతిరేకతనే మూట గట్టుకున్నాయనే చెప్పొచ్చు.
ఎందుకంటే ఎన్నికలకు సరిగ్గా మూడు రోజుల మందు బిఆర్‌ఎస్ రైతుబంధు వస్తుందని ప్రకటించింది. దాన్ని కాంగ్రెస్ ఎన్నికల ముందు ఆపించింది. అధికారంలోకి రాగానే 15వేలు ఇస్తామన్నది. రైతు బంధు ఏక కాలంలో కాకుండా విడతలవారిగా వేస్తున్నారు. ఇది రైతులకు కొంత ఇబ్బందికరంగా మారింది. పైగా ఐదు ఎకరాల వరకు కటాఫ్ కావాలని కొంత మంది, వద్దని కొంత మంది కోరుతున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎలా వుంటుందన్నదానిపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని వుంది. ఇక కరంటు కోతలు కూడా వున్నాయయంటూ ప్రచారం జోరగానే సాగుతోంది. పొలాలు ఎండిపోతున్నాయంటూ కొంత మంది సోషల్ మీడియాలో రైతుల ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరి ఇవన్నీ పార్లమెంటు ఎన్నికలల్లో ప్రభావం చూపితే మాత్రం బిఆర్‌ఎస్‌కు ఎంతో అనుకూలమైన తీర్పు కావొచ్చని అనుకుంటున్నారు.
రుణ మాఫీ అన్నది కూడా పార్లమెంటు ఎన్నికల్లో ఒక అంశం అవుతుందనడంలో సందేహం లేదు.
గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం రుణ మాఫీ చేస్తానని మాట తప్పింది. కాంగ్రెస్ ఎన్నికల ముందు రెండు లక్షలు తెచ్చుకున్నా, ఏక కాలంలో రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. తీరా ఇప్పుడు ప్రభుత్వం కొంత సమయం కోరుతోంది. ఇవన్నీ ప్రజలు పట్టించుకుంటారా? లేక కాంగ్రెస్‌కే జై కొడతారా? లేక కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పిందని కారుకు మళ్లీ గేరు మార్చి ఊపునిస్తారా? అన్నది చూడాలి. ఈ రెండు పార్టీల మధ్య ఇలా రసవత్తర పోరు కనిపిస్తుంటే, కమలంలో మాత్రం కొంత నిస్తేజం కనిపిసోంది. ఆ పార్టీ పెద్దలే కుమ్ములాటలను ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోంది. క్యాడర్ మాటలకు విలువ వుంటుందా? లేక నాయకుల నిర్ణయాలకే ప్రాదాన్యత వుంటుందా? ఎవరి పెత్తనం ఈ ఎన్నికల్లో వుంటుందన్న దానిపై స్పష్టత లేదు. కొంత కాలంగా ఈటెల రాజేందర్ సైలెంటుగా వుంటున్నాడు. తనకు మెదక్ టికెట్ ఇవ్వకుంటే నా తఢాకా చూపిస్తానని రఘునందన్ రావు అంటున్నారు? మల్కాజిగిరి నియోకవర్గం పై అందరూ కన్నేస్తున్నారు. ఎవరికి వారే నాకే అన్న సంకేతాలు పంపిస్తున్నారు. అయినా పదిహేడు స్ధానాలలో ఎవరు పోటీ చేయొచ్చనేదానిపై ఎవరికీ క్లారిటీ లేదు. పార్టీలోనూ పెద్దగా చర్చ కూడా కనిపించడం లేదు. ఆశావహులు ఎంత మంది వున్నారన్నదానిపై కూడా స్పష్టత లేదు. ఎన్నికల ముందు దాదాపు కామలం ఖాళీ అయినంత పనైంది. ఇప్పుడు నిలబడేందుకు కూడ నాయకులు పెద్దగా ఇష్టపడేందుకు సిద్దంగా లేరని తెలుస్తోంది. కాకపోతే రామ మందిరం సానుకూలత బిజేపికి ఏమైనా కలిసొస్తుందా? అన్నది మాత్రం నాయకుల్లో కొంత ఆశలు చిగురించేందుకు దోహదపడుతోంది. ఈ ఎన్నికలు మూడు నెలల కాంగ్రెస్ ప్రభుత్వానికి రెఫరెండంగా కూడా అనుకోవచ్చు. బిఆర్‌ఎస్ ఓటమిపై మరో స్పందన కూడా కూడా చెప్పుకోవచ్చు. బిజేపికి తెలంగాణలో వున్న బలమెంతో కూడా స్పష్టంగా చూడొచ్చు. ఈ మూడు పార్టీలకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షే..